పండుగ వచ్చినా, ఇంట్లో చిన్న దావత్ జరిగినా మనకు ఫస్ట్ గుర్తుకొచ్చేది చికెన్ బిర్యానీ. బిర్యానీ అంటే నచ్చని వారు ఉండడం చాలా తక్కువ. అందరూ లొట్టలేసుకుంటూ తినే ఈ వంటకాన్ని ఇంట్లో తయారు చేయడం పెద్ద సవాలుతో కూడుకున్న పని. చాలామంది ఎదుర్కొనే ప్రధాన సమస్య.. బియ్యం, చికెన్ సరిగ్గా ఎంత వేయాలో తెలియకపోవడమే. కొన్నిసార్లు అన్నం ఎక్కువగా ఉండి చికెన్ ముక్కలు వెతుక్కునే పరిస్థితి వస్తే, మరికొన్నిసార్లు చికెన్ ముక్కలు ఎక్కువై అన్నం సరిపోదు. ఫలితంగా ఎంత కష్టపడినా ఇంట్లో వండిన బిర్యానీకి రెస్టారెంట్ స్థాయి రుచి, రూపం రావు. మీరు కూడా తరచుగా నలుగురికి ఎంత కొలతలతో బిర్యానీ వండాలో తెలియక గందరగోళానికి గురవుతున్నారా? అయితే ఇక చింతించాల్సిన పనిలేదు. ఓల్డ్ ఢిల్లీకి చెందిన ప్రసిద్ధ రెస్టారెంట్ చెఫ్.. పర్ఫెక్ట్ బిర్యానీ తయారీ కోసం సులభమైన చిట్కాలు చెప్పారు. ఈ చిట్కాలు పాటిస్తే మీ ఇంట్లో బిర్యానీ కూడా హండ్రెడ్ పర్సెంట్ చెఫ్ స్టైల్లో కుదురుతుంది.
చికెన్ – బియ్యం నిష్పత్తి: 1:1 ఫార్ములా
హోటల్ మాస్టర్ల ప్రకారం.. పర్ఫెక్ట్ చికెన్ బిర్యానీకి మొదటి, అత్యంత ముఖ్యమైన నియమం 1:1 నిష్పత్తి. అంటే మీరు తీసుకునే చికెన్, బియ్యం పరిమాణాలు ఎల్లప్పుడూ సమానంగా ఉండాలి.
నలుగురికి సరిపోయే కొలత: సాధారణ ఆహారం తీసుకునే నలుగురు వ్యక్తుల కోసం బిర్యానీ వండుతుంటే 500 గ్రాముల బాస్మతి బియ్యం, 500 గ్రాముల చికెన్ పర్ఫెక్ట్గా సరిపోతాయి. ఒకవేళ రైస్ ఎక్కువ తినేవారు అయితే 1 కేజీ బాస్మతి రైస్, 1కేజీ చికెన్ తీసుకోవాలి.
పీసెస్ ఎక్కువ కావాలనుకునే వారి కోసం: మీ కుటుంబ సభ్యులు చికెన్ ముక్కలను ఎక్కువగా ఇష్టపడేవారైతే, బియ్యాన్ని అర కిలోగానే ఉంచి చికెన్ పరిమాణాన్ని 750 గ్రాములకు పెంచుకోవచ్చు. దీనివల్ల ప్రతి సర్వింగ్లోనూ ధారాళంగా చికెన్ ముక్కలు వచ్చి చూడటానికి కూడా ఆకర్షణీయంగా కనిపిస్తుంది.
రైస్ ప్రెపరేషన్: 70-80 శాతం మాత్రమే
కేవలం కొలతలు ఉంటేనే సరిపోదు, వండే పద్ధతి కూడా బిర్యానీ రుచిని నిర్దేశిస్తుంది. బిర్యానీ బియ్యాన్ని ఎప్పుడూ 100 శాతం ఉడికించకూడదని అనుభవజ్ఞులైన చెఫ్‌లు చెబుతున్నారు. మసాలాలు వేసిన నీరు మసలుతున్నప్పుడు బాస్మతి బియ్యాన్ని వేసి, అది 70 నుండి 80 శాతం వరకు ఉడికేంత వరకు మాత్రమే ఉంచాలి. అన్నం పూర్తిగా మెత్తబడక ముందే, ఇంకా కాస్త గట్టిగా ఉన్నప్పుడే నీటిని పూర్తిగా వడకట్టాలి.
ఉల్లిపాయల వాడకంలో జాగ్రత్త
బిర్యానీకి ఫ్రైడ్ ఆనియన్స్ మంచి రుచిని ఇస్తాయి. అయితే వీటి పరిమాణంలో తేడా వస్తే బిర్యానీ రుచి దెబ్బతింటుంది. ప్రతి అర కిలో బియ్యానికి 3 మధ్యస్థ పరిమాణపు ఉల్లిపాయలను మాత్రమే సన్నగా కోసి బంగారు గోధుమ రంగు వచ్చే వరకు వేయించాలి. ఉల్లిపాయలను పరిమితికి మించి వాడితే బిర్యానీ తీపిదనానికి లోనయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ కొలతను కచ్చితంగా పాటించాలి.
బావర్చీ స్టైల్ దమ్ సీక్రెట్
హోటల్ లేదా దాబా బిర్యానీలలో వచ్చే ప్రత్యేకమైన గుమగుమలాడే సువాసన వెనుక ఉన్న అసలు రహస్యం వారు ఇచ్చే దమ్ పద్ధతిలోనే ఉంది.
లేయరింగ్ – సీలింగ్: ఒక మందపాటి అడుగు ఉన్న పాత్రను తీసుకుని చికెన్, సగం ఉడికిన అన్నాన్ని లేయర్లుగా పేర్చాలి. ఆ తర్వాత పాత్రపై మూత పెట్టి పిసికిన గోధుమ పిండితో చుట్టూ గాలి బయటకు పోకుండా గట్టిగా సీల్ చేయాలి.
మంట నియంత్రణ: ముందుగా ఈ పాత్రను 5 నిమిషాల పాటు అధిక మంట మీద ఉంచాలి. ఆ తర్వాత పాత్ర కింద ఒక బరువైన పెనం పెట్టి, 15 నిమిషాల పాటు తక్కువ మంట మీద ఉడకనివ్వాలి.
రెస్టింగ్ టైమ్: చాలామంది చేసే పెద్ద పొరపాటు మంట ఆర్పగానే మూత తెరవడం. అలా కాకుండా మంట ఆర్పాక 10 నిమిషాల పాటు ఆవిరి మీద అలాగే ఉంచాలి. ఈ సమయంలోనే మసాలా సువాసనలన్నీ చికెన్ ముక్కలకు లోతుగా పడతాయి.
ఈ సులభమైన ఫార్ములాలు, వండే పద్ధతిని పాటిస్తే ఇకపై ఇంట్లోనే హోటల్ స్థాయిలో నోరూరించే చికెన్ బిర్యానీని సులభంగా సిద్ధం చేసుకోవచ్చు.