Headlines

కేతు గ్రహంతో వారికి కష్టనష్టాలు..! ఈ రాశులు జాగ్రత్త.. ఈ పరిహారాలతో ఊరట | Ketu Transit 2026: These 6 Zodiac Signs Need to Be Cautious; Chanting Subrahmanya Ashtakam May Help


కేతువు ఒక పాప గ్రహం. పైగా వక్ర గ్రహం. ఎప్పుడు ఏ విధంగా కష్టనష్టాలను తీసుకు వస్తాడన్నది ఊహించడం కష్టం. తరచూ సుబ్రహ్మణ్యాష్టకం పఠించడం వల్ల కేతువు దుష్ఫలితాలు చాలావరకు తగ్గుతాయి. కేతువుకు సుబ్రహ్మణ్య స్వామి అధిదేవత. సింహ రాశిలో సొంత నక్షత్రమైన మఖలో ప్రస్తుతం సంచారం చేస్తున్న కేతువు డిసెంబర్ 5న కర్కాటక రాశిలోకి ప్రవేశించడం జరుగుతుంది. వృషభం, కర్కాటకం, సింహం, వృశ్చికం, మకరం, కుంభ రాశుల వారు కేతువు నుంచి ఎదురయ్యే సమస్యల విషయంలో కాస్తంత అప్రమత్తంగా ఉండడం మంచిది. మిస్టరీ గ్రహం, ఆధ్యాత్మిక గ్రహం కూడా అయినందువల్ల కేతువు దైవ భక్తికి మాత్రమే లొంగుతాడు.

వృషభం

కేతువు ప్రస్తుతం చతుర్థ స్థానంలో, అంటే సుఖ సంతోషాలు, కుటుంబం, ఆస్తులకు సంబంధించిన స్థానంలో సంచారం చేస్తున్నందువల్ల ఈ విషయాల్లో ఈ రాశివారు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. సాధారణంగా చతుర్థ కేతువు కుటుంబ సౌఖ్యాన్ని ఇవ్వడు. నిద్రా సౌఖ్యం కూడా దూర మవుతుంది. శుభకార్యాలు వాయిదా పడతాయి. ఆస్తి సమస్యలు తలెత్తుతాయి. రావలసిన సొమ్ము ఒక పట్టాన చేతికి అందదు. కుటుంబంలో కలహాలు, కలతలకు బాగా అవకాశం ఉంది.

కర్కాటకం

ద్వితీయ స్థానంలో సంచారం చేస్తున్న కేతువు వల్ల ఖర్చులు పెరగడం, చేతిలో డబ్బు నిలవక పోవడం, ధన నష్టం ఎక్కువగా జరగడం, ఇష్టమైన బంధుమిత్రులకు దూరం కావడం, ఆదాయ వృద్ధి ప్రయత్నాలు సఫలం కాకపోవడం, శ్రమ ఎక్కువ లాభం తక్కువగా ఉండడం వంటివి జరుగుతాయి. కీలక విషయాల్లో అనాలోచిత నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. మాటకు విలువ తగ్గుతుంది. కుటుంబ సౌఖ్యం తక్కువగా ఉంటుంది. దుర్వార్తలు వినడం జరుగుతుంది.

సింహం

ఈ రాశిలో సంచారం చేస్తున్న కేతువు వల్ల అకారణ విభేదాలు తలెత్తుతాయి. బంధుమిత్రులతో వివాదాలు ఏర్పడతాయి. ఎంత సమర్థత ఉన్నా వెలుగులోకి రాకపోవచ్చు. వ్యక్తిగత పురోగతికి ఆటంకాలు ఎక్కువగా కలుగుతాయి. చివరి క్షణంలో శుభ కార్యాలు వాయిదా పడతాయి. ఉద్యో గంలో ప్రాభవం, ప్రాధాన్యం తగ్గుతాయి. ప్రేమ వ్యవహారాల్లో చిక్కులు ఎదురవుతాయి. మిత్రుల వల్ల ఆర్థికంగా నష్టపోతారు. తరచూ అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడతారు. ఆదాయం తగ్గుతుంది.

వృశ్చికం

ఈ రాశికి దశమ స్థానంలో కేతువు సంచారం వల్ల ఉద్యోగంలో ఊహించని సమస్యలు తలెత్తు తాయి. అధికారులతో, సహోద్యోగులతో అపార్థాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. ఉద్యోగంలో మీ తర్వాత వారికి పదోన్నతులు లభించవచ్చు. ఇష్టం లేని ప్రాంతాలకు బదిలీ అయ్యే అవకాశం కూడా ఉంది. ఉద్యోగం మారే ప్రయత్నాలు ఫలించవు. వృత్తి, వ్యాపారాల్లో యాక్టివిటీ తగ్గుతుంది. నిరుద్యోగులకు ఆశాభంగాలు తప్పకపోవచ్చు. బంధుమిత్రులు అపనిందలు వేసే అవకాశం ఉంది.

మకరం

ఈ రాశికి ద్వితీయ స్థానంలో సంచారం చేస్తున్న కేతువు వల్ల కుటుంబ సౌఖ్యం, దాంపత్య సౌఖ్యం బాగా తగ్గుతాయి. మాట తొందరపాటు వల్ల బాగా నష్టపోతారు. ముఖ్యమైన వ్యవహారాల్లో పొర పాటు నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. ధన సహాయం పొందినవారు ముఖం చాటేస్తారు. డబ్బు ఇచ్చినా, తీసుకున్నా నష్టపోయే అవకాశం ఉంది. శ్రమ ఎక్కువ ఫలితం తక్కువగా ఉంటుంది. ఉద్యోగంలో ఆదాయం పెరగకపోవచ్చు. వృత్తి, వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి.

కుంభం

ఈ రాశికి సప్తమంలో కేతువు సంచారం వల్ల జీవిత భాగస్వామితో అకారణ విభేదాలు, వివాదాలు తలెత్తుతాయి. దాంపత్య జీవితంలో సుఖ సంతోషాలు లోపిస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో భాగస్వా ములతో సమస్యలు ప్రారంభమవుతాయి. విదేశీ ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు ఆశించిన ఫలితాలను ఇవ్వకపోవచ్చు. ఆస్తుల క్రయ విక్రయాల్లో నష్టపోయే అవకాశం ఉంది. బంధుమిత్రుల్లో కొందరు నమ్మక ద్రోహానికి పాల్పడే అవకాశం ఉంది. ఆదాయం పెరిగినా ఆర్థిక సమస్యలు కొనసాగుతాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *