Headlines

Sadhguru: ప్రకృతితో ముడిపడిన జీవితాలు.. హిమాలయ వాసులపై సద్గురు అదిరిపోయే ఫోటో బుక్.. | Union Minister Mansukh Mandaviya Launches Sadhguru New Book Disappearing Faces

Sadhguru: ప్రకృతితో ముడిపడిన జీవితాలు.. హిమాలయ వాసులపై సద్గురు అదిరిపోయే ఫోటో బుక్.. | Union Minister Mansukh Mandaviya Launches Sadhguru New Book Disappearing Faces


ఈశా ఫౌండేషన్ వ్యవస్థాపకులు సద్గురు దశాబ్దాలుగా హిమాలయ ప్రాంతాల్లో జరిపిన పర్యటనల్లో తాను కలుసుకున్న ప్రజలు, వారి జీవన విధానాన్ని దృశ్యరూపంలో ఆవిష్కరిస్తూ రూపొందించిన కొత్త ఫోటో వ్యాస పుస్తకం డిసప్పియరింగ్ ఫేసెస్ ఢిల్లీలో ఘనంగా ఆవిష్కృతమైంది. ఢిల్లీలోని ఇండియా ఇంటర్నేషనల్ సెంటర్‌లో సోమవారం జరిగిన ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ ముఖ్య అతిథిగా పాల్గొని పుస్తకాన్ని ఆవిష్కరించారు. పెంగ్విన్ ఇండియా ప్రచురించిన ఈ పుస్తకం.. నేపాల్, టిబెట్‌లోని సుదూర, మారుమూల హిమాలయ ప్రాంతాల్లో నివసించే ప్రజల విశిష్టమైన జీవిత చిత్రాలను, వారి ముఖాల్లోని భావాలను పాఠకులకు కళ్లకట్టేలా చూపిస్తుంది.

ప్రకృతితో ముడిపడి ఉన్న జీవితం

పుస్తక ఆవిష్కరణ అనంతరం ప్రముఖ రచయిత, వ్యాఖ్యాత ఆనంద్ రంగనాథన్‌తో జరిగిన సంభాషణలో సద్గురు ఈ ఫోటోల వెనుక ఉన్న జ్ఞాపకాలను పంచుకున్నారు. ‘‘త్వరలోనే అదృశ్యమైపోయే ఒక అరుదైన యుగానికి ఈ ముఖాలు ప్రతిరూపాలు. ఆధునిక సమాచార కాలుష్యానికి దూరంగా, కేవలం వెలుగునీడలు, వేడి-చలి, వసంతాలు-చలికాలాల అనుభూతులతో మాత్రమే రూపుదిద్దుకున్న ముఖాలివి. మన జ్ఞానేంద్రియాలు మనిషిని జీవన సరిహద్దుల వైపు తీసుకెళ్తాయి. అక్కడ ఎలాంటి అనవసరమైన సమాచారం ఉండదు. రూపురేఖల్లో ఎంతో సాధారణంగా అనిపించినా.. ఆయా ప్రాంతాల నేల, గాలులు, నీరు, మనుషులతో ముడిపడి ఉన్న బలమైన అనుభవాల సమృద్ధి వారి ముఖాల్లో కనిపిస్తుంది. గత ఐదు దశాబ్దాలుగా, హిమాలయాల అందాల కంటే ఈ మనుషుల ముఖాలే నన్ను ఆ పర్వతాల లోతుల్లోకి ఆకర్షించాయి’’ అని సద్గురు తెలిపారు.

హిమాలయాలతో సద్గురు అనుబంధం

2006లో మొదటిసారిగా మానససరోవరం, కైలాస పర్వతాలకు ప్రయాణం ప్రారంభించిన సద్గురు, నాటి నుంచి నిరంతరం ఆధ్యాత్మిక సాధకులను హిమాలయ యాత్రలకు తీసుకెళ్తున్నారు. 2025లో తొలిసారిగా కైలాస పర్వతానికి బైక్ యాత్ర చేపట్టిన ఆయన, ఈ ఏడాది కూడా మోటార్ సైకిల్‌పైనే హిమాలయ పవిత్ర భూమికి పునరాగమనం చేయడానికి సిద్ధమవుతున్నారు. మానవాళి శ్రేయస్సు, సచేతనత్వాన్ని పెంపొందించడం, పర్యావరణ పరిరక్షణతో పాటు హిమాలయాలతో సద్గురుకి ఉన్న అనుబంధం ప్రత్యేకమైనది.

పుస్తకం ఎక్కడ లభిస్తుంది?

పెంగ్విన్ ఇండియా ప్రచురించిన డిసప్పియరింగ్ ఫేసెస్ హార్డ్‌బ్యాక్, పేపర్‌బ్యాక్ ఎడిషన్లలో అందుబాటులో ఉంది. ఈ పుస్తకం అమెజాన్, క్రాస్‌వర్డ్, స్వప్నఆన్‌లైన్, అట్లాంటిక్ అధికారిక వెబ్‌సైట్‌లలో అందుబాటులో ఉంది.

వెబ్‌సైట్ లింక్: penguin.co.in/book/disappearing-faces/.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *