Headlines

డైమండ్స్ కంటే ఖరీదైన పురుగు.. కిలో ధర ఎంతో తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే.. | More Expensive Than Gold, Why Himalayan Yarsagumba Costs Up to Rs 60 Lakh per Kg


సాధారణంగా ప్రపంచంలో అత్యంత విలువైన వస్తువులు అంటే బంగారం, వజ్రాలే మనకు గుర్తొస్తాయి. కానీ హిమాలయాల్లో లభించే ఒక వింతైన కీటకం ధర బంగారం కంటే ఎన్నో రెట్లు ఎక్కువ. ఇటీవల సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్న ఈ పురుగు పేరు యార్సాగుంబా. శాస్త్రీయంగా దీన్ని కార్డిసెప్స్ సైనెన్సిస్ అని పిలుస్తారు. భారతదేశంలో కీడా జడి అని, అంతర్జాతీయ మార్కెట్లో హిమాలయన్ వయాగ్రా అని పిలిచే ఈ జీవికి అంతర్జాతీయ మార్కెట్లో కిలో ధర రూ. 20 లక్షల నుంచి రూ. 60 లక్షల వరకు పలుకుతోంది.

సగం కీటకం.. సగం మూలిక: ఇది ఎలా ఏర్పడుతుంది?

యార్సాగుంబా అనేది పూర్తిగా కీటకం కాదు, అలాగని కేవలం మొక్క కూడా కాదు. ఇదొక విచిత్రమైన సహజ జీవ ప్రక్రియ. హిమాలయ పర్వతాల మంచు కింద ఉండే ఘోస్ట్ మాత్ గొంగళి పురుగుల శరీరంలోకి ఒక ప్రత్యేకమైన పరాన్నజీవి ఫంగస్ ప్రవేశిస్తుంది. ఆ ఫంగస్ క్రమంగా లార్వాను లోపలి నుంచే చంపేసి దాని శరీరాన్ని మమ్మీలా మారుస్తుంది. అనంతరం వేసవిలో మంచు కరిగే సమయంలో చనిపోయిన ఆ కీటకం తల భాగం నుంచి ఒక చిన్న మొలక లేదా కాండం రూపంలో బయటకు పెరుగుతుంది. హిమాలయ ప్రాంతాల స్థానిక ప్రజలు అత్యంత కష్టతరమైన ఎత్తైన మంచు కొండల్లో గాలిస్తూ ఈ అరుదైన మూలికను సేకరిస్తారు.

హిమాలయన్ వయాగ్రాగా ఎందుకు పిలుస్తారు?

చైనా సంప్రదాయ వైద్యంలో, పురాతన ఆయుర్వేదంలో వందల ఏళ్లుగా యార్సాగుంబాను ఒక అద్భుత ఔషధంగా వాడుతున్నారు. ఇది శరీరంలో ప్రాణవాయు వినియోగాన్ని పెంచి, తీవ్ర అలసటను తగ్గించడంలో సహాయపడుతుంది. పురుషులలో లైంగిక సామర్థ్యాన్ని, జీవశక్తిని పెంచే గుణాలు ఉండటం వల్ల దీనికి హిమాలయన్ వయాగ్రా అనే పేరు వచ్చింది. శరీరంలో వ్యాధినిరోధక శక్తిని పెంచడంతో పాటు వృద్ధాప్య ఛాయలను ఆలస్యం చేయడంలో ఇది కీలకంగా పనిచేస్తుంది. కిడ్నీలు, కాలేయం, శ్వాసకోశ వ్యవస్థను బలోపేతం చేయడంతో పాటు క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధించే గుణాలు దీనిలో ఉన్నట్లు పలు శాస్త్రీయ అధ్యయనాలు వెల్లడించాయి.

బంగారం కంటే ఎందుకు అంత ఖరీదు?

యార్సాగుంబాను ల్యాబ్‌లలో కృత్రిమంగా పెంచడం సాధ్యం కాదు. ఇది సముద్ర మట్టానికి 3,000 నుంచి 5,000 మీటర్ల ఎత్తులోని హిమాలయ పర్వత శ్రేణుల్లో మాత్రమే సహజంగా లభిస్తుంది. మార్కెట్లో దీనికి ఉన్న అపారమైన డిమాండ్‌తో పోలిస్తే సరఫరా చాలా తక్కువగా ఉండటం దీనిలోని తిరుగులేని ఔషధ విలువల వల్లే ఈ చిన్న కీటకం బంగారం కంటే అత్యంత ఖరీదైన సంపదగా మారింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *