Headlines

పొరుగు దేశం కంటే పక్క రాష్ట్రాల ఉగ్రవాద చొరబాట్లే ఎక్కువ .. దుమారం రేపుతున్న.. పంజాబ్‌ సీఎం మరియం వ్యాఖ్యలు | Maryam Nawaz Says Punjab Faces More Threats From Provinces Than Pak neighbours


సాధారణంగా పాకిస్థాన్ నాయకులు తమ దేశంలో జరిగే హింసకు భారత్ లేదా ఆఫ్ఘనిస్తాన్ వంటి పొరుగు దేశాలపై నిందలు మోపుతుంటారు. కానీ, ఇందుకు భిన్నంగా మరియం నవాజ్ స్వయంగా దేశంలోని ఇతర ప్రాంతాల నుంచే తమకు అంతర్గత భద్రతా ముప్పు పొంచి ఉందని అంగీకరించడం గమనార్హం.

పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్ ముఖ్యమంత్రి మరియం నవాజ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపాయి. శనివారం లాహోర్‌లో జరిగిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ.. ఇతర దేశాల కంటే పక్క రాష్ట్రాల (ప్రావిన్సుల) నుంచే తమకు ఎక్కువ ముప్పు ఉందని తెలిపారు.  13 కోట్ల జనాభా ఉన్న పంజాబ్‌లోకి, పక్కనే ఉన్న ప్రావిన్సుల సరిహద్దుల గుండానే ఉగ్రవాదులు చొరబడుతున్నారని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. పాకిస్తాన్ లోని పంజాబ్‌కు ఆనుకొని ఉన్న ఖైబర్ పఖ్తుంఖ్వా, బలూచిస్తాన్ ప్రావిన్సులలో ఇటీవల ఉగ్రవాద కార్యకలాపాలు పెరిగాయి.

పంజాబ్ ప్రావిన్స్‌ను సురక్షితంగా ఉంచడానికి తాము సరిహద్దుల వద్ద డ్రోన్లు, థర్మల్ కెమెరాలు, బులెట్ ప్రూఫ్ నిఘా పరికరాలను ఏర్పాటు చేశామని, ఉగ్రవాదుల కదలికలు ఇతర రాష్ట్రాల సరిహద్దుల వైపు నుంచే ఎక్కువగా ఉంటున్నాయని ఆమె తెలిపారు.

రాజకీయ దుమారం.. ప్రతిపక్షం ఆగ్రహం


మరియం వ్యాఖ్యలపై ఇమ్రాన్ ఖాన్ పార్టీ పీటీఐ సీనియర్‌ నేత అసద్‌ ఖైసర్‌ తీవ్రంగా మండిపడ్డారు. ఆమె ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రజలను అవమానించారని, ఆమె కుటుంబం చేసిన తప్పుల వల్లే తాము ఇబ్బందులు పడుతున్నామని విమర్శించారు. ఉగ్రవాదంపై పోరాడుతూ ప్రాణాలు అర్పిస్తున్న ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రజలను, పోలీసుల త్యాగాలను ఆమె అవమానించేలా మాట్లాడారని, ప్రావిన్సుల మధ్య చిచ్చుపెట్టేలా ఈ వ్యాఖ్యలు ఉన్నాయని  ఆరోపించారు.

ప్రస్తుత ప్రభుత్వం, గతంలో ఆమె బాబాయి నవాజ్ షరీఫ్ ప్రభుత్వ వైఫల్యాలు, విధానపరమైన లోపాల కారణంగా ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రజలు ఇప్పటికీ కష్టాలను అనుభవిస్తూనే ఉన్నారని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా సాగుతున్న పోరులో ఖైబర్ పఖ్తుంఖ్వా పోలీసులు సాటిలేని త్యాగాలు చేశారని కైసర్ గుర్తుచేశారు.

“ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రజలు, అమరవీరుల కుటుంబాలు, పోలీసు సిబ్బంది ఉగ్రవాదానికి వ్యతిరేకంగా చేసిన త్యాగాలను గుర్తించి వారికి మద్దతు, ఓదార్పును ఇవ్వడానికి బదులుగా, వారిని కించపరుస్తూ, వారి కష్టాలను అపహాస్యం చేయడం తీవ్ర విచారకరం” అన్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *