Headlines

ఏడుపొస్తే ఏడవండి.. శరీరంలో ఏం జరుగుతుందో తెలిస్తే అవాక్కవ్వాల్సిందే.. | Why Crying is Good for Health, Science and Mental Benefits

ఏడుపొస్తే ఏడవండి.. శరీరంలో ఏం జరుగుతుందో తెలిస్తే అవాక్కవ్వాల్సిందే.. | Why Crying is Good for Health, Science and Mental Benefits


మన సమాజంలో ఏడ్వడం బలహీనతకు సంకేతం అనే అభిప్రాయం బలంగా ఉంది. ముఖ్యంగా మగవారు ఏడవకూడదు అని చిన్నప్పటి నుంచే నూరిపోస్తుంటారు. కానీ శాస్త్రవేత్తలు, మానసిక నిపుణులు మాత్రం ఇందుకు పూర్తి భిన్నమైన విషయాన్ని వెల్లడిస్తున్నారు. ఏడ్వడం అనేది బలహీనత ఎంతమాత్రమూ కాదు.. అది మన శరీరం, మెదడు ఒత్తిడిని తగ్గించుకోవడానికి ఉపయోగించే ఒక సహజమైన డిటాక్స్ ప్రక్రియ. బాధగా ఉన్నప్పుడైనా, ఆనందభాష్పాలు వచ్చినప్పుడైనా మనసారా ఏడ్చేశాక మనస్సు ఎంతో తేలికగా, ప్రశాంతంగా అనిపిస్తుంది. అసలు ఏడ్చినప్పుడు మన శరీరంలో ఏం జరుగుతుంది? శాస్త్రీయంగా దానివల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేమిటో చాలా మందికి తెలియవు.

ఏడ్చినప్పుడు శరీరంలో జరిగే సైన్స్ ఏంటి?

మన కళ్ల నుంచి వచ్చే కన్నీళ్లు కేవలం నీళ్లు మాత్రమే కావు. సైన్స్ ప్రకారం కన్నీళ్లు మూడు రకాలుగా ఉంటాయి.

బేసల్ టియర్స్: ఇవి కళ్లను తేమగా ఉంచడానికి, పొడిబారకుండా చూసేందుకు నిరంతరం స్రవిస్తాయి.

రిఫ్లెక్స్ టియర్స్: దుమ్ము, ధూళి లేదా ఉల్లిపాయలు కోసేటప్పుడు కంటిని రక్షించడానికి వస్తాయి.

ఎమోషనల్ టియర్స్ : తీవ్రమైన బాధ, సంతోషం లేదా ఒత్తిడికి గురైనప్పుడు వచ్చేవి. వీటిలోనే అసలైన ఆరోగ్య రహస్యం దాగి ఉంది.

భావోద్వేగానికి గురై ఏడ్చినప్పుడు మన మెదడులో ప్రత్యేకమైన రసాయనాలు విడుదలవుతాయి.

ఏడ్వడం వల్ల కలిగే 5 అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు.

ఒత్తిడిని తగ్గించే ఫీల్ గుడ్ హార్మోన్లు

మనం తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నప్పుడు శరీరంలో కార్టిసోల్ అనే స్ట్రెస్ హార్మోన్ స్థాయి పెరుగుతుంది. ఎమోషనల్ కన్నీళ్ల ద్వారా ఈ విష పదార్థాలు శరీరం నుండి బయటకు వెళ్లిపోతాయి. అంతేకాకుండా ఏడ్చే సమయంలో మెదడు ఎండోర్ఫిన్స్, ఆక్సిటోసిన్ అనే హార్మోన్లను విడుదల చేస్తుంది. ఇవి సహజమైన పెయిన్ కిల్లర్స్‌లా పనిచేసి, శారీరక, మానసిక బాధను తగ్గించి ప్రశాంతతను ఇస్తాయి.

మానసిక ప్రశాంతత

ఏడ్చిన తర్వాత హృదయ స్పందన రేతు సమతుల్యమవుతుంది. పారాసింపథెటిక్ నాడీ వ్యవస్థ ఉత్తేజితమై, శరీరం విశ్రాంతి స్థితిలోకి వెళ్తుంది. అందుకే ఎంత పెద్ద మానసిక భారమైనా కాసేపు ఏడ్చేశాక మనసు తేలికపడింది అనిపిస్తుంది.

కంటి చూపు మెరుగుపడుతుంది

కన్నీళ్లలో లైసోజైమ్ అనే ప్రత్యేక ఎంజైమ్ ఉంటుంది. ఇది శక్తివంతమైన యాంటీబాక్టీరియల్, యాంటీవైరల్ గుణాలను కలిగి ఉంటుంది. ఇది కంటిలో చేరే బాక్టీరియా, క్రిములను సంహరించి, కంటి ఇన్ఫెక్షన్లను నివారిస్తుంది. కళ్లను తేమగా ఉంచి చూపు స్పష్టంగా ఉండేలా చేస్తుంది.

రక్తపోటు నియంత్రణ

బాధను లేదా కోపాన్ని అణచిపెట్టుకున్నప్పుడు రక్తపోటు, గుండె వేగం పెరుగుతాయి. స్వేచ్ఛగా ఏడ్చి బాధను బయటకు పంపినప్పుడు రక్తపోటు సాధారణ స్థితికి వస్తుంది. ఇది గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.

ఇతరుల మద్దతు, సానుభూతి లభిస్తుంది

సామాజికంగా చూస్తే, ఒక వ్యక్తి ఏడవడం అనేది నాకు సహాయం లేదా ఓదార్పు కావాలి అని చెప్పే ఒక మౌన సంకేతం. ఇది చుట్టూ ఉన్న వ్యక్తులలో సానుభూతిని నింపి, పరస్పర బంధాలను బలోపేతం చేస్తుంది.

బాధను లేదా ఆవేదనను గుండెలోనే అణచిపెట్టుకోవడం వల్ల తీవ్రమైన మానసిక ఒత్తిడి, డిప్రెషన్, గుండె సంబంధిత సమస్యలు వస్తాయి. అందుకే భావోద్వేగాలను అణచుకోవద్దు. ఏడ్వడం ఒక నాచురల్ హీలింగ్ ప్రాసెస్. కాబట్టి ఏడుపొస్తే దాచుకోకుండా మనసారా ఏడ్చేయడమే శారీరక, మానసిక ఆరోగ్యానికి మంచిది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *