క్యాన్సర్ నివారణలో క్యాప్సికమ్ పాత్ర: ఎరుపు, పసుపు రంగు క్యాప్సికమ్‌లలో శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు లభిస్తాయి. ఎరుపు క్యాప్సికమ్‌లో లైకోపీన్ అనే కాంపౌండ్ సమృద్ధిగా ఉంటుంది. ఇది ప్రోస్టేట్, ఊపిరితిత్తుల క్యాన్సర్ల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది.
పసుపు క్యాప్సికమ్‌లో లూటీన్, జెగ్జాంతిన్, బీటా-కరోటిన్ వంటి కెరోటినాయిడ్లు ఎక్కువ. ఇవి శరీరంలోని ఆక్సిడేటివ్ స్ట్రెస్‌ను తగ్గించి, హానికర కణాల ఎదుగుదలను అడ్డుకుంటాయి. ఒక మధ్యస్థ పరిమాణంలో ఉండే ఎర్రటి క్యాప్సికమ్ రోజువారీ అవసరానికి కావలసిన దానికంటే మూడు రెట్లు ఎక్కువ విటమిన్ సీని అందిస్తుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచి, క్యాన్సర్ కణాలతో పోరాడేలా శరీరాన్ని సిద్ధం చేస్తుంది.
ఇతర ఆరోగ్య ప్రయోజనాలు: పసుపు క్యాప్సికమ్‌లోని విటమిన్ ఏ, లూటీన్ రేచీకటి, క్యాటరాక్ట్ వంటి సమస్యల నుండి కళ్ళను కాపాడుతాయి. ఇవి చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, రక్తప్రసరణను మెరుగుపరుస్తాయి. చర్మంలో కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచి వృద్ధాప్య ఛాయలను అడ్డుకుంటాయి.
గరిష్ఠ ప్రయోజనాల కోసం వీటిని ఎలా తీసుకోవాలి?: క్యాప్సికమ్‌లను తీసుకునే విధానంపై కూడా వాటిలోని పోషకాల లభ్యత ఆధారపడి ఉంటుంది. ఎరుపు, పసుపు క్యాప్సికమ్‌లను పచ్చిగా సలాడ్లలో, డిప్స్‌తో లేదా స్నాక్స్‌గా తీసుకోవడం వల్ల విటమిన్ సీ నాశనం కాకుండా పూర్తిగా శరీరానికి అందుతుంది.
వీటిని ఎక్కువసేపు నూనెలో వేయించడం లేదా ఎక్కువ ఉడికించడం వల్ల వాటిలోని యాంటీఆక్సిడెంట్లు నశిస్తాయి. కాబట్టి తేలికగా స్టీమింగ్ చేయడం, సాల్టే చేయడం లేదా గ్రిల్ చేయడం మంచిది. క్యాప్సికమ్లలోని ఏ, ఈ విటమిన్లు కొవ్వులో కరిగేవి. కాబట్టి కొద్దిగా ఆలివ్ ఆయిల్ లేదా గింజలతో కలిపి తీసుకుంటే పోషకాలు త్వరగా శోషించబడతాయి.
వీటిలోని పూర్తి పోషకాలను పొందాలంటే ఎక్కువ ఉడికించకుండా పచ్చిగా సలాడ్లలో గానీ, తేలికపాటి గ్రిల్ లేదా స్టీమింగ్ చేసి గానీ తీసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. రోజువారీ ఆహారంలో ఎరుపు, పసుపు క్యాప్సికమ్‌లను భాగం చేసుకోవడం ద్వారా దీర్ఘకాలిక వ్యాధుల నుండి సులభంగా రక్షణ పొందవచ్చని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.





