Headlines

117 ఏళ్ల ఎథెల్‌.. ప్రపంచంలో జీవించి ఉన్న వారిలో అధిక వయసు ఉన్న వ్యక్తిగా రికార్డు | World’s oldest living person turns 117 Ethel Caterham


ఇటీవల 117వ పుట్టినరోజు జరుపుకున్నది ఏ చెట్టో పుట్టో కాదు మనిషే. అవును ఇది నిజమే ఇన్నేళ్లు జీవించి ఉండటం చాలా అరుదు. ప్రపంచ చరిత్రలో శతాబ్దాల మార్పులకు సజీవ సాక్షిగా నిలిచిన అరుదైన వ్యక్తులలో బ్రిటన్‌కు చెందిన ఎథెల్ కేటర్‌హామ్ ఒకరు. కింగ్ ఎడ్వర్డ్ పాలనా కాలం నాటి తరం నుంచి నేటి వరకు జీవించి ఉన్న చివరి వ్యక్తిగా గుర్తింపు పొందిన ఆమె, ఇటీవల తన 117వ పుట్టినరోజును జరుపుకొని సరికొత్త రికార్డు నెలకొల్పారు. హాంప్‌షైర్‌లోని షిప్టన్ బెల్లింగర్‌లో జన్మించిన ఎథెల్, తన తల్లిదండ్రుల ఎనిమిది మంది సంతానంలో రెండవ కుమార్తె. 1927లో కేవలం 18 ఏళ్ల ప్రాయంలోనే ఆమె ఒంటరిగా నౌకలో భారతదేశానికి ప్రయాణమై వచ్చి, ఒక బ్రిటిష్ సైనిక కుటుంబంలో పిల్లల సంరక్షకురాలిగా బాధ్యతలు స్వీకరించారు.

ప్రేమ వివాహం, హాంగ్‌కాంగ్ జీవితం

1931లో బ్రిటన్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో బ్రిటిష్ సైనిక అధికారి లెఫ్టినెంట్ కర్నల్ నార్మన్‌తో ఏర్పడిన పరిచయం వివాహానికి దారితీసింది. ఆ తర్వాత ఆ దంపతులు హాంగ్‌కాంగ్ వెళ్లి స్థిరపడగా, అక్కడ ఎథెల్ పిల్లల కోసం నర్సరీ స్కూల్‌ ప్రారంభించారు. 1976లో భర్త కన్నుమూయడంతో ఆమె తిరిగి స్వదేశానికి చేరుకుని తన కుమార్తెలను పెంచి పెద్ద చేశారు. ఎథెల్ కుటుంబంలో సుదీర్ఘ ఆయుష్షు అనేది వంశపారంపర్యంగా వస్తోంది. ఆమె సోదరి గ్లాడిస్ బాబిలాస్ కూడా 104 ఏళ్ల సుదీర్ఘ కాలం జీవించడం విశేషం.

2020లో 110 ఏళ్ల వయస్సులో కోవిడ్ మహమ్మారి బారిన పడినప్పటికీ, తన ఆత్మస్థైర్యంతో కోలుకుని గిన్నిస్ రికార్డుల్లోకెక్కారు. ప్రస్తుతం ఆమెకు ముగ్గురు మనవరాళ్లు, ఐదుగురు ముని మనుమలు ఉన్నారు. ప్రపంచంలోనే అత్యధిక కాలం జీవించిన వ్యక్తిగా ఫ్రాన్స్‌కు చెందిన జీన్ కాల్‌మెంట్ (122 ఏళ్ల 164 రోజులు) పేరిట ఉన్న రికార్డును అధిగమించడానికి ఎథెల్‌కు మరో ఐదేళ్ల కాలం మాత్రమే మిగిలి ఉంది.

దీర్ఘాయువుకు రహస్యమేంటి?

ఇటీవలే 117వ పుట్టినరోజు జరుపుకున్న ఎథెల్‌ , “ఎవరితోనూ అనవసరంగా గొడవ పడకండి. ఇతరులు చెప్పేది ప్రశాంతంగా వినండి. మీకు నచ్చిన పనే చేయండి” అని చెబుతున్నారు. మృత్యువును సైతం చిరునవ్వుతో దాటేసిన ఈ శతాధిక వృద్ధురాలి ప్రయాణం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకం!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *