Headlines

భారత అల్లుడి ఇంట అడుగుపెట్టిన ఆడబిడ్డ! మన మ్యాక్సీ ఏం పేరు పెట్టాడో తెలుసా? | Glenn Maxwell and Vini Raman Welcome Second Baby Girl Maia Maxwell


ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండర్ గ్లెన్ మాక్స్‌వెల్, ఆయన భార్య వినీ రామన్ దంపతులకు రెండో సంతానం జన్మించింది. తమకు పాప పుట్టిన విషయాన్ని ఈ జంట సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది. తమ కుమార్తెకు మైయా మాక్స్‌వెల్ అని పేరు పెట్టారు. చిన్నారి ఫొటోను షేర్ చేస్తూ.. “మా కలల రాణి వచ్చేసింది, మైయా మాక్స్‌వెల్” అంటూ భావోద్వేగ క్యాప్షన్ పెట్టారు.

మాక్స్‌వెల్ దంపతులకు వెల్లువెత్తిన శుభాకాంక్షలు

మైయా జనన వార్త బయటకు రావడంతో క్రికెట్ ప్రపంచం నుంచి మాక్స్‌వెల్ దంపతులకు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. మాజీ క్రికెటర్లు, క్రికెట్ జట్లు, కుటుంబ సభ్యులు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా అభినందనలు తెలిపారు. ఇప్పటికే ఈ దంపతులకు లోగాన్ మావెరిక్ మాక్స్‌వెల్ అనే కుమారుడు ఉన్నాడు. 2023 సెప్టెంబర్‌లో లోగాన్ జన్మించాడు. ఇప్పుడు మైయా రాకతో మాక్స్‌వెల్ కుటుంబం నలుగురు సభ్యులతో నిండిపోయింది.

స్నేహం నుంచి ప్రేమ.. ఆ తర్వాత పెళ్లి

గ్లెన్ మాక్స్‌వెల్, వినీ రామన్ 2013 డిసెంబర్‌లో తొలిసారి కలుసుకున్నారు. మొదట స్నేహితులుగా ఉన్న వీరి పరిచయం క్రమంగా ప్రేమగా మారింది. 2020 ఫిబ్రవరిలో వీరిద్దరూ నిశ్చితార్థం చేసుకున్నారు. అనంతరం 2022 మార్చి 27న మెల్‌బోర్న్‌లో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. మాక్స్‌వెల్, వినీ తమ వివాహాన్ని ప్రత్యేకంగా నిర్వహించారు. క్రైస్తవ సంప్రదాయంతో పాటు వినీ కుటుంబ సంప్రదాయాలకు అనుగుణంగా తమిళ బ్రాహ్మణ పద్ధతిలోనూ వివాహ వేడుక జరిపారు. తమిళ వేడుకలో మాక్స్‌వెల్ సంప్రదాయ బంగారు షేర్వానీలో కనిపించడం అప్పట్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

విని రామన్ ఎవరు?

వినీ రామన్ భారతీయ సంతతికి చెందిన ఆస్ట్రేలియన్ ఫార్మసిస్ట్. మెల్‌బోర్న్‌లో జన్మించి పెరిగిన ఆమె కుటుంబ మూలాలు తమిళనాడుతో ముడిపడి ఉన్నాయి. ఆమె మోనాష్ యూనివర్సిటీలో మెడికల్ సైన్సెస్, ఫార్మసీ విద్యను అభ్యసించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *