Headlines

పార్క్ చేసిన కారులో వింత శబ్ధాలు.. దగ్గరకెళ్లి బానెట్‌ ఓపెన్‌ చేసి చూడగా షాక్‌! | Seven Foot Giant Python Found in Parked Car, Rescued Safely in Mumbai


ముంబై, సెప్టెంబర్ 8: సాధారణంగా కారును పార్క్ చేసి తిరిగి వచ్చేసరికి మహా అయితే కారుపైన చెత్తా చెదారం పడుతుంది. లేదంటే ఆకతాయిలు కారులై స్క్రాచ్‌లు వేస్తారు. కానీ ముంబైలోని దహిసర్‌లో ఓ వ్యక్తికి ఊహించని షాక్ ఎదురైంది. పార్క్ చేసిన కారు బానెట్‌లో ఏకంగా ఏడడుగుల పొడవైన కొండచిలువ ప్రత్యక్షమైంది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. దహిసర్ వెస్ట్‌లోని కందర్పాడ ప్రాంతంలో బాపు బాగ్వే రోడ్డుకు సమీపంలోని మహేశ్వర్ భవన్ ప్రాంగణంలో ఈ ఘటన చోటుచేసుకుంది. సన్నీ కాంబ్లే సోదరి కారులో ఈ భారీ కొండచిలువ కనిపించింది. కారు అడుగు భాగం నుంచి నెమ్మదిగా బానెట్ వైపు పాకుతున్న పామును స్థానికులు గుర్తించారు. దగ్గరగా పరిశీలించగా అది సుమారు ఏడు అడుగుల పొడవున్న కొండచిలువ అని తేలింది.

ఇంజిన్ సమీపంలో చుట్టుకుని..

కొండచిలువను చూసిన వెంటనే స్థానికులు భయాందోళనకు గురయ్యారు. పెద్ద సంఖ్యలో అక్కడ గుమిగూడి పాము కారులోకి ఎలా చేరిందోనని చర్చించుకున్నారు. వెంటనే వన్యప్రాణి సంరక్షణ కార్యకర్తలకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న రెస్క్యూ నిపుణుడు సమీర్ గుప్తా అక్కడికి చేరుకున్నారు. కారు బానెట్‌ను జాగ్రత్తగా తెరిచి పరిశీలించగా, ఇంజిన్‌కు సమీపంలోని భాగంలో కొండచిలువ చుట్టుకుని ఉన్నట్లు గుర్తించారు. రెస్క్యూ సిబ్బంది ఎంతో జాగ్రత్తగా దాన్ని బయటకు తీసి ప్రత్యేక సంచిలోకి తరలించారు.

ఇవి కూడా చదవండి



వైద్య పరీక్షల అనంతరం అడవిలోకి..

కారులోని ఇంజిన్, ఇతర వేడి భాగాల కారణంగా కొండచిలువకు ఏమైనా గాయాలయ్యాయా అనే అనుమానంతో ముందుగా దానికి వైద్య పరీక్షలు నిర్వహించారు. పరీక్షల్లో కొండచిలువ ఆరోగ్యంగా ఉందని, ఎలాంటి గాయాలు లేవని నిర్ధారించారు. అనంతరం దాన్ని ముంబైలోని సంజయ్ గాంధీ నేషనల్ పార్క్ సహజ ఆవాసంలో సురక్షితంగా విడిచిపెట్టారు. దీంతో స్థానికులు ఊపిరిపీల్చుకున్నారు. పార్క్ చేసిన కారు బానెట్‌లో భారీ కొండచిలువ కనిపించడంతో అక్కడి ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో ఈ వింత ఘటనపై నెటిజన్లు కూడా ఆసక్తి వ్యక్తం చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *