Headlines

Asia Cup 2026: ఆసియా కప్‌లో భారత్-పాక్ మధ్య మరో హైవోల్టేజ్ పోరు.. అది ఎలా సాధ్యమంటే? | Womens asia cup 2026 india vs pakistan final match equation


Asia Cup 2026: మహిళల టీ20 ఆసియా కప్ 2026 లీగ్ దశలో పాకిస్థాన్‌పై భారత మహిళల జట్టు 7 వికెట్ల తేడాతో సంచలన విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. అయితే ఈ టోర్నీలో భారత్, పాకిస్థాన్ జట్లు మరోసారి ముఖాముఖి తలపడే అవకాశాలు ఇంకా సజీవంగానే ఉండటంతో క్రికెట్ అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది. హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలోని భారత మహిళల జట్టు గ్రూప్-ఎ లో ఆడిన అన్ని మ్యాచ్‌ల్లోనూ ఘనవిజయాలు సాధించి అగ్రస్థానంతో సెమీఫైనల్‌కు అర్హత సాధించింది. థాయ్‌లాండ్, హాంకాంగ్‌లపై రికార్డు స్థాయి విజయాల అనంతరం, చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ను కేవలం 55 పరుగులకే ఆలౌట్ చేసి వన్ సైడ్ విజయాన్ని నమోదు చేసింది. లీగ్ దశ ముగిసేసరికి భారత్ అత్యుత్తమ ప్రదర్శనతో టైటిల్ రేసులో నిలిచింది.

పాకిస్థాన్ సెమీఫైనల్ సమీకరణాలు

పాకిస్థాన్ జట్టు కూడా సెమీఫైనల్ రేసులో నిలవాలంటే తమ చివరి లీగ్ మ్యాచ్‌లో హాంకాంగ్‌ను ఖచ్చితంగా ఓడించాల్సి ఉంటుంది. ఈ పోరులో గెలిచి సెమీఫైనల్ చేరితే, ఆ తర్వాత గ్రూప్-బి లో అగ్రస్థానంలో నిలిచే బలమైన శ్రీలంక లేదా బంగ్లాదేశ్ జట్టుతో వారు సెమీఫైనల్లో తలపడతారు. ఈ నాకౌట్ మ్యాచ్‌లో పాకిస్థాన్ గెలిచి సంచలనం సృష్టిస్తేనే ఫైనల్ రేసులోకి దూసుకొస్తుంది.

ఫైనల్లో భారత్-పాక్ సమరం ఎలా సాధ్యం?

మరోవైపు భారత్ కూడా తన సెమీఫైనల్ పోరులో గ్రూప్-బి కి చెందిన రెండవ స్థానంలో ఉన్న జట్టును ఓడించి ఫైనల్‌కు చేరుకోవాలి. ఒకవేళ భారత్ తన సెమీఫైనల్‌లో గెలిచి, అటు పాకిస్థాన్ కూడా తన సెమీఫైనల్‌లో విజయం సాధిస్తే.. సెప్టెంబర్ 13న జరిగే మహా సంగ్రామమైన ఆసియా కప్ ఫైనల్లో భారత్, పాకిస్థాన్ జట్లు మళ్లీ తలపడతాయి. ఈ సమీకరణాలన్నీ సరిగ్గా కుదిరితేనే అభిమానులు కోరుకుంటున్న మహాపోరు మళ్లీ సాకారమవుతుంది.

క్రికెట్ లవర్లకు పండుగే

భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ ఉందంటే మైదానంలో వాతావరణం ఎంత హాట్ హాట్ గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ టోర్నీలో ఇప్పటికే ఒక మ్యాచ్‌ పూర్తి కాగా, ఫైనల్ వేదికగా మరో మ్యాచ్ జరిగే అవకాశం ఉండటంతో క్రీడా ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది.ఆసియా కప్ నాకౌట్ దశ మ్యాచ్‌లు రసవత్తరంగా మారనున్నాయి. పాకిస్థాన్ తన తదుపరి మ్యాచ్‌లను గెలిచి ఫైనల్ చేరుకుంటే, భారత్‌తో జరిగే మరో హైవోల్టేజ్ పోరును చూడటానికి అభిమానులు సిద్ధంగా ఉన్నారు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *