Headlines

పేదింటి అమ్మాయి అని తాళి కడితే.. 5 రోజులకే అంతా సర్దేసింది.. ఏం జరిగిందో తెలిస్తే బిత్తరపోవాల్సిందే.. | Agra Bride Flees 5 Days After Wedding with Rs 11 Lakh Jewellery and Cash, Court Orders FIR


ఆగ్రాలో ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. పేదింటి పిల్ల అని నమ్మి పెళ్లి చేసుకుంటే.. ఆ యువతి ఐదు రోజులకే తన అసలు రంగు బయటపెట్టింది. ఇంట్లోని బంగారు, వెండి ఆభరణాలతో పాటు లక్షలాది రూపాయల నగదును ఊడ్చేసి రాత్రికి రాత్రే ఉడాయించింది. ప్రశ్నించినందుకు పెళ్లి సంబంధం కుదిర్చిన మధ్యవర్తి ఎదురు బెదిరింపులకు దిగడంతో బాధితులు కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశాలతో ఎట్టకేలకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఆగ్రాలోని ఆవాస్ వికాస్ కాలనీ సెక్టార్ 14కు చెందిన గుడ్డీ దేవి పెద్ద కొడుకు విష్ణుకు పెళ్లి సంబంధాల కోసం చూస్తున్నారు. ఈ క్రమంలో షంషాబాద్‌కు చెందిన జవహర్ సింగ్ అనే మధ్యవర్తి వీరికి పరిచయమయ్యాడు. ప్రయాగ్‌రాజ్‌కు చెందిన ప్రీతి అనే యువతికి తండ్రి లేడని, పేద కుటుంబానికి చెందిన అమ్మాయని వారికి నమ్మబలికాడు. పెళ్లి ఖర్చులు భరిస్తే చాలని చెప్పడంతో గుడ్డీ దేవి కుటుంబం వివాహానికి అంగీకరించింది.

బంగారం, డబ్బుతో జంప్..

వివాహ సామగ్రి కొనుగోలు కోసమంటూ యువతి సోదరుడు ధారా సింగ్ రూ.1.5 లక్షలు డిమాండ్ చేయగా, విష్ణు కుటుంబం నగదు రూపంలో లక్ష రూపాయలు, ఆన్‌లైన్ ద్వారా రూ. 50,500 చెల్లించింది. అనంతరం జూన్ 27న సంప్రదాయబద్ధంగా వీరి వివాహం జరిగింది. పెళ్లయిన ఐదు రోజుల తర్వాత జూలై 3న అత్త గుడ్డీ దేవి కోడలిని టీ తాగేందుకు పిలవగా ఇంట్లో ఆమె కనిపించలేదు. ఇల్లంతా వెతికినా ఆచూకీ లభించలేదు. అనుమానం వచ్చి లాకర్లు పరిశీలించగా అసలు విషయం బయటపడింది. లాకర్ల నుంచి 4 తులాల బంగారం, 1 కేజీ వెండి ఆభరణాలు మాయమయ్యాయి. విష్ణు ఇచ్చిన బంగారు ఉంగరాలు, మంగళసూత్రం, వెండి వడ్డాణంతో పాటు చిన్న కోడలి నగలు, పట్టీలను కూడా దొంగిలించింది. ముహ్‌ దిఖాయి వేడుకలో వచ్చిన రూ.16,000 నగదుతో పాటు ఇంట్లోని మరో రూ.15,000 నగదును ఊడ్చేసింది. నగలు, నగదు కలిపి మొత్తం సుమారు రూ. 11 లక్షల మేర నష్టం వాటిల్లిందని బాధితుడు విష్ణు ఆవేదన వ్యక్తం చేశాడు.

 మధ్యవర్తి బెదిరింపులు..

ఈ మోసంపై మధ్యవర్తి జవహర్ సింగ్‌ను నిలదీయగా.. పోలీసులకు ఫిర్యాదు చేయవద్దని, తానే అమ్మాయిని తీసుకొస్తానని కాలయాపన చేశాడు. ఆ తర్వాత రోజుల్లో కుటుంబ సభ్యులనే రివర్స్‌లో బెదిరిస్తూ.. మీరే అమ్మాయిని మాయం చేశారని కేసు పెడతానంఅంటూ బెదిరింపులకు దిగాడు. బాధితులు తొలుత సికంద్రా పోలీసులను ఆశ్రయించినా ఫలితం లేకపోవడంతో కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశాల మేరకు సికంద్రా పోలీసులు కేసు నమోదు చేశారు. ఆధారాల ఆధారంగా దొంగతనానికి పాల్పడిన పెళ్లికూతురు ప్రీతితో పాటు మధ్యవర్తి జవహర్ సింగ్, యువతి సోదరుడి కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్లు డీసీపీ సయ్యద్ అలీ అబ్బాస్ వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *