Ind Vs Pak: భారత్ పాకిస్థాన్ మధ్య దశాబ్ధాలుగా పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుందన్న సంగతి తెలిసిందే. రెండు దేశాల మధ్య రాజకీయ ఉద్రిక్తతల నడుమ ఒక సంచలన వార్త బయటకు వచ్చింది. వచ్చే ఏడాది పాకిస్థాన్‌లో జరగనున్న సౌత్ ఏషియన్ ఫెడరేషన్ గేమ్స్‌లో పాల్గొనేందుకు భారత ఒలింపిక్ అసోసియేషన్ ప్రాథమికంగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇస్లామాబాద్, లాహోర్, పెషావర్ నగరాల్లో ఈ పోటీలు జరగనున్నాయి.
పాకిస్థాన్ వేదికగా జరగనున్న సౌత్ ఏషియన్ గేమ్స్ ఆతిథ్యానికి సంబంధించి కీలక పరిణామం చోటుచేసుకుంది. సౌత్ ఏషియన్ ఒలింపిక్ అసోసియేషన్ నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న భారత ప్రతినిధులు ఈ క్రీడల్లో పాల్గొనేందుకు ఆహ్వానాన్ని సూత్రప్రాయంగా అంగీకరించారు. పాకిస్థాన్ ఒలింపిక్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఖాలిద్ మహమూద్ ఈ విషయాన్ని మీడియాకు వెల్లడించారు. భారత్ నుంచి ఏయే విభాగాలకు సంబంధించి ఎంతమంది క్రీడాకారులు వస్తారనే దానిపై 2027 జనవరి నాటికి పూర్తి స్పష్టత రానుంది.
మూడు ప్రధాన నగరాల్లో 28 క్రీడలు
ఏప్రిల్ నెలలో వైభవంగా ప్రారంభం కానున్న ఈ సౌత్ ఏషియన్ గేమ్స్ లో మొత్తం 28 రకాల క్రీడలను చేర్చారు. పోటీలను మూడు వేర్వేరు నగరాల్లో నిర్వహించేందుకు పాకిస్థాన్ ఏర్పాట్లు చేస్తోంది. రాజధాని ఇస్లామాబాద్‌లో మార్షల్ ఆర్ట్స్, టెన్నిస్, స్క్వాష్ వంటి 15 ప్రధాన క్రీడలు జరగనున్నాయి. సాంస్కృతిక కేంద్రమైన లాహోర్‌లో క్రికెట్‌తో సహా 10 రకాల పోటీలను ఏర్పాటు చేస్తున్నారు. మిగిలిన మూడు క్రీడలకు పెషావర్ నగరం ఆతిథ్యం ఇవ్వనుంది.
భారత ప్రభుత్వం నుంచి తుది నిర్ణయం రావాల్సిందే
రెండు దేశాల ఒలింపిక్ సంఘాల మధ్య చర్చలు సానుకూలంగా జరిగినప్పటికీ, భారత ప్రభుత్వం దీనిపై అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. సరిహద్దుల్లో ఉద్రిక్తతల దృష్ట్యా పాకిస్థాన్‌లో పర్యటించే విషయంలో భారత క్రీడా శాఖ, విదేశాంగ మంత్రిత్వ శాఖల నిబంధనలు అత్యంత కీలకంగా మారనున్నాయి. ప్రభుత్వ మార్గదర్శకాలకు లోబడే భారత క్రీడాకారుల ప్రయాణం ఆధారపడి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇస్తే తప్ప భారత అథ్లెట్ల బృందం సరిహద్దు దాటే అవకాశం లేదు.
2008 తర్వాత క్రికెట్ టీమ్ దూరం
భారత క్రికెట్ జట్టు చివరిసారిగా 2008 ఆసియా కప్ టోర్నీ కోసం పాకిస్థాన్ గడ్డపై అడుగుపెట్టింది. ఆ తర్వాత రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక క్రికెట్ సిరీస్‌లు పూర్తిగా నిలిచిపోయాయి. ఆసియా కప్, ఛాంపియన్స్ ట్రోఫీ వంటి కీలక టోర్నీలకు కూడా భారత క్రికెట్ జట్టు పాక్ వెళ్లకుండా తటస్థ వేదికల్లోనే ఆడుతోంది. అయితే టెన్నిస్ వంటి ఇతర రకాల క్రీడల్లో భారత జట్లు పాకిస్థాన్‌లో పర్యటించాయి. 2024 ఫిబ్రవరి నెలలో డెవిస్ కప్ మ్యాచ్ కోసం భారత టెన్నిస్ జట్టు పాకిస్థాన్ వెళ్లి విజయం సాధించి వచ్చింది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..