
ప్రస్తుత కాలంలో మారుతున్న జీవనశైలి, ఆహార అలవాట్ల వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. ఈ క్రమంలో మన పూర్వీకులు రోజూ ఆహారంలో భాగం చేసుకున్న సంప్రదాయ వంటకాల ప్రాధాన్యత మళ్లీ పెరుగుతోంది. అందులోనూ వేసవిలో శరీరానికి చలువ చేసి, జీర్ణవ్యవస్థను మెరుగుపరిచే అద్భుతమైన ఆరోగ్య పానీయం జొన్న అంబలి. ఉదయం టిఫిన్‌గా గానీ లేదా రాత్రి డిన్నర్‌గా గానీ దీనిని హ్యాపీగా తీసుకోవచ్చు. క్రమం తప్పకుండా నెల రోజుల పాటు తాగితే శరీరంలో వచ్చే మార్పులను స్పష్టంగా గమనించవచ్చని ఆహార నిపుణులు చెబుతున్నారు.
వాస్తవానికి జొన్నలలో కార్బోహైడ్రేట్లు, పీచు, ప్రోటీన్లు, ఐరన్, కాల్షియం, మెగ్నీషియం, భాస్వరం, పొటాషియం వంటి ఖనిజాలు, బి విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇది గ్లూటెన్-ఫ్రీ ఆహారం.. అందుకే.. ఇది పలు సమస్యలకు మంచి ఆహారంగా పేర్కొంటున్నారు.
కావలసిన పదార్థాలు:
- జొన్న పిండి: 1 కప్పు
- నీళ్లు: 7 కప్పులు (5 కప్పులు మరగబెట్టడానికి + 2 కప్పులు పిండి కలపడానికి)
- మజ్జిగ: అర లీటరు
- ఉప్పు: రుచికి సరిపడా
- అదనపు రుచి కోసం (ఐచ్ఛికం): సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు.
- తయారీ విధానం:
జావ కాచుకోవడం:
ముందుగా ఒక పాత్రలో 5 కప్పుల నీటిని పోసి స్టవ్‌పై మరగబెట్టాలి.
నీళ్లు మరిగే లోపు, మరొక గిన్నెలో ఒక కప్పు జొన్న పిండికి 2 కప్పుల నీళ్లు పోసి ఉండలు లేకుండా పల్చగా కలుపుకోవాలి.
నీళ్లు బాగా మరిగాక, మంటను లో-ఫ్లేమ్‌లో ఉంచి, ముందుగా కలిపి పెట్టుకున్న జొన్న పిండి మిశ్రమాన్ని మరుగుతున్న నీటిలో పోస్తూ నిరంతరం కలుపుతూ ఉండాలి.
మిశ్రమం చిక్కబడే వరకు మీడియం ఫ్లేమ్‌లో 5 నిమిషాల పాటు అడుగు పట్టకుండా ఉడికించుకోవాలి.
జావ ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి, పైభాగంలో మీగడ కట్టకుండా 2 నిమిషాలు కలుపుతూ చల్లారనివ్వాలి.
పులియబెట్టడం (Ferment):
ఉడికించిన జావను ఒక మట్టి కుండలో గానీ లేదా పాత్రలో గానీ పోసి మూతపెట్టి రాత్రంతా (6 నుండి 7 గంటలు) పులియబెట్టాలి.
ఉదయం కల్లా జావ గట్టిపడి, లైట్‌గా పులిసి ప్రాబయోటిక్స్ (గుడ్ బ్యాక్టీరియా) తయారవుతాయి.
అంబలి సిద్ధం చేయడం:
రాత్రంతా పులిసిన జావను గరిటెతో లేదా పప్పుగుత్తితో ఉండలు లేకుండా మృదువుగా మాష్ చేసుకోవాలి.
ఆ తర్వాత ఇందులో అర లీటరు చిలికిన మజ్జిగ, రుచికి సరిపడా కొద్దిగా ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి.
కావాలనుకుంటే ఇందులో సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి లేదా కొత్తిమీర వేసుకుంటే తాగేటప్పుడు రుచిగా ఉంటుంది.
జొన్న అంబలితో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు:
గుడ్ బ్యాక్టీరియా (Probiotics): జావను రాత్రంతా పులియబెట్టడం వల్ల అందులో మేలు చేసే బ్యాక్టీరియా ఉత్పత్తి అవుతుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడమే కాకుండా రోగనిరోధక శక్తిని (Immunity) విపరీతంగా పెంచుతుంది.
శరీరానికి చలువ: శరీరంలో అధిక వేడితో బాధపడేవారికి ఇది అద్భుతమైన ఔషధంలా పనిచేస్తుంది.
బరువు తగ్గాలనుకునేవారికి: బరువు తగ్గాలి అనుకునేవారికి డైట్‌లో ఇదొక బెస్ట్ ఆప్షన్. కడుపు నిండిన భావన కలిగించి, అనవసరమైన ఆకలిని తగ్గిస్తుంది.
జీర్ణసమస్యలకు చెక్: అసిడిటీ, గ్యాస్, మలబద్ధకం వంటి సమస్యలతో బాధపడేవారు రోజుకొక గ్లాస్ అంబలి తాగడం వల్ల కడుపులో చాలా హాయిగా ఉంటుంది.
ఉదయాన్నే ఏది పడితే అది తినే బదులు.. ఇలా సూపర్ హెల్దీ, టేస్టీగా ఉండే ఈ పాతకాలపు ‘జొన్న అంబలి’ని మీరు కూడా ఇంట్లోనే సులువుగా తయారు చేసుకొని ఆరోగ్యంగా ఉండాలని డైటీషియన్లు చెబుతున్నారు.
గమనిక: ఏమైనా ఆరోగ్య సమస్యలుంటే.. నేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..