Headlines

హైదరాబాద్ కంటోన్మెంట్‌‌లో కలకలం.. మద్రాస్ రెజిమెంట్‌లో 12 తుపాకుల చోరీ..


హైదరాబాద్ కంటోన్మెంట్‌‌లో కలకలం.. మద్రాస్ రెజిమెంట్‌లో 12 తుపాకుల చోరీ..

హైదరాబాద్ కంటోన్మెంట్‌ మద్రాస్ రెజిమెంట్‌లో ఆయుధాల చోరీ కలకలం రేపింది.. అత్యంత భద్రత ఉన్న ఆయుధాల గది తాళాన్ని పగులగొట్టి.. 12 ఆయుధాలను గుర్తుతెలియని వ్యక్తులు చోరీ చేశారు. నాలుగు ఏకే47లు, 6 పిస్టళ్లు, ఒక ఇన్సాస్ రైఫిల్ అపహరించారు. ఆయుధాలతో పాటు మందుగుండు సామాగ్రి కూడా చోరీ చేసినట్లు పేర్కొంటున్నారు. ఆదివారం రాత్రి దొంగతనం జరిగినట్టు గుర్తించిన మద్రాస్ రెజిమెంట్‌ అధికారులు.. సోమవారం ఉదయం బొల్లారం పీఎస్‌లో ఫిర్యాదు చేశారు.. ఇది ఆర్మీకి ఓరకంగా షాకింగ్ న్యూసే. ఎందుకంటే అత్యంత పటిష్టమైన ఏరియా అది. ఆర్మీ సిబ్బంది తప్ప మరొకరు వెళ్లేందుకు కూడా సాహసించని అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే ప్రాంతం మద్రాస్ రెజిమెంట్.. భారత సైన్యంలో అత్యంత పురాతనమైన, ఘన చరిత్ర ఉన్న పదాతిదళ విభాగాల్లో మద్రాస్‌ రెజిమెంట్‌ ఒకటి. క్రమశిక్షణ, ధైర్యసాహసాలు, దేశభక్తికి ప్రతీకగా నిలిచిన ఈ రెజిమెంట్‌ సైనికులు అనేక యుద్ధాలు, సరిహద్దు రక్షణలో అసాధారణ సేవలందించారు. స్వధర్మే నిధనం శ్రేయ అనే స్ఫూర్తితో ఇక్కడ సైనికులకు శిక్షణకార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. అందుకే మద్రాస్‌ రెజిమెంట్‌ పేరు వినగానే శౌర్యం, క్రమశిక్షణ, అంకితభావం గుర్తుకొస్తాయి.

అంత సులభం కాదు.. కానీ..

అలాంటి రెజిమెంట్‌లో దొంగతనం చేయడం సాధారణ ప్రాంతాల్లో జరిగినంత సులభం కాదు. ఎగ్జిట్ పాయింట్స్ నుంచి తనిఖీలు, అనుమతి పొందిన వ్యక్తులకే ప్రవేశం, నిరంతర గస్తీ, నిఘా కెమెరాలు, భద్రతా సిబ్బంది పర్యవేక్షణతో అనేక లేయర్లలో భద్రత వ్యవస్థ పటిష్టంగా ఉంటుంది. అయినా ఇక్కడ దొంగతనం, అది కూడా కీలకమైన ఆయుధాలు చోరీ జరగడం, తెల్లారేవరకు ఆర్మీ అధికారులకు తెలియకపోవడం మిస్టరీగా ఉంది.

ఎన్నో అనుమానాలు..

ఆర్మీ అధికారుల ఫిర్యాదుతో బొల్లారం పోలీస్‌స్టేషన్‌లో సోమవారం కేసు నమోదైంది. రక్షణ వ్యవహారాలకు సంబంధించిన వ్యవహారం కావడంతో పోలీసులు కేసు వివరాలను గోప్యంగా ఉంచుతున్నారు. అయితే ఇక్కడ మరో వెర్షన్ కూడా వినిపిస్తోంది. బయటివ్యక్తులెవరూ ఇందులోకి ప్రవేశించే అవకాశం దాదాపు లేదు. సిబ్బందిలోనే ఎవరో ఈ పనిచేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. అంతేకాదు చోరీ అయిన ఆయుధాలు భారీవి కావడంతో ఒక్కరే వాటిని మోయడం సాధ్యం కూడా కాదు. కచ్చితంగా ఇద్దరు, అంతకంటే ఎక్కువమంది ఉండొచ్చని ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. పోలీసు ఉన్నతాధికారులు మద్రాస్‌ రెజిమెంట్‌కు చేరుకొని, సమీపంలోని సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *