Headlines

మళ్లీ గెలికాడు రోయ్..! హర్భజన్‌కు శ్రీశాంతే రూమ్‌మేట్‌గా కావాలట..! కారణం ఇదే!

మళ్లీ గెలికాడు రోయ్..! హర్భజన్‌కు శ్రీశాంతే రూమ్‌మేట్‌గా కావాలట..! కారణం ఇదే!


మళ్లీ గెలికాడు రోయ్..! హర్భజన్‌కు శ్రీశాంతే రూమ్‌మేట్‌గా కావాలట..! కారణం ఇదే!

టీమిండియా మాజీ స్టార్ స్పిన్నర్ హర్భజన్ సింగ్‌, మాజీ పేసర్ శ్రీశాంత్‌కు మధ్య గతంలో ఏర్పడిన గ్యాప్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇద్దరూ భారత జట్టు కోసం కలిసి ఆడటమే కాకుండా.. 2007 టీ20 వరల్డ్ కప్, 2011 వన్డే ప్రపంచకప్ విజయాల్లోనూ భాగస్వామ్యమయ్యారు. అయితే 2008 ఐపీఎల్‌ తొలి సీజన్‌లో హర్భజన్ సింగ్ శ్రీశాంత్‌ను చెంప మీద గొట్టడం (స్లాప్‌గేట్) అప్పట్లో దేశవ్యాప్తంగా మార్మోగాయి. ఈ ఘటన తర్వాత ఇద్దరి మధ్య చాలాకాలం పాటు మాటలు కూడా లేవు. అయితే ఆ తర్వాత ఇద్దరి మధ్య వివాదం దాదాపుగా సమిసిపోయినట్లు కనిపించింది.

గతంలో హర్భజన్ సింగ్ ఆ ఘటనపై పలుమార్లు పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. 2008 ఐపీఎల్‌లో జరిగిన ఘటన తన కెరీర్‌లో మార్చాలనుకునే ఒక విషయమని కూడా ఆయన చెప్పారు. ఇద్దరూ ఇప్పుడు మంచి సంబంధాన్ని కొనసాగిస్తున్నట్లు పలు సందర్భాల్లో హర్భజన్, శ్రీశాంత్ చెప్పారు. బయటకు ఇలా చెబుతున్నా.. ఇద్దరు ఆటగాళ్ల మధ్య ఇంకా గ్యాప్ కొనసాగుతోందన్న ప్రచారం కూడా ఉంది. గతంలో తమ మధ్య జరిగిన వివాదాన్ని హర్భజన్ ఓ కమర్షియల్ యాడ్‌లో వాడుకోవడాన్ని శ్రీశాంత్ తీవ్రంగా తప్పుబట్టారు. వివాదానికి కొనసాగింపుగానే.. నీకు దమ్ముంటే బాక్సింగ్ రింగ్‌లోకి రా అంటూ హర్భజన్ సింగ్‌ను శ్రీశాంత్ ఛాలెంజ్ చేయడం దుమారం రేపింది.  చాలా ఏళ్లు గడిచినా గ్రౌండ్‌లో భజ్జీ, శ్రీశాంత్ మధ్య జరిగిన ఈ వివాదం ఏదో ఒక సందర్భంలో చర్చకు వస్తూనే ఉంది.

తాజాగా హర్భజన్ సింగ్‌ను పీటీఐ‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఓ ఆసక్తికరమైన ప్రశ్న అడిగారు. తనకు ఇష్టమైన క్రికెటర్‌తో రూమ్‌మేట్‌గా ఉండే అవకాశం వస్తే ఎవరిని ఎంచుకుంటారని ప్రశ్నించగా.. ఆయన ఎలాంటి తడబాటు లేకుండా శ్రీశాంత్ పేరును చెప్పడం ఆసక్తికరంగా మారింది. సచిన్ టెండుల్కర్, ధోనీ లాంటి ఆటగాళ్లను తోసిరాజని భజ్జీ శ్రీశాంత్‌ను ఎంచుకోవడం విశేషం.

శ్రీశాంత్‌నే ఎందుకు ఎంచుకున్నాడు?

శ్రీశాంత్‌ను ఎందుకు రూమ్‌మేట్‌గా ఎంచుకుంటానో భజ్జీ వివరణ ఇచ్చాడు. ఇద్దరూ ఒకే రూమ్‌లో ఉంటే తమ మధ్య నెలకొన్న విభేదాలను ఇద్దరూ కలిసి పరిష్కరించుకోవచ్చని తాను భావిస్తున్నట్లు హర్భజన్ పేర్కొన్నాడు. అందుకే శ్రీశాంత్‌ను తన రూమ్‌మేట్‌గా పిక్ చేస్తే తనకు ఎలాంటి అభ్యంతరమూ లేదన్నారు. తన వ్యాఖ్యలతో శ్రీశాంత్‌తో నెలకొన్న వివాదం ఇంకా పూర్తిగా సమిసిపోలేదని భజ్జీ చెప్పకనే చెప్పారు. మరి హర్భజన్ కామెంట్స్‌పై శ్రీశాంత్ ఎలా స్పందిస్తాడన్నది ఆసక్తికరంగా మారింది.

2008 ‘స్లాప్‌గేట్’ ఏంటి?

2008 ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్, అప్పటి కింగ్స్ XI పంజాబ్ మధ్య మ్యాచ్ అనంతరం హర్భజన్, శ్రీశాంత్ మధ్య వివాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో శ్రీశాంత్‌ను హర్భజన్ చెంప మీద కొట్టడం తీవ్ర వివాదానికి దారితీసింది. దీంతో హర్భజన్‌పై టోర్నీ మిగతా భాగానికి నిషేధం విధించారు. హర్భజన్-శ్రీశాంత్ బాండింగ్ మీద తాజాగా మరోసారి చర్చ జరగడం క్రికెట్ అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *