
ఎల్పీజీ గ్యాస్ వినియోగదారులకు బిగ్ అలర్ట్. గ్యాస్ కనెక్షన్ ఈకేవైసీ పూర్తి చేసుకునేందుకు ఒక్కరోజు మాత్రమే సమయం ఉంది. దీంతో ఇంకా పూర్తి చేయనివారు వెంటనే ఈ ప్రక్రియ కంప్లీట్ చేయడం మంచిది. లేకపోతే గ్యాస్ సబ్సిడీ నగదు నిలిచిపోవడంతో పాటు గ్యాస్ సరఫరాలో అంతరాయం ఏర్పడే అవకాశముంది. ఇంతకముందు ఆగస్ట్ 31వ తేదీతో గడువు ముగియగా.. సెప్టెంబర్ 7 వరకు గడువు పొడిగించారు. ఇప్పటికే పలుమార్లు గడువు పొడిగించగా.. మరోసారి అవకాశం ఉండకపోవచ్చు. దీంతో ఆలస్యం చేయకుండా రేపటి కల్లా పూర్తి చేయడం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉండవు. రెండు నెలల్లో ఈకేవైసీ గడువును పొడిగించడం ఇది నాలుగోసారి. దీంతో మరోసారి పొడిగించే అవకాశం ఉండదని చెబుతున్నారు. మీరు గడువులోగా కేవైసీ పూర్తి చేయకపోతే సబ్సిడీ నిలిచిపోతుంది. దీంతో రిటైల్ ధరలకే గ్యాస్ కొనుగోలు చేయాల్సి ఉంటుంది. కేవైసీ పూర్తి చేసిన తర్వాత తిరిగి సబ్సిడీ అందుతుంది. దీంతో సబ్సిడీ చేజారిపోకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఈకేవైసీ పూర్తి చేసుకోవాలి. వంటగ్యాస్ ఏజెన్సీల సాఫ్ట్వేర్ అప్డేట్ నేపథ్యంలో ఎల్పీజీ వినియోగదారులు తమ బయోమెట్రిక్ ధృవీకరణను పూర్తి చేయడానికి గడువును పొడిగించారు.
ఈకేవైసీకి ఎలాంటి పత్రాలు అవసరం..?
-వ్యక్తిగత వివరాలు, గ్యాస్ కనెక్షన్ సమాచారం, ఆధార్, మొబైల్ నెంబర్ అవసరం.
ఎలా పూర్తి చేయాలి..?
ఇండేన్ గ్యాస్ కస్టమర్లు ఇండియన్ ఆయిల్ వన్, భారత్ గ్యాస్ కస్టమర్లు హలో బీపీసీఎల్, హెచ్పీ గ్యాస్ వినియోగదారులు హెచ్పీ పే యాప్స్ డౌన్ లోడ్ చేసుకోవాలి. యాప్ ఓపెన్ చేసి హోమ్ పేజీలో ఈకేవైసీ ఆప్షన్ ఎంచుకోవాలి. ఆధార్ నెంబర్, గ్యాస్ కనెక్షన్ నెంబర్ ఇవ్వాలి. ఆధార్ ఫేస్ ఆర్డీ యాప్ డౌన్ లోడ్ చేసుకోవాలి. మీ ఫేస్ స్కాన్ చేయాలి. అనంతరం కేవైసీ పూర్తవుతుంది.
ఆఫ్లైన్లో ఎలా పూర్తి చేయాలి..?
ఆఫ్లైన్లో పూర్తి చేయాలంటే మీ గ్యాస్ ఏజెన్సీ కార్యాలయానికి వెళ్లాలి. అక్కడ మీ ఆధార్, గ్యాస్ పాస్ బుక్ అందించాలి. మీ మొబైల్ నెంబర్కు వచ్చే ఓటీపీని అందించాలి. అక్కడ మీ ఫేస్ స్కాన్ చేస్తారు. వెంటనే మీ ఈకేవైసీ పూర్తవుతుంది. అలాగే గ్యాస్ డెలివరీ చేయడానికి వచ్చే డెలివరీ బాయ్ దగ్గర బయోమెట్రిక్ మెషిన్ ఉంటుంది. దాని ద్వారా కూడా సులువుగా పూర్తి చేయవచ్చు. ఈ మార్గాల ద్వారా మీరు సులువుగా ఈకేవైసీ పూర్తి చేసే అవకాశం ఉంది.