
బ్రిటన్ రాయల్ మెరైన్స్ ఉపయోగిస్తున్న నిఘా డ్రోన్లలో ఒక పెద్ద భద్రతా లోపం బయటపడింది. ఆ డ్రోన్లకు అమర్చిన కెమెరాలు సైలెంట్‌గా చైనాలోని ఒక ఐపీ అడ్రస్‌కు సమాచారాన్ని పంపుతున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ విషయం తెలియగానే బ్రిటన్ రక్షణ మంత్రిత్వ శాఖ తీవ్రంగా స్పందించింది. వెంటనే ఆ డ్రోన్ పరికరాలకు ఉన్న ఇంటర్నెట్ కనెక్షన్‌ను పూర్తిగా కట్ చేసి పడేసింది. ది డైలీ టెలిగ్రాఫ్ ప్రచురించిన కథనం ప్రకారం.. బ్రిటన్ సైన్యానికి క్రాకెన్ టెక్నాలజీ గ్రూప్ అనే డిఫెన్స్ కంపెనీ K3 స్కౌట్ అనే నిఘా డ్రోన్లను సరఫరా చేసింది. అయితే ఈ కంపెనీ డ్రోన్ల తయారీలో వాడిన కెమెరాలను మరొక థర్డ్ పార్టీ కంపెనీ నుంచి కొనుగోలు చేసింది. ఆ కెమెరాలు చైనాలో తయారైనవి కావడం గమనార్హం. రక్షణ శాఖకు చెందిన సైబర్ నిపుణులు రోజూలాగే తమ సిస్టమ్స్‌ను తనిఖీ చేస్తున్న సమయంలో ఈ కెమెరాల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈ కెమెరాలు చైనాలోని ఒక సర్వర్‌కు నిరంతరం హార్ట్‌బీట్ కమ్యూనికేషన్స్ పంపుతున్నట్లు తేలింది. అంటే.. ‘‘నేను ఆన్‌లోనే ఉన్నాను, సరిగ్గా పనిచేస్తున్నాను’’ అని పరికరం పంపే సిగ్నల్ అన్నమాట. అయితే సైన్యంలో వాడే కెమెరాల నుంచి చైనాలోని తెలియని సర్వర్లకు ఇలాంటి సిగ్నల్స్ వెళ్లడం భద్రతా పరంగా పెద్ద ముప్పుగా మారే అవకాశం ఉందని గ్రహించారు.
రక్షణ శాఖ ఏమంటోంది?
ఈ వార్త బయటకు రావడంతో బ్రిటన్ రక్షణ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. ‘‘మేము క్రమం తప్పకుండా చేసే సెక్యూరిటీ చెకింగ్స్‌లోనే ఈ సమస్యను ముందే కనిపెట్టాం. ఈ కెమెరాల వల్ల మా సైన్యానికి చెందిన ఎలాంటి రహస్య డేటా గానీ, కీలకమైన సమాచారం గానీ బయటకు లీక్ అవ్వలేదు. మా నెట్‌వర్క్, మిలిటరీ సిస్టమ్స్ అన్నీ సురక్షితంగానే ఉన్నాయి’’ అని తెలిపింది. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరుపుతున్నట్లు స్పష్టం చేసింది. అదేవిధంగా సైనిక సామగ్రి, డేటా భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తామని, ఇలాంటి ముందస్తు తనిఖీల వల్లే ప్రమాదాలను మొదట్లోనే నివారించగలుగుతున్నామని తెలిపారు.
రూ. 130 కోట్లకు పైగా విలువైన ప్రాజెక్ట్
బ్రిటన్ నావికాదళం తమ సైన్యాన్ని ఆధునీకరించే క్రమంలో హైబ్రిడ్ నేవీ అనే ప్రాజెక్ట్‌ను ప్రారంభించింది. అంటే మనుషులు అవసరం లేని డ్రోన్లు, పడవలను సాంప్రదాయ సైన్యంతో కలిపి వాడటం అన్నమాట. ఇందులో భాగంగానే గతేడాది మార్చిలో సుమారు రూ.130 కోట్లకు పైగా ఖర్చు పెట్టి 20 మానవరహిత బోట్లు, డ్రోన్లను కొనుగోలు చేసింది. ఆ సమయంలో నావికాదళ వైస్ అడ్మిరల్ పాల్ బీటీ మాట్లాడుతూ.. ‘‘ఇది మా నావికాదళ చరిత్రలోనే ఒక పెద్ద మైలురాయి’’ అని చెప్పుకొచ్చారు. కానీ తీరా చూస్తే ఇప్పుడు ఆ డ్రోన్లలోనే ఈ భద్రతా లోపం బయటపడింది.
ముందు ముందు పెద్ద ప్లాన్.. కానీ..
బ్రిటన్ ప్రభుత్వం తమ త్రివిధ దళాలలో డ్రోన్ల వాడకాన్ని విపరీతంగా పెంచాలని ప్లాన్ చేస్తోంది. ఇటీవలే అక్కడి రక్షణ కార్యదర్శి డ్యాన్ జార్విస్ దాదాపు రూ.50,000 కోట్లకు పైగా బడ్జెట్‌తో డ్రోన్ ట్రాన్స్‌ఫార్మేషన్ అనే ప్రాజెక్ట్‌ను కూడా ప్రకటించారు. మిలిటరీ అవసరాల కోసం విదేశీ పరికరాలపై ఆధారపడితే ఎంత ప్రమాదమో ఈ ఘటన స్పష్టం చేసింది. దాంతో ఇకపై సైనిక కాంట్రాక్టర్లు వాడే ప్రతీ విడిభాగాన్ని ఇంకా కఠినంగా పరీక్షించాలని, చైనా తయారీ వస్తువులను మిలిటరీలో పూర్తిగా నిషేధించాలని బ్రిటన్ యోచిస్తోంది.