Headlines

తండ్రి వీలునామా రాయకుండా చనిపోతే.. పెళ్లైన కూతురికి ఆస్తిలో వాటా ఉంటుందా..? చట్టం ఏం చెప్తుందో తెలుసుకోండి.. | No Will Left Behind, Here How Property Is Divided Among Sons and Daughters

తండ్రి వీలునామా రాయకుండా చనిపోతే.. పెళ్లైన కూతురికి ఆస్తిలో వాటా ఉంటుందా..? చట్టం ఏం చెప్తుందో తెలుసుకోండి.. | No Will Left Behind, Here How Property Is Divided Among Sons and Daughters


తల్లిదండ్రులు కష్టపడి సంపాదించిన ఆస్తి వారు చనిపోయాక పిల్లలకే దక్కుతుంది. అయితే జీవించి ఉన్నప్పుడే వీలునామా రాయకపోవడం వల్ల చాలా కుటుంబాల్లో ఆస్తుల పంపకాల విషయంలో మనస్పర్థలు, కోర్టు కేసులు ఎదురవుతున్నాయి. ఒక వ్యక్తి వీలునామా రాయకుండానే మరణిస్తే వారి ఆస్తి ఎవరికి చెందుతుంది? కొడుకులు, కూతుళ్లకు ఉండే చట్టపరమైన హక్కులేంటి? అనే అంశాలపై స్పష్టమైన అవగాహన ఉండటం అవసరం. ఒక వ్యక్తి తన ఆస్తులపై ఎలాంటి వీలునామా రాయకుండా మరణిస్తే, చట్టం ప్రకారం ఆయన ఆస్తిని మొదటి తరగతి వారసులు పొందుతారు. ఇందులో మరణించిన వ్యక్తి భార్య, పిల్లలు, తల్లి ఉంటారు. ఆస్తిని ఎటువంటి లింగభేదం లేకుండా వీరిందరికీ సమాన భాగాలుగా పంచుతారు.

తండ్రి ఆస్తిలో కూతురి హక్కు ఎంత?

హిందూ వారసత్వ సవరణ చట్టం-2005 ప్రకారం, తండ్రి ఆస్తిపై కొడుకులతో పాటు కూతుళ్లకు కూడా సమాన హక్కులు ఉంటాయి. తండ్రి తన స్వయం సంపాదనతో కొనుగోలు చేసిన ఆస్తి విషయంలో వీలునామా రాయకుండా మరణిస్తే కూతురికి కొడుకుతో సమానంగా వాటా దక్కుతుంది. ఇకవేళ తండ్రి జీవించి ఉన్నప్పుడే వీలునామా ద్వారా వేరొకరికి రాసిస్తే, కూతురు దానిపై ఎలాంటి హక్కును క్లెయిమ్ చేయలేదు. అదే తాతముత్తాతల నుండి సంక్రమించిన పూర్వీకుల ఆస్తిలో మాత్రం పుట్టుకతోనే కూతురికి కొడుకుతో సమానంగా హక్కు లభిస్తుంది.

విడాకులు తీసుకున్న మహిళ పిల్లలకి తండ్రి ఆస్తి దక్కుతుందా?

సమాజంలో చాలామందికి వచ్చే మరో పెద్ద డౌట్.. విడాకుల తర్వాత పిల్లల హక్కుల గురించి. చట్టప్రకారం.. దంపతులు విడాకులు తీసుకున్నంత మాత్రాన పిల్లలకు వారి తండ్రి పూర్వీకుల ఆస్తిపై ఉన్న హక్కు రద్దు కాదు. విడాకుల తర్వాత మాజీ భర్త రెండో పెళ్లి చేసుకుని, మరో సంతానం కలిగి ఉన్నప్పటికీ.. మొదటి భార్య సంతానానికి పూర్వీకుల ఆస్తిలో చట్టబద్ధమైన సమాన వాటా దక్కుతుంది.

వీలునామా vs బహుమతి.. ?

చాలామంది తల్లిదండ్రులు తమ జీవితకాలంలోనే ముఖ్యంగా కూతుళ్ల వివాహ సమయంలో లేదా ఆ తర్వాత ఇల్లు, స్థలం, నగదు రూపంలో ఆస్తిని బహుమతిగా ఇవ్వాలని భావిస్తారు.

గిఫ్ట్ డీడ్: ఆస్తిని బహుమతిగా ఇచ్చిన వెంటనే దానిపై యజమానత్వ హక్కులు అవతలి వ్యక్తికి బదిలీ అవుతాయి.

వీలునామా: ఒకవేళ యజమాని మరణం వరకు ఆస్తి అనుభవ హక్కును తమ వద్దే ఉంచుకోవాలనుకుంటే వీలునామా రాయడమే సరైన మార్గం. ఉదాహరణకు: ఒక వ్యక్తి తన కష్టార్జితంతో రెండు ఇళ్లు కొని, తన ఇద్దరు పిల్లలకు ఇవ్వాలనుకున్నాడనుకోండి. ఆయన జీవించి ఉన్నంత కాలం ఆ ఇళ్లకు ఆయనే యజమానిగా ఉంటూ.. ఆయన మరణానంతరం మాత్రమే ఆ ఇళ్లు పిల్లలకు చెందేలా వీలునామాలో స్పష్టమైన నిబంధనలు రాసుకోవచ్చు.

నిపుణుల సలహా

కుటుంబంలో భవిష్యత్తులో వచ్చే ఆస్తి తగాదాలను, చట్టపరమైన సమస్యలను నివారించడానికి ప్రతి ఒక్కరూ తాము సంపాదించిన ఆస్తులపై జీవించి ఉన్నప్పుడే స్పష్టమైన వీలునామా రాయడం లేదా సరైన మార్గంలో లీగల్ ప్లానింగ్ చేసుకోవడం మంచిది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *