ఆరోగ్యకరమైన జుట్టు, కాంతివంతమైన చర్మం కావాలని ఎవరికి ఉండదు, ప్రతి ఒక్కరి కోరిక ఇదే. కానీ నేటి జీవనశైలి, తీసుకుంటున్న ఆహారం వలన జుట్టు రాలడం, చర్మ సమస్యలు సర్వసాధారణం అయ్యాయి. దీంతో చాలా మంది జుట్టు రాలడం సమస్య నుంచి బయటపడటానికి అనేక రకాల రసాయనాలు వాడుతున్నారు. అయితే అవి ఏవీ వాడకుండా, దీని కోసం ఇంటిలోనే పరిష్కారం పొందవచ్చునంట. ఒక్క లడ్డు మీ జుట్టుకు, చాలా మేలు చేస్తుందంట. ఇంతకీ ఇది ఏది అంటే, పోషకాలు నిండి డ్రై ఫ్రూట్ లడ్డూ, ఇంట్లో ఎలా చేయాలంటే?
తయారీకి కావలసిన పదార్థాలు: నెయ్యి: 2 టేబుల్ స్పూన్లు, పిస్తా: ¾ కప్పు, జీడిపప్పు: ¾ కప్పు, బాదం: ¾ కప్పు, ఎండు ద్రాక్ష: అర కప్పు, తెల్ల నువ్వులు: అర కప్పు, గసగసాలు: 1 టేబుల్ స్పూన్, తురిమిన కొబ్బరి,ఖర్జూరం, యాలకుల పొడి ఒక టీ స్పూన్.
ముందుగా, ఒక కడాయిని వేడి చేసి, అందులో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేయాలి. నెయ్యి కరిగాక, ముప్పావు కప్పు పిస్తా, ముప్పావు కప్పు జీడిపప్పు, ముప్పావు కప్పు బాదం వేసి, తక్కువ మంటపై కరకరలాడేంత వరకు వేయించాలి. రంగు మారిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసి చల్లార్చాలి. అదే కడాయిలో, ఒక గుప్పెడు ఎండు ద్రాక్ష వేసి, తక్కువ మంటపై బెలూన్ లాగా ఉబ్బే వరకు వేయించాలి. ఇది కూడా అర కప్పు ఉంటుంది. వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి.
ఇప్పుడు అదే కడాయిలో, అర కప్పు తెల్ల నువ్వులు, ఒక టేబుల్ స్పూన్ గసగసాలు, ఒక కప్పు తురిమిన కొబ్బరి వేసి, బంగారు రంగు వచ్చేవరకు వేయించాలి. పచ్చి కొబ్బరి వాడినట్లయితే, అందులోని తేమ పోయే వరకు బాగా వేయించుకోవాలి. వేగిన తర్వాత దీనిని కూడా ఒక గిన్నెలోకి తీసి పక్కన పెట్టుకోవాలి. చల్లారిన నట్స్‌ను మిక్సీ జార్లో వేసి, నీళ్లు లేకుండా బరకగా రుబ్బుకోవాలి. మరీ మెత్తగా రుబ్బకూడదు. ఈ పొడిని వేయించిన నువ్వులు, గసగసాలు, కొబ్బరి ఉన్న గిన్నెలోకి మార్చాలి.
అదే మిక్సీ జార్లో, గింజలు తీసిన ఒక కప్పు ఖర్జూరం, వేయించిన ఎండు ద్రాక్ష వేసి, బరకగా రుబ్బుకోవాలి. ఇది కూడా మరీ మెత్తగా కాకుండా, కొంచెం ముద్దగా రుబ్బుకోవాలి. రుబ్బిన ఖర్జూరం, ఎండు ద్రాక్ష మిశ్రమాన్ని నట్స్ పొడి ఉన్న గిన్నెలోకి వేయాలి. ఇప్పుడు, ఒక టీస్పూన్ యాలకుల పొడి వేసి, అన్నింటినీ చేతితో బాగా కలపాలి. ఖర్జూరం, ఎండు ద్రాక్షలో ఉన్న తేమ, నట్స్‌లో ఉన్న సహజ నూనెలు, మనం వేసిన నెయ్యి లడ్డూలు చుట్టడానికి సరిపోతాయి. అదనపు తీపి లేదా ద్రవాలు అవసరం లేదు. మిశ్రమాన్ని చిన్న లడ్డూలుగా చుట్టుకొని ఒక ప్లేట్లోకి మార్చాలి. అంతే డ్రై ఫ్రూట్ లడ్డూ రెడీ.




