Best Cricketer Of All Time: సచిన్ తెందూల్కర్, విరాట్ కోహ్లీలలో ఆల్ టైమ్ గ్రేట్ క్రికెటర్ ఎవరనే వివాదంపై ఆస్ట్రేలియా స్పీడ్ స్టర్ బ్రెట్ లీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వీరిద్దరినీ కాదని, తన ఐపీఎల్ సహచర ఆటగాడు, దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్‌ను ప్రపంచంలోనే అత్యుత్తమ క్రికెటర్‌గా అభివర్ణించి అందరినీ ఆశ్చర్యపరిచాడు.
క్రికెట్ చరిత్రలో ఆల్ టైమ్ బెస్ట్ ప్లేయర్ ఎవరనే చర్చ దశాబ్దాలుగా కొనసాగుతూనే ఉంది. భారత్‌కు చెందిన క్రికెట్ దేవుడు సచిన్ తెందూల్కర్ లేదా రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ పేర్లను అత్యధికులు ప్రతిపాదిస్తుంటారు. ఆస్ట్రేలియా మాజీ వేగవంతమైన బౌలర్ బ్రెట్ లీ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడూ ఈ అంశంపై భిన్నమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. తన దృష్టిలో అత్యుత్తమ బ్యాటర్ సచిన్ తెందూల్కర్ అయినప్పటికీ, ఓవరాల్‌గా అత్యుత్తమ క్రికెటర్ మాత్రం దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్ జాక్వెస్ కల్లిస్ అని స్పష్టం చేశాడు.
అంకెలు ఎప్పుడూ అబద్ధం చెప్పవు..: జాక్వెస్ కల్లిస్ సాధించిన ఘనతలను బ్రెట్ లీ ప్రత్యేకంగా కొనియాడాడు. క్రికెట్ ప్రపంచంలో అత్యంత కష్టమైన పనుల్లో ఆల్‌రౌండర్ పాత్ర ఒకటని, కల్లిస్ సాధించిన గణాంకాలే అతని గొప్పతనానికి నిదర్శనమని చెప్పాడు. టెస్టులు, వన్డేలు రెండింటిలోనూ 10,000 కంటే ఎక్కువ పరుగులు చేయడంతో పాటు 250 కంటే ఎక్కువ వికెట్లు పడగొట్టిన ఏకైక ఆటగాడు కల్లిస్ మాత్రమే. ఇటు బ్యాటింగ్‌లోనూ, అటు బౌలింగ్‌లోనూ, స్లిప్ ఫీల్డింగ్‌లోనూ కల్లిస్ చూపించిన నైపుణ్యం మ్యాచ్ ఫలితాలను మార్చేసేదని లీ గుర్తు చేసుకున్నాడు.
కేకేఆర్ జట్టులో కలిసి పనిచేసిన అనుభవం..: బ్రెట్ లీ, జాక్వెస్ కల్లిస్ ఇద్దరూ ఐపీఎల్లో కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) తరపున కలిసి ఆడారు. 2012లో గౌతమ్ గంభీర్ సారథ్యంలో కేకేఆర్ ఛాంపియన్‌గా నిలిచినప్పుడు వీరిద్దరూ ఆ విజయంలో కీలక పాత్ర పోషించారు. డ్రెస్సింగ్ రూమ్‌లో కల్లిస్ ఎంత ప్రశాంతంగా ఉంటాడో, మైదానంలోకి దిగేముందు ఎంత సరదాగా ఉంటాడో దగ్గరుండి చూశానని లీ తెలిపాడు. తీవ్రమైన ఒత్తిడి ఉన్న సమయంలో కూడా ఎంతో కూల్‌గా ఉంటూ ఇన్నింగ్స్ నిర్మించే తత్వం కల్లిస్ సొంతమని లీ కొనియాడాడు.
విరాట్ కోహ్లీ ఫామ్‌పై ఘాటు వ్యాఖ్యలు..: ఈ సందర్భంగా భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ గురించి కూడా బ్రెట్ లీ ప్రస్తావించాడు. తొలిసారి విరాట్ కళ్లలోకి చూసినప్పుడే అతనిలో గెలవాలనే తపన, కసి స్పష్టంగా కనిపించాయని చెప్పాడు. ఒకటి రెండు మ్యాచుల్లో పరుగులు చేయకపోతే కోహ్లీ పని అయిపోయిందని విమర్శించేవారిని బ్రెట్ లీ తీవ్రంగా తప్పుపట్టాడు. అవన్నీ పిచ్చి మాటలని, విరాట్ సాధించిన అసాధారణ రికార్డులను చూడాలని సూచించాడు. కోహ్లీలో ఇంకా చాలా క్రికెట్ మిగిలి ఉందని, అతను మళ్లీ విరుచుకుపడతాడని ధీమా వ్యక్తం చేశాడు.




