Headlines

కదులుతున్న బస్సులో దారుణం.. మైనర్ విద్యార్థినిపై డ్రైవర్, కండక్టర్ అఘాయిత్యం..! | Gang assaulted Shock: 16 Year Old School girl Attacked in Sleeper Bus in Delhi


దేశ రాజధాని ఢిల్లీలో మరో నిర్భయ లాంటి కేసు వెలుగులోకి వచ్చింది. 16 ఏళ్ల విద్యార్థినిపై స్లీపర్‌ బస్సులో సామూహిక అత్యాచారం జరిగిన ఘటన అలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన దేశరాజధానిలో తీవ్ర కలకలం రేపుతోంది. కశ్మీరీ గేట్‌ ప్రాంతంలో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించి బస్సు డ్రైవర్‌ కుల్దీప్‌, కండక్టర్‌ సందీప్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. బాధితురాలు ఉత్తరప్రదేశ్‌లోని మైన్‌పురి జిల్లాకు చెందిన 11వ తరగతి విద్యార్థినిగా పోలీసులు గుర్తించారు.

పోలీసుల ప్రాథమిక వివరాల ప్రకారం.. ఆగస్టు 4వ తేదీ రాత్రి కుటుంబ సభ్యులపై కోపంతో విద్యార్థిని ఎవరికీ చెప్పకుండా ఇంటి నుంచి బయటకు వచ్చింది. నోయిడాలో నివసించే తన కజిన్‌ వద్దకు వెళ్లాలని నిర్ణయించుకుంది. అయితే భారీ వర్షం, చీకటి కారణంగా మార్గమధ్యంలో పరీక్షా చౌక్‌ వద్ద పొరపాటున దిగిపోయింది.

ఆ సమయంలో అటుగా ఖాళీ స్లీపర్‌ బస్సు రావడంతో విద్యార్థిని సైగ చేసి బస్సును ఆపారు. నోయిడా సెక్టార్‌-63కు వెళ్తున్నామని చెప్పి డ్రైవర్‌, కండక్టర్‌ ఆమెను బస్సులోకి ఎక్కించుకున్నారని పోలీసులు తెలిపారు. కొద్దిదూరం వెళ్లిన తర్వాత కండక్టర్‌ ఆమెతో అసభ్యంగా ప్రవర్తించడం ప్రారంభించినట్లు ఆరోపణలు ఉన్నాయి. అనంతరం ఇద్దరూ తనపై అత్యాచారానికి పాల్పడ్డారని బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. ప్రతిఘటించడంతో చంపేస్తామని బెదిరించినట్లు తెలిపింది.

తర్వాత అర్ధరాత్రి కశ్మీరీ గేట్‌ బస్‌ డిపో సమీపంలోని రింగ్‌ రోడ్డుపై విద్యార్థినిని దింపేసి నిందితులు అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు పోలీసులు తెలిపారు. తీవ్ర భయాందోళనకు గురైన బాలిక కశ్మీరీ గేట్‌ పోలీసులను ఆశ్రయించడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సీసీటీవీ దృశ్యాలు, బస్సు కదలికలు, ఇతర సాంకేతిక ఆధారాలను పరిశీలించిన పోలీసులు తిమార్పూర్‌లోని బస్‌ పార్కింగ్‌ నుంచి ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఘటనకు ఉపయోగించిన స్లీపర్‌ బస్సును స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్‌ పరీక్షలకు పంపించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బస్సులో సాంకేతిక సమస్య తలెత్తడంతో సూరజ్‌పూర్‌లోని వర్క్‌షాప్‌కు మరమ్మతుల కోసం తీసుకెళ్లారు. రిపేర్‌ అనంతరం ఖాళీ బస్సుతో డ్రైవర్‌, కండక్టర్‌ తిమార్పూర్‌ వైపు వెళ్తుండగా పరీక్షా చౌక్‌ వద్ద విద్యార్థిని కనిపించినట్లు దర్యాప్తులో వెల్లడైంది. పరీక్షా చౌక్‌ నుంచి కశ్మీరీ గేట్‌ వరకు బస్సు సుమారు 47 కిలోమీటర్లు ప్రయాణించినట్లు పోలీసులు గుర్తించారు.

స్లీపర్‌ బస్సులో తెరలు ఉండటంతో లోపల జరుగుతున్న విషయం బయటివారికి కనిపించకపోయి ఉండొచ్చని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం బస్సు ఫోరెన్సిక్‌ నివేదిక, సీసీటీవీ ఆధారాలు, బాధితురాలి వాంగ్మూలం ఆధారంగా దర్యాప్తు కొనసాగుతోంది. మైనర్‌పై లైంగిక నేరానికి సంబంధించిన చట్టాల కింద తదుపరి చర్యలు చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *