Headlines

చిన్నారుల భద్రతపై రాజీపడేది లేదు.. మెటా ఇండియా హెడ్‌కు బాలల హక్కుల కమిషన్ సమన్లు.. | NCPCR Summons Meta India Head Over CSEAM Ads Controversy


ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం మెటా ప్లాట్‌ఫామ్‌లలో బాలల భద్రతకు సంబంధించిన వ్యవహారంలో జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. బాలల లైంగిక వేధింపులు, దుర్వినియోగానికి సంబంధించిన సమాచారం ప్రచారమయ్యేలా ప్రకటనలు వెలువడుతున్నాయన్న ఆరోపణలపై కమిషన్ సమగ్ర విచారణకు ఆదేశించింది. ఈ క్రమంలో మెటా ఇండియా మేనేజింగ్ డైరెక్టర్, హెడ్‌ను వ్యక్తిగతంగా కమిషన్ ఎదుట హాజరుకావాలని సమన్లు జారీ చేసింది. మెటాకు చెందిన ప్లాట్‌ఫామ్‌లలో బాలల లైంగిక వేధింపుల కంటెంట్‌ను ప్రోత్సహించే తరహా ప్రకటనలు వస్తున్నాయంటూ బీబీసీ ఐ ప్రచురించిన పరిశోధనాత్మక కథనం దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ కథనాన్ని సుమోటోగా స్వీకరించిన ఎన్‌సీపీసీఆర్.. గత జూలై 3 న మెటా సంస్థకు తీవ్రస్థాయిలో నోటీసులు జారీ చేసింది. ప్రకటనల నియంత్రణ, భద్రతా ప్రమాణాలపై తక్షణ వివరణ ఇవ్వాలని ఆదేశించింది.

సమాధానంపై అసంతృప్తి.. నేరుగా విచారణకు మొగ్గు

కమిషన్ నోటీసులకు స్పందిస్తూ మెటా వారం రోజుల తర్వాత తన వివరణను సమర్పించింది. అయితే కంపెనీ ఇచ్చిన సమాధానంపై అసంతృప్తి వ్యక్తం చేసిన ఎన్‌సీపీసీఆర్, ఈ మొత్తం వ్యవహారంలో అసలు వాస్తవాలను వెలికితీసేందుకు అధికారిక దర్యాప్తు చేపట్టాలని నిర్ణయించింది.

కమిషన్ ఎదుట మెటా ఇండియా హెడ్ హాజరు

విచారణను వేగవంతం చేసిన బాలల హక్కుల కమిషన్.. సెప్టెంబర్ 9న కమిషన్ ఎదుట వ్యక్తిగతంగా విచారణకు హాజరుకావాలని మెటా ఇండియా ఎండీ, హెడ్‌ను ఆదేశిస్తూ సమన్లు జారీ చేసింది. దీంతో బుధవారం ఆయన కమిషన్ ముందు హాజరయ్యారు. ప్లాట్‌ఫామ్‌లో చిన్నారుల భద్రతను పణంగా పెడుతూ ఇలాంటి ప్రకటనలు ఎలా అనుమతించారన్న అంశాలపై కమిషన్ ఆయన్ని ప్రశ్నించినట్లు తెలుస్తోంది.  నిబంధనల ఉల్లంఘన జరిగినట్లు తేలితే కఠిన చర్యలు తీసుకునే అవకాశముంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *