Headlines

నవ్వొచ్చినా ఇది నిజం.. హోటల్ బాత్‌రూమ్‌లోని ఆ ఫోన్ మీ ప్రాణాలను ఎలా కాపాడుతుందంటే..? | Why Luxury Hotel Bathrooms Still Have Landline Phones, Check Details


స్టార్ హోటళ్లు లేదా విలాసవంతమైన రిసార్టులకు వెళ్లినప్పుడు చాలామంది గమనించే ఒక వింత విషయం.. బాత్రూమ్‌లో లేదా టాయిలెట్ పక్కనే ల్యాండ్‌లైన్ ఫోన్ ఉండటం. స్మార్ట్‌ఫోన్లు చేతిలో ఉండే ఈ రోజుల్లో బాత్రూమ్‌లో ఈ ఫోన్ ఎందుకు? అని ఎవరికైనా ఆశ్చర్యం కలగడం సహజం. చూడటానికి కాస్త వింతగా అనిపించినా, అక్కడ టెలిఫోన్‌ను ఏర్పాటు చేయడం వెనుక బలమైన చరిత్ర, భద్రతా కారణాలు ఉన్నాయి. 1980, 1990వ దశకాల్లో హోటల్ గదుల్లోని బాత్రూమ్‌లలో ఫోన్ ఉండటాన్ని లగ్జరీ స్టేటస్‌కు చిహ్నంగా భావించేవారు. బాత్‌టబ్‌లో రిలాక్స్ అవుతున్నప్పుడు ముఖ్యమైన వ్యాపార కాల్స్ మాట్లాడటానికి, బాత్రూమ్ నుంచి బయటకు రాకుండానే హోటల్ సిబ్బందితో మాట్లాడి రూమ్ సర్వీస్, హౌస్‌కీపింగ్ సేవలు పొందడానికి ఇది ఎంతో ఉపయోగపడేది. ముఖ్యంగా లండన్ వంటి అంతర్జాతీయ నగరాల్లోని ప్రముఖ హోటళ్లలో బాత్‌టబ్‌లో కూర్చునే కాల్స్ మాట్లాడే సదుపాయం ఉండేది.

మొబైల్ యుగంలో తగ్గిన ప్రాధాన్యం

2000వ సంవత్సరం తర్వాత మొబైల్ ఫోన్లు, స్మార్ట్‌ఫోన్ల వాడకం విపరీతంగా పెరిగిపోయింది. అతిథులు ఎక్కడికి వెళ్లినా తమ వ్యక్తిగత ఫోన్లను వెంట తీసుకెళ్లడం మొదలుపెట్టడంతో బాత్రూమ్‌లలో ప్రత్యేకంగా ల్యాండ్‌లైన్ ఫోన్ అవసరం క్రమంగా తగ్గింది. దీంతో ఖర్చులు తగ్గించుకోవడానికి చాలా ఆధునిక హోటళ్లు బాత్రూమ్ ఫోన్లను తొలగించాయి.

ఇప్పటికీ కొన్ని హోటళ్లలో ఎందుకు కొనసాగిస్తున్నారు?

నేటికీ కొన్ని 4 స్టార్, 5 స్టార్ లగ్జరీ హోటళ్లలో బాత్రూమ్ ఫోన్లు దర్శనమిస్తుంటాయి. ఇప్పుడు వీటిని కేవలం విలాసంగా మాత్రమే కాకుండా ప్రధానంగా లైఫ్‌ సేవింగ్, ఎమర్జెన్సీ పరికరంగా ఉపయోగిస్తున్నారు.

అత్యవసర రక్షణ: బాత్రూమ్‌లో జారిపడటం, గుండెపోటు రావడం, తీవ్రమైన కళ్లు తిరగడం వంటి ప్రమాదాలు ఎప్పుడైనా జరగొచ్చు. అలాంటి విపత్కర పరిస్థితుల్లో తలుపు తీసి బయటకు రాలేని స్థితిలో అతిథి ఉంటే, ఈ ఫోన్ ద్వారా వెంటనే రిసెప్షన్‌కు లేదా మెడికల్ హెల్ప్‌కు కాల్ చేయవచ్చు.

తడి చేతులతోనూ సులభంగా: నీటి తడి ఉన్నప్పుడు స్మార్ట్‌ఫోన్లు పనిచేయకపోవచ్చు లేదా ఛార్జింగ్ అయిపోవచ్చు. కానీ గోడకు ఉండే ఈ ల్యాండ్‌లైన్ ఫోన్ ఎలాంటి ఆటంకం లేకుండా నేరుగా హోటల్ సిబ్బందితో కనెక్ట్ అవుతుంది.

స్టార్ హోటల్ నిబంధనలు: కొన్ని అంతర్జాతీయ హోటల్ రేటింగ్ ప్రమాణాల ప్రకారం.. అత్యున్నత కేటగిరీ గుర్తింపు పొందడానికి బాత్రూమ్‌లలో ఎమర్జెన్సీ కమ్యూనికేషన్ పరికరాలు తప్పనిసరిగా ఉండాలి. ఒకప్పుడు హోదా, విలాసానికి ప్రతిరూపంగా నిలిచిన బాత్రూమ్ ఫోన్లు.. నేడు అతిథుల ప్రాణాలను కాపాడే అత్యవసర రక్షక పరికరాలుగా తమ ఉనికిని కొనసాగిస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *