Headlines

Andhra News: కాపాడండయ్యా నన్ను.. భార్య నుంచి రక్షణ కల్పించాలని పీజీఆర్ఎస్‌లో భర్త ఫిర్యాదు! | Kakinada: Disabled Husband Approaches PGRS Seeking Protection from Wife


తన భార్య నుంచి రక్షణ కల్పించాలని ఓ వ్యక్తి పీజీఆర్‌ఎస్ కార్యాలయానికి వచ్చి అధికారులను వేడుకున్న ఘటన కాకినాడ జిల్లాలో వెలుగుచూసింది. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. పిఠాపురానికి చెందిన బల్లిపాటి శివాజీ, పదేళ్ల క్రితం అదే ప్రాంతానికి చెందిన దుర్గ అనే యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ప్రస్తుతం వీరికి ఓ కుమారుడు ఉన్నాడు. 2024 వరకు వీరి జీవితం సాఫీగానే సాగింది. కానీ, ఆ తర్వాత అసలు సమస్య మొదలైంది.

టీవీ మెకానిక్‌గా పనిచేస్తూ జీవనం సాగించే శివాజీకి 2024లో ఓ రోడ్డు ప్రమాదం జరిగింది. దీంతో కాలు విరిగి అతను మంచానికే పరిమితమయ్యాడు. అప్పటి నుంచి కర్ర సహాయంతోనే నడిచేవాడు. ఇక అప్పటి నుంచి భార్య తనను సరిగ్గా పట్టించుకోవడం లేదని, రోజూ కొట్టడం, ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, అన్నంలో విషం పెట్టి చంపేస్తానని బెదిరించడం చేస్తోందని బాధితుడు ఆరోపించాడు. ఈ విషయంపై చాలాసార్లు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని, అందుకే పాడా (PADA) కార్యాలయానికి వచ్చినట్లు తెలిపాడు.

అంతేకాదు, గత కొన్ని రోజులుగా తన కొడుకుపై కూడా ఆమె వివక్ష చూపుతోందని, తనను ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపిస్తోందని ఆరోపించాడు. అంతటితో ఆగకుండా తనపైనే కేసు పెడతానని బెదిరిస్తోందని వాపోయాడు. తన భార్య నుంచి ఎలాగైనా తనను కాపాడాలని, తన ప్రాణానికి రక్షణ కల్పించాలని అతను అధికారులను కోరాడు. ఈ ఘటన ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *