Headlines

తెలంగాణ ప్రజలకు ఒకే రోజు 10 శుభవార్తలు..! ఆగస్ట్‌ 15న ప్రారంభించబోయే కొత్త పథకాలు ఇవే! | Telangana Aug 15 Big Announcements: Smart Ration Cards, New Pensions and Welfare Schemes

తెలంగాణ ప్రజలకు ఒకే రోజు 10 శుభవార్తలు..! ఆగస్ట్‌ 15న ప్రారంభించబోయే కొత్త పథకాలు ఇవే! | Telangana Aug 15 Big Announcements: Smart Ration Cards, New Pensions and Welfare Schemes


హైదరాబాద్: ఈసారి పంద్రాగస్టు వేడుకలను సంక్షేమ కార్యక్రమాల విస్తరణకు వేదికగా మార్చేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమవుతోంది. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా పలు పథకాల పరిధిలో కొత్త లబ్ధిదారులను చేర్చడంతో పాటు.. ఇప్పటికే అమలవుతున్న సంక్షేమ కార్యక్రమాలను మరింత విస్తరించేందుకు ప్రభుత్వం కార్యాచరణ రూపొందించింది. ముఖ్యంగా పింఛన్లు, ఉచిత విద్యుత్, గ్యాస్ సబ్సిడీ, స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీపై ప్రభుత్వం దృష్టి సారించింది.

2.25 లక్షల మందికి కొత్తగా పింఛన్లు

రాష్ట్రంలో ప్రస్తుతం వివిధ కేటగిరీలకు చెందిన సుమారు 41 లక్షల మందికి ప్రభుత్వం ప్రతి నెలా ఆసరా పింఛన్లు అందిస్తోంది. వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు, బీడీ కార్మికులు, గీత కార్మికులు, చేనేత కార్మికులు సహా పలు వర్గాలు ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందుతున్నాయి.

ఇక కొత్తగా తలసీమియా, సికిల్ సెల్ ఎనీమియా బాధితులను కూడా పింఛన్ పరిధిలోకి తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. మొత్తం 11 కేటగిరీల్లో మరో 2.25 లక్షల మందికి కొత్తగా పింఛన్లు మంజూరు చేసే అవకాశం ఉంది. దీనివల్ల ప్రభుత్వంపై ఏడాదికి సుమారు రూ.500 కోట్ల అదనపు భారం పడుతుందని అంచనా.

5 లక్షల కుటుంబాలకు రూ.500కే గ్యాస్

మహాలక్ష్మి పథకంలో భాగంగా అమలవుతున్న రూ.500కే గ్యాస్ సిలిండర్ పథకాన్ని కూడా మరింత మందికి వర్తింపజేయనున్నారు. ప్రస్తుతం సుమారు 42.90 లక్షల కుటుంబాలు ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నాయి. కొత్తగా స్మార్ట్ రేషన్ కార్డులు పొందే కుటుంబాల్లో దాదాపు 5 లక్షల కుటుంబాలకు గ్యాస్ సబ్సిడీ అందే అవకాశం ఉంది. అర్హతల ఖరారు, ఆర్థిక భారం వంటి అంశాలపై ప్రభుత్వం పరిశీలన కొనసాగిస్తోంది.

3-4 లక్షల కుటుంబాలకు ఉచిత విద్యుత్

గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ప్రస్తుతం సుమారు 50 లక్షల కుటుంబాలకు అందుతోంది. కొత్తగా రేషన్ కార్డులు పొందుతున్న కుటుంబాల్లో 3 నుంచి 4 లక్షల కుటుంబాలు గృహజ్యోతి పథకం పరిధిలోకి వచ్చే అవకాశం ఉంది.దీంతో మరింత మంది పేద, మధ్యతరగతి కుటుంబాలకు విద్యుత్ బిల్లుల నుంచి ఉపశమనం లభించనుంది.

ఆగస్టు 15 నుంచి స్మార్ట్ రేషన్ కార్డులు

రాష్ట్రవ్యాప్తంగా 1.05 కోట్ల రేషన్ కార్డులను స్మార్ట్ కార్డులుగా మార్చే ప్రక్రియకు ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది. ఆగస్టు 15న సంగారెడ్డి జిల్లా కేంద్రంలో మధ్యాహ్నం 2 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీని ప్రారంభించనున్నారు. అదే సమయంలో మిగిలిన 32 జిల్లా కేంద్రాల్లోనూ కార్యక్రమాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

గత రెండున్నరేళ్లలో ప్రభుత్వం 16.32 లక్షల కొత్త రేషన్ కార్డులను మంజూరు చేసింది. దీంతో అదనంగా 61.09 లక్షల మంది ఆహార భద్రత పరిధిలోకి వచ్చినట్లు ప్రభుత్వం వెల్లడించింది. కొత్త కార్డులతో రాష్ట్రంలో మొత్తం రేషన్ కార్డుల సంఖ్య 1.05 కోట్లకు చేరనుంది. వీటి ద్వారా సుమారు 3.42 కోట్ల మందికి ఆహార భద్రత అందనుంది.

ట్యాంపర్ ప్రూఫ్ స్మార్ట్ కార్డులు

కొత్త స్మార్ట్ రేషన్ కార్డులను సురక్షితంగా, ట్యాంపర్ ప్రూఫ్‌గా రూపొందించారు. జిల్లాల వారీగా లబ్ధిదారుల జాబితాలను పూర్తిస్థాయిలో పరిశీలించి పంపిణీ చేయాలని ప్రభుత్వం కలెక్టర్లను ఆదేశించింది. వృద్ధులు, దివ్యాంగులకు ఇబ్బందులు లేకుండా ప్రత్యేక క్యూలు ఏర్పాటు చేయాలని సూచించింది. లబ్ధిదారుల సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించేందుకు గ్రీవెన్స్ సెల్స్ ఏర్పాటు చేయనున్నారు. పంపిణీ ప్రక్రియను పర్యవేక్షించేందుకు సీనియర్ అధికారులను నోడల్ అధికారులుగా నియమించారు.

గిగ్ వర్కర్లకు చట్టపరమైన రక్షణ

గిగ్ వర్కర్ల సంక్షేమం, భద్రత కోసం ప్రభుత్వం రూపొందించిన చట్టాన్ని ఆగస్టు 15 నుంచి అమల్లోకి తీసుకురావాలని నిర్ణయించినట్లు సమాచారం. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను కూడా రూపొందించి అమలు చేయనున్నారు. ఫుడ్‌ డెలివరీ, క్యాబ్ సేవలు, ఇతర ప్లాట్‌ఫామ్ ఆధారిత పనులు చేస్తున్న గిగ్ వర్కర్లకు సామాజిక భద్రత కల్పించే దిశగా ఈ నిర్ణయం కీలకంగా మారనుంది.

అదే రోజు సనత్‌నగర్ టిమ్స్ ప్రారంభం

సంక్షేమ కార్యక్రమాలతో పాటు అభివృద్ధి, వైద్య రంగానికి సంబంధించిన కీలక కార్యక్రమాలకు కూడా పంద్రాగస్టు వేదిక కానుంది. సనత్‌నగర్‌లో నిర్మించిన తెలంగాణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌ (TIMS)ను ఆగస్టు 15న ప్రారంభించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఉస్మానియా ఆసుపత్రి, నిమ్స్‌లో కొత్త భవనాల నిర్మాణ పనులను కూడా వేగవంతం చేయాలని ప్రభుత్వం దృష్టి సారించింది.

మూసీ, గాంధీ సరోవర్, ఫ్యూచర్ సిటీపై ఫోకస్

మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టుపైనా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. ప్రాజెక్టు కోసం రుణ సేకరణకు సంబంధించిన ప్రక్రియ పూర్తవుతున్న నేపథ్యంలో పనులను వేగంగా ముందుకు తీసుకెళ్లాలని భావిస్తోంది. మూసీ పునరుజ్జీవనంలో కీలకమైన గాంధీ సరోవర్ నిర్మాణంతో పాటు ఫ్యూచర్ సిటీ అభివృద్ధికి సంబంధించిన అంశాలపై కూడా పంద్రాగస్టు సందర్భంగా కీలక ప్రకటనలు వెలువడే అవకాశం ఉంది.

సెప్టెంబర్‌లో ఇందిరమ్మ టవర్లకు శంకుస్థాపన

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగస్టు 17 నుంచి 30 వరకు విదేశీ పర్యటనకు వెళ్లనున్న నేపథ్యంలో.. ఆయన తిరిగి వచ్చిన తర్వాత సెప్టెంబర్ మొదటి వారంలో ఇందిరమ్మ టవర్ల నిర్మాణానికి శంకుస్థాపన చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. మొత్తంగా ఈసారి పంద్రాగస్టు సందర్భంగా సంక్షేమ పథకాల విస్తరణతో పాటు కొత్త కార్యక్రమాలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది రేవంత్ సర్కార్.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *