
‘నందూస్ వరల్డ్’ యూట్యూబ్ ఛానెల్ ద్వారా.. లక్షలాది మందికి సుపరిచితమైన యూట్యూబర్ రామ నందనకు ఊహించని షాక్ తగిలింది. లండన్ వీసాలు, ఉద్యోగాల పేరుతో భారీ మోసానికి పాల్పడ్డారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న నందనను శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఇమ్మిగ్రేషన్ అధికారులు, పోలీసులు అరెస్ట్ చేశారు. భారత్‌లో అడుగుపెట్టడమే ఆలస్యం ఆమెను అదుపులోకి తీసుకున్నారు.
లండన్ లైఫ్‌స్టైల్ వీడియోలతో తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న యూట్యూబర్ నందన అలియాస్ రమానందన.. మొత్తానికి పోలీసులకు దొరికిపోయారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఇమ్మిగ్రేషన్ అధికారులు అదుపులోకి తీసుకుని, విచారణ కోసం ఏపీలోని ఇబ్రహీంపట్నం పోలీసులకు అప్పగించారు. విదేశాల్లో ఉద్యోగాలు, వీసాల పేరుతో కోట్ల రూపాయల వసూళ్లకు పాల్పడి పరారైన నందన దంపతులపై గతంలోనే ఏపీ పోలీసులు లుక్ఔట్ సర్క్యులర్-LOC జారీ చేశారు. సోమవారం నందన విదేశాల నుంచి హైదరాబాద్ ల్యాండ్ అవ్వగానే ఎయిర్పోర్ట్ అలర్ట్ సిస్టమ్ ద్వారా అధికారులు ఆమెను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.
ఏపీలోని గుంటూరుకు చెందిన రమానందన, లండన్‌లో స్థిరపడి ‘నందూస్ వరల్డ్’ పేరుతో వ్లాగ్స్ చేసేవారు. మధ్యతరగతి కుటుంబాలకు విదేశీ జీవితంపై ఉన్న క్రేజ్‌ను ఆసరాగా చేసుకుని, ‘డెస్టినీ కన్సల్టెన్సీ’ అనే సంస్థ ద్వారా లండన్‌లో ఉద్యోగాలు, వీసా ఎక్స్టెన్షన్లు, సర్టిఫికేట్ ఆఫ్ స్పాన్సర్షిప్ ఇప్పిస్తామంటూ ప్రచారం మొదలుపెట్టారు. నమ్మిన వారి నుంచి లక్షలాది రూపాయలు వసూలు చేసి, ఆ తర్వాత నకిలీ డాక్యుమెంట్లు చేతిలో పెట్టడం లేదా కాంటాక్ట్ లోకి రాకుండా బోర్డు తిప్పేయడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. దీంతో ఈమెపై అరెస్ట్ వారెంట్, లుక్ఔట్ నోటీసులు జారీ అయ్యాయి.
నందన అరెస్ట్‌తో ఈ యూకే వీసా స్కామ్‌లో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం ఆమెను ఇబ్రహీంపట్నం పోలీసులు కస్టడీలోకి తీసుకుని విచారించనున్నారు. తలదాచుకున్న ఆమె భర్త మధుకర్ కోసం కూడా పోలీసులు గాలిస్తున్నారు.
అంతా భర్తే చేశాడంటూ వాంగ్మూలం..
అయితే.. వీసా స్కామ్ కేసులో యూట్యూబర్ రమానందన స్టేట్మెంట్ను రికార్డ్ చేశారు ఇబ్రహీంపట్నం పోలీసులు. తనకేమీ తెలియదంటూ పోలీసులకు వెల్లడించారామె. అంతా తన భర్తే చేశాడని రమా నందన వాంగ్మూలం ఇచ్చారు. తనపై తప్పుడు ప్రచారం జరుగుతోందని అన్నారు.
యూ ట్యూబర్ రమానందనను ఇబ్రహీంపట్నం తీసుకొచ్చారనే సమాచారంతో.. బాధితులు కూడా అక్కడకు వచ్చారు. తమ డబ్బులు ఇప్పించాలని డిమాండ్ చేశారు. తాను ఏ తప్పూ చేయలేదంటున్న రమానందనకూ కౌంటర్ ఇచ్చారు. రమానందన వీడియోలను నమ్మి డబ్బులు కట్టామని అంటున్నారు బాధితులు. ఇప్పుడు తెలియదంటే ఎలా కుదురుతుంది? తీసుకున్న డబ్బులు ఇవ్వాల్సిందేనని అంటున్నారు బాధితులు.
పొలాలు అమ్మేసి మరీ లక్షల్లో చెల్లించిన బాధితులు
రమానందన టీమ్ మాటలు నమ్మి.. పొలాలు అమ్మేసి మరీ లక్షల్లో ఇచ్చిన బాధితులు కూడా ఉన్నారు. తీరా మోసపోయామని తెలిసి.. డబ్బులు తిరిగిరావనే బాధలో గుండె సమస్యలు వచ్చి ఆస్పత్రి పాలైన బాధితులు కూడా ఉన్నారు. రమానందన అండ్ బ్యాచ్ ఎలా నమ్మించారు. డబ్బులు ఎలా వసూలు చేశారు. ఆ తర్వాత ఏం చేశారనే దానిపై ఎన్నారై జైపాల్‌రెడ్డి వివరించారు.
ఈ నెల 16 మరోసారి విచారణకు రావాలంటూ నోటీసులు
ఈ నెల 16 మరోసారి విచారణకు రావాల్సిందిగా యూ ట్యూబర్ రమానందనకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. పూర్తి స్థాయి విచారణ తర్వాత రమానందన పాత్ర ఎంతనేది తేలుతుందంటున్నారు పోలీసులు. రమానందనపై అద్దంకి సహా పలు స్టేషన్లలోనూ కేసులు నమోదయ్యాయి.
యూట్యూబ్‌లో నవ్వుతూ కనిపించే ముఖాల వెనుక ఇంతటి మోసాలు దాగుంటాయా అని సామాన్యులు ముక్కున వేలేసుకునేలా చేస్తోంది యూట్యూబర్ నందన ఉదంతం. దాదాపు 28 లక్షల సబ్స్క్రైబర్స్ ఉన్న ఒక టాప్ యూట్యూబర్.. విదేశీ ఉద్యోగాల ఆశ చూపి నిరుద్యోగులను ఎలా ముంచేసింది.. కోట్లు ఎలా దండుకుంది అనేది ఉత్కంఠ రేపుతోంది.