Headlines

అమానుషం.. అర్ధరాత్రి కదులుతున్న ఆటో నుంచి రోడ్డుపై ఏదో విసిరేశారు! దగ్గరకెళ్లి చూడగా.. | Newborn Baby Thrown From Moving Auto in Mahbubnagar, Police Launch Probe


మహబూబ్‌నగర్‌, సెప్టెంబర్‌ 6: అప్పుడే పుట్టిన నవజాత మగ శిశువును ఆటో నుంచి రోడ్డుపై విసిరేసిన అమానుష ఘటన మహబూబ్‌నగర్‌లో సంచలనం సృష్టించింది. కండువా, బెడ్‌షీట్‌లో చుట్టిన పసికందును గుర్తించిన యువకులు పోలీసులకు సమాచారం అందించడంతో సకాలంలో ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం చిన్నారి ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

శుక్రవారం అర్ధరాత్రి సుమారు 1.45 గంటల సమయంలో ఓ ఆటో మహబూబ్‌నగర్‌లోని న్యూటౌన్‌ కూడలి నుంచి మెట్టుగడ్డ వైపు వెళ్తోంది. ఈ క్రమంలో ఆటోలో ఉన్న వ్యక్తులు కండువా, బెడ్‌షీట్‌లో చుట్టిన ఓ పార్సల్‌ను రోడ్డుపైకి విసిరేశారు. కొంతసేపటి తర్వాత అటుగా వెళ్తున్న కొందరు యువకులు రోడ్డుపై అనుమానాస్పదంగా ఉన్న ఆ పార్సల్‌ను గమనించారు. దగ్గరకు వెళ్లి చూడగా అందులో నవజాత మగ శిశువు ఉన్నట్లు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే ఏఎస్సై సాయి నిర్మల సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పసికందును వెంటనే మహబూబ్‌నగర్‌ ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రి (జీజీహెచ్‌)కు తరలించారు. వైద్యులు శిశువుకు చికిత్స అందించి పరిశీలించగా ప్రస్తుతం చిన్నారి ఆరోగ్యంగానే ఉన్నట్లు తెలిపారు. సకాలంలో గుర్తించి ఆసుపత్రికి తరలించడంతో ప్రాణాపాయం తప్పినట్లు తెలుస్తోంది.

Newborn Baby Abandoned

ఇవి కూడా చదవండి



ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. న్యూటౌన్‌ కూడలి నుంచి మెట్టుగడ్డ వరకు ఉన్న మార్గంలోని సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. ఆటోను గుర్తించేందుకు ముమ్మరంగా గాలిస్తున్నామని, శిశువును రోడ్డుపై పడేసిన ఘటనకు కారకులైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని రెండో పట్టణ ఠాణా సీఐ ఎజాజుద్దీన్‌ తెలిపారు. శిశువును ఆటో నుంచి ఎవరు విసిరేశారు? తల్లిదండ్రులు ఎవరు? ఏ కారణంతో నవజాత శిశువును ఇలా వదిలేశారు? అనే అంశాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. మరోవైపు ఆటో నుంచి నవజాత మగ శిశువును పడేశారనే విషయం తెలుసుకున్న పలువురు ఆ చిన్నారిని తమకు ఇవ్వాలని కోరుతూ ఆసుపత్రికి వచ్చారు. అయితే శిశువును తమకు అప్పగించే అధికారం ఆసుపత్రి పరిధిలో లేదని వైద్యులు స్పష్టం చేశారు. ఈ విషయమై ఐసీడీఎస్‌ (ICDS) కార్యాలయాన్ని సంప్రదించాలని సూచించారు. ప్రస్తుతం పోలీసులు శిశువును వదిలివెళ్లిన వారి ఆచూకీ కోసం దర్యాప్తు ముమ్మరం చేశారు. సీసీ కెమెరాల ఆధారంగా ఆటోను గుర్తించి, ఘటన వెనుక ఉన్న వ్యక్తులను వెలుగులోకి తీసుకురావడంపై అధికారులు దృష్టి సారించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *