తెలుగు సినీ రంగంలో తనదైన ముద్ర వేసిన నటి జయసుధ, సినీ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిన మహానటీమణులు సావిత్రి, వాణిశ్రీ, జయలలితలతో తన వ్యక్తిగత అనుభవాలను, అనుబంధాన్ని పంచుకున్నారు. పరిశ్రమలో “సావిత్రి, వాణిశ్రీ, జయసుధ” అనే త్రయం ప్రస్తావన వస్తే అది అక్కడితో ఆగిపోతుందని, ఆ తర్వాత మరేమీ లేదని ఆమె అభిప్రాయపడ్డారు. సావిత్రి గారితో తనకున్న అనుబంధం గురించి వివరిస్తూ, తాను ఒక తమిళ సినిమాలో ఆమెతో కలిసి నటించానని, అందులో ఆమె తన తల్లి పాత్రను పోషించారని జయసుధ గుర్తు చేసుకున్నారు. అప్పటికి సావిత్రి గారి కెరీర్ దాదాపు అంత్యదశలో ఉందని, ఆమె ఆరోగ్యం కూడా అంతగా సహకరించకపోవడంతో పెద్దగా సంభాషణలు జరపలేదని చెప్పారు. “గుడ్ మార్నింగ్” లేదా “బాగున్నారా” వంటి పలకరింపులకే ఆ పరిచయం పరిమితమైందని, సావిత్రి గారు అలసిపోయి, జీవితంలో చాలా కోల్పోయిన స్థితిలో ఉన్నారని జయసుధ తెలిపారు.
వాణిశ్రీ గారిని తాను పెద్ద అభిమానినని జయసుధ తెలిపారు. కృష్ణవేణి, ఎదురీత వంటి చిత్రాలతో పాటు, హిందీ చిత్రం దాగ్ రీమేక్ లో కూడా వాణిశ్రీ, నాగేశ్వరరావు గారు మరియు తాను కలిసి నటించినట్లు చెప్పారు. తన సినీ కెరీర్ ప్రారంభ దశలో వాణిశ్రీ గారు తనకు ఎంతో మార్గనిర్దేశం చేశారని, “ఇట్లా చేయాలి, అట్లా చేయాలి” అంటూ కొన్ని మెలకువలు నేర్పించారని ఆమె కృతజ్ఞతాపూర్వకంగా స్మరించుకున్నారు. ఆ రోజుల్లో వాణిశ్రీ, జయలలిత వంటి హీరోయిన్లు కార్లోంచి దిగితే ఒక “మహారాణి” దిగినట్టుగా, ఒక ప్రత్యేకమైన ఆరా ఉండేదని జయసుధ చెప్పుకొచ్చారు. జయలలితతో తన అనుబంధం గురించి మాట్లాడుతూ, వారు కలిసి బాగ్దాద్ పేరళగి అనే ఒకే ఒక్క తమిళ చిత్రంలో నటించారని, అది జయలలిత గారి 100వ చిత్రం అని జయసుధ వెల్లడించారు. అవుట్ డోర్ షూటింగ్ సమయంలో ఒకే హోటల్ లో బస చేయడం వల్ల ఇద్దరూ బాగా దగ్గరయ్యారని చెప్పారు. జయలలిత చాలా రిజర్వ్‌డ్‌గా ఉండేవారని, తన పని తాను చేసుకునే స్వభావం కలవారని, పుస్తకాలు ఎక్కువగా చదివేవారని జయసుధ పేర్కొన్నారు.
ఊటీలో జరిగిన ఒక సంఘటనను ఆమె గుర్తు చేసుకున్నారు. ఒక అవుట్ డోర్ షూటింగ్ సమయంలో తనకు తీవ్ర జ్వరం వచ్చిందని, తన తండ్రి యూడి కోలన్ నీళ్లు మార్చుతుండగా, జయలలిత గారు వచ్చి తనను పరామర్శించారని చెప్పారు. “కెన్ ఐ కమ్ ఇన్?” అని అడిగి లోపలికి వచ్చి, స్వయంగా నీళ్లు మార్చి, తన తండ్రి వచ్చేవరకు తనను చూసుకున్నారని, అది తన జీవితంలో మర్చిపోలేని అనుభవం అని జయసుధ భావోద్వేగంగా తెలిపారు. అప్పట్లో ఈ విషయాన్ని తాను మీడియాలో ఎప్పుడూ చెప్పలేదని కూడా ఆమె అన్నారు. జయలలిత గారి ప్రసంగ శైలి, నడవడం, కూర్చోవడం వంటివి అప్పటి నుండీ ముఖ్యమంత్రి అయ్యాక కూడా ఎటువంటి మార్పు లేకుండా, ముత్యాలు రాలినట్టుగా ఉండేవని జయసుధ అన్నారు.
ఎక్కువ మంది చదివినవి : Tollywood : గ్లామర్ సీన్స్ చేస్తానని ఏడ్చేశాను.. నాకెందుకు అలాంటి సీన్స్ రాలేదు.. టాలీవుడ్ హీరోయిన్..
ఎక్కువ మంది చదివినవి : Cinema : రూ.150 కోట్లు పెట్టి పరమ చెత్త సినిమా తీశారు.. ఇండస్ట్రీలో అతిపెద్ద డిజాస్టర్.. ఇప్పటికీ కోలుకోని నిర్మాత..