Headlines

Ind Vs Pak: పాక్‎కు ఘోర అవమానం..షేక్‌హ్యాండ్ ఇవ్వని భారత ప్లేయర్లు.. ఇది ఎన్నో సారి అంటే? | Ind vs pak no handshake womens asia cup 2026 harmanpreet kaur


Ind Vs Pak: దుబాయ్ ఇంటర్నేషనల్ మైదానంలో శనివారం జరిగిన ఆసియా కప్ మ్యాచ్‌లో భారత జట్టు పాకిస్థాన్‌ను ఊచకోత కోసింది. అయితే మ్యాచ్ గెలిచారనే సంతోషం కంటే మైదానంలో భారత ఆటగాళ్ల ప్రవర్తన అందరి దృష్టినీ ఆకర్షించింది. టాస్ వేసే సమయంలో భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ పాక్ కెప్టెన్‎తో కనీసం చేయి కలపలేదు. ఇక మ్యాచ్ ముగిసిన వెంటనే రెండు జట్ల ఆటగాళ్లు ఒకరికొకరు షేక్‌హ్యాండ్ ఇచ్చుకోవడం ఆనవాయితీ. కానీ టీమిండియా ప్లేయర్లు ప్రత్యర్థి ఆటగాళ్లతో హ్యాండ్‌షేక్ చేయకుండానే నేరుగా డ్రెస్సింగ్ రూమ్‌ వైపు అడుగులు వేశారు.

వరుసగా 8 మ్యాచ్‌లుగా కొనసాగుతున్న నిరసన

భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య (పురుషుల, మహిళల) షేక్ హ్యాండ్ ఇచ్చుకోకపోవడం ఇదే మొదటిసారి కాదు. గత మే 2025లో జరిగిన ఆపరేషన్ సింధూర్ తదనంతర పరిణామాల తర్వాత నుంచి భారత క్రికెటర్లు పాక్ జట్టుతో హ్యాండ్‌షేక్ సంస్కృతికి స్వస్తి పలికారు. పురుషుల ఆసియా కప్ 2025లో ఆడిన 3 మ్యాచ్‌లలోనూ భారత జట్టు ఇదే తీరును ప్రదర్శించింది. ఆ తర్వాత మహిళల ప్రపంచ కప్, అండర్-19 ప్రపంచ కప్, టి20 ప్రపంచ కప్‌లతో పాటు నేటి మ్యాచ్‌తో కలిపి మొత్తం 8 మ్యాచ్‌లుగా పాకిస్థాన్ ఆటగాళ్లకు భారత జట్టు హ్యాండ్‌షేక్ నిరాకరిస్తూనే వస్తోంది.

55 పరుగులకే కుప్పకూలిన పాకిస్థాన్

ఈ మ్యాచ్ విశేషాల్లోకి వెళ్తే టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌ ఎంచుకున్న పాకిస్థాన్ జట్టుకు భారత బౌలర్లు చుక్కలు చూపించారు. భారత స్పిన్నర్లు శ్రీ చరణి, ప్రేమా రావత్ చెరో 3 వికెట్లతో చెలరేగడంతో పాకిస్థాన్ 18.1 ఓవర్లలో కేవలం 55 పరుగులకే కుప్పకూలింది. ప్రత్యర్థి ఇన్నింగ్స్‌లో ఏ ఒక్క బ్యాటర్ కూడా నిలకడగా ఆడలేకపోయారు.

సునాయాసంగా లక్ష్యాన్ని ఛేదించిన భారత్

స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా కేవలం 8.4 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఊదేసింది. భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ 18 పరుగులతో నాటౌట్‌గా నిలిచి జట్టును విజేతగా నిలిపింది. పాకిస్థాన్ కెప్టెన్ ఫాతిమా సనా 3 వికెట్లు తీసినప్పటికీ, మ్యాచ్ ఫలితాన్ని మార్చలేకపోయింది. మ్యాచ్ ముగిసిన వెంటనే భారత క్రీడాకారిణులు చూపిన నిరసన తీరు ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్రంగా చర్చనీయాంశమవుతోంది. మైదానంలో ప్రదర్శించిన ఈ కఠిన వైఖరి సరిహద్దుల్లోని ఉద్రిక్తతలకు క్రికెట్ వేదికగా భారత జట్టు ఇస్తున్న గట్టి సమాధానంగా క్రీడాభిమానులు అభివర్ణిస్తున్నారు. రాబోయే మ్యాచ్‌ల్లోనూ పాకిస్థాన్‌తో భారత్ ఇదే తీరును కొనసాగించే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *