గత కొన్ని రోజులుగా వస్తోన్న రూమర్లను నిజం చేస్తూ తమ ప్రేమ బంధాన్ని అధికారికంగా ప్రకటించారు కావ్య కళ్యాణ్‌రామ్- కాలభైరవ. గత కొన్ని రోజులుగా ఎక్కడ చూసినా కలిసే కనిపిస్తున్నారీ లవ్ బర్డ్స. దీంతో వీరిద్దరి మధ్య సమ్ థింగ్ సమ్ థింగ్ నడుస్తోందంటూ ప్రచారం జరిగింది. అయితే ఇద్దరూ ఎక్కడా కూడా తమ ప్రేమ విషయాన్ని బహిరంగంగా చెప్పలేదు. అయితే ఎట్టకేలకు తమ ప్రేమ బంధాన్ని బయట పెట్టారీ ప్రేమ పక్షులు. సోషల్ మీడియా వేదికగా ఇద్దరూ తమ రిలేషన్ షిప్‌ను కన్ఫామ్ చేశారు. దీంతో పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు ఈ లవ్ బర్డ్స్ కు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ సందర్భంగా కాలభైరవతో కలిసి ఉన్న పలు ఫొటోలను కావ్య కళ్యాణ్‌రామ్ ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. ఈ ఫొటోలతో పాటు ఆమె రాసిన ఒక ఎమోషనల్ నోట్ వైరల్ గా మారింది. ‘ కొంతమంది మన జీవితంలోకి వచ్చి మనం దేవుడికి అత్యంత ఇష్టమైన పిల్లలమనే భావన కలిగిస్తారు. అలా నా జీవితంలో ఒక ప్రత్యేకమైన వ్యక్తిని కలుసుకున్నాను. అతను వచ్చిన తర్వాత నా సాధారణ రోజులన్నీ కూడా చాలా ప్రత్యేకంగా మారిపోయాయి. నా జీవితంలో ఎంతో ఆనందాన్ని తీసుకొచ్చాడు. నన్ను అదృష్టవంతురాలిగా భావించేలా చేశాడు. ఇక ముందు కూడా ఇలాంటి ఎన్నో సంవత్సరాలు కలిసి ఉండాలని కోరుకుంటున్నాను’ అంటూ కాలభైరవపై తనకున్న ప్రేమకు అక్షర రూపమిచ్చింది కావ్య.
అటు కాల భైరవ కూడా కావ్యతో ఉన్న ఫొటోలను పంచుకుంటూ.. ‘నీతో సమయం గడపడం అంటే కొండల ఒడ్డున కూర్చుని, నీటి ప్రవాహాన్ని చూస్తున్నట్లు అనిపిస్తుంది. నీతో పనులు చేయడం అంటే, ఎప్పటికీ ముగిసిపోకూడదనుకునే ఓ విహారయాత్రలా అనిపిస్తుంది. నీతో సంభాషణలు అంటే, చలికాలపు పొద్దున్నే నాకిష్టమైన కాఫీ తాగుతున్నట్లు అనిపిస్తుంది. ఇలాంటివి ఇంకా ఎన్నో ఎన్నో… చాలా వరకు, నేను ఆ అనుభూతికి పేరు పెట్టలేకపోయాను. కానీ మన ప్రయాణంలో ఎక్కడో ఒక చోట, అది ఏమిటో నేను చివరికి గ్రహించాను. అది ‘ఇల్లు’ అనే అనుభూతి. నేను నిన్ను మొదటిసారి కలిసినప్పుడు, ఓ కొత్త వ్యక్తిని కలవలేదు. నేను ఇంటికి వచ్చాను, అప్పటి నుంచి దాన్ని విడిచిపెట్టలేదు. మనమిద్దరం కలిసి జీవితాంతం ఒకే ఇంట్లో ఉంటామనే ఈ విషయాన్ని ఇప్పుడు అందరితో పంచుకుంటున్నందుకు చాలా ఆనందంగా ఉంది’ అని రాసుకొచ్చాడు కాల భైరవ.
ఇవి కూడా చదవండి
కాలభైరవతో కావ్య కల్యాణ్ రామ్..
ఇదిలా ఉంటే కావ్య, కాలా భైరవల లవ్ స్టోరీ ఎలా మొదలైందని తెలుసుకునేందుకు నెటిజన్లు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలో కొన్ని విషయాలు నెట్టింట వైరల్ గా మారాయి. కాల భైరవ తమ్ముడు శ్రీసింహ నటించిన ఉస్తాద్ చిత్రంలో కావ్య కల్యాణ్ రామ్ హీరోయిన్ గా నటించింది. ఆ సినిమాకు కాల భైరవ పాటలు పాడడం విశేషం. అప్పటి నుంచే కావ్య, కాల భైరవల మధ్య పరిచయం మొదలైందని సమాచారం. ఆ తర్వాత అది స్నేహంగానూ, చివరికి ప్రేమగానూ చిగురించిందని తెలుస్తోంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.