
జల్పాయిగురి: పశ్చిమ బెంగాల్లోని జల్పాయిగురి జిల్లాలో ఓ పాఠశాలలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. టీచర్స్ డే సందర్భంగా ఏర్పాటు చేసిన విందులో తలెత్తిన వివాదం చివరకు హెడ్మాస్టర్, విద్యార్థుల మధ్య ఘర్షణకు దారితీసింది. ఇరువర్గాలు పరస్పరం దాడులు చేసుకోవడంతో పాఠశాల ప్రాంగణం కొద్దిసేపు రణరంగాన్ని తలపించింది. ఏకంగా రాపిడ్ యాక్షన్ ఫోర్స్ రంగంలోకి దిగాల్సి వచ్చింది.
పాఠశాలలో టీచర్స్ డే కార్యక్రమం అనంతరం విద్యార్థులకు విందు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులకు, పాఠశాల ప్రధానోపాధ్యాయుడికి మధ్య రాజుకున్న చిన్న వివాదం కాస్త వాగ్వాదానికి దారి తీసింది. పరిస్థితి అదుపు తప్పడంతో హెడ్మాస్టర్ తొలుత కొందరు విద్యార్థులపై చేయిచేసుకున్నారు. దీంతో ఆగ్రహించిన విద్యార్థులు తిరగబడ్డారు. పలువురు విద్యార్థులు హెడ్మాస్టర్పై దాడికి తెగబడ్డారు. కిందపడేసి కొట్టడంతో తీవ్రంగా గాయపడిన ప్రధానోపాధ్యాయుడిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో ఈ వ్యవహారం మరింత చర్చనీయాంశంగా మారింది.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు పాఠశాల వద్దకు చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశారు. అయితే విద్యార్థులు పోలీసుల వాహనాన్ని చుట్టుముట్టి ఆందోళన చేపట్టారు. దీంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారకుండా అధికారులు అదనపు బలగాలను రంగంలోకి దించారు. పరిస్థితిని అదుపు చేసేందుకు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ (RAF) కూడా అక్కడ మోహరించాల్సి వచ్చింది. విద్యార్థులు, ఉపాధ్యాయులు, పాఠశాల యాజమాన్యం నుంచి పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పాఠశాల ప్రాంగణంలో భద్రతా పరిస్థితిని పర్యవేక్షిస్తూ, తదుపరి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా చర్యలు చేపట్టారు.
వీడియో ఇక్కడ చూడండి..
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..