Headlines

నిజమా.. ఒక్క తెల్ల వెంట్రుకను పీకితే 10 మొలుస్తాయా..? అసలు వాస్తవాలు తెలుసుకోండి.. | Does Plucking Grey Hair Cause More to Grow, Science Backed Truth Explained


ఈ రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా చాలామందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో తెల్ల జుట్టు ఒకటి. గతంలో వృద్ధాప్యానికి సంకేతంగా భావించినా.. నేడు కాలుష్యం, పోషకాహార లోపం, ధూమపానం, పెర్నిషియస్ అనీమియా, జన్యుపరమైన సమస్యల వల్ల చిన్న వయసులోనే జుట్టు నెరిసిపోతుంది. తలలో కొన్ని తెల్ల వెంట్రుకలు కనిపించగానే వాటిని పీకేసే అలవాటు చాలామందిలో ఉంటుంది. అయితే దీనివల్ల మరిన్ని తెల్ల వెంట్రుకలు వస్తాయన్న ప్రచారం ఎంతవరకు నిజం? అసలు జుట్టు ఎందుకు తెల్లబడుతుంది? అనే డౌట్లు చాలా మందికి ఉంటాయి.

తెల్ల వెంట్రుకను పీకితే మరిన్ని పెరుగుతాయా?

ఒక తెల్ల వెంట్రుకను పీకితే మరిన్ని తెల్ల వెంట్రుకలు వస్తాయనే మాటకు ఎటువంటి శాస్త్రీయ ఆధారం లేదు. వెంట్రుకల కుదుళ్లలో ఉండే మెలనోసైట్స్ అనే కణాలు మెలనిన్‌ను ఉత్పత్తి చేస్తాయి. మెలనిన్ వల్లనే జుట్టు నల్లగా కనిపిస్తుంది. వయసు పెరిగే కొద్దీ లేదా పోషకాల లోపం వల్ల మెలనిన్ ఉత్పత్తి తగ్గినప్పుడు జుట్టు నెరుస్తుంది. ఒక కుదురు నుంచి తెల్ల వెంట్రుకను పీకినంత మాత్రాన అక్కడ మెలనిన్ ఉత్పత్తి తిరిగి ప్రారంభం కాదు. కాబట్టి అక్కడ మళ్లీ తెల్ల వెంట్రుక మాత్రమే వస్తుంది తప్ప, పక్కన ఉన్న వెంట్రుకలు తెల్లబడవు. కానీ వెంట్రుకలను పీకడం వల్ల కుదుళ్లు తీవ్రంగా దెబ్బతింటాయి. పదే పదే పీకడం వల్ల ఆ ప్రదేశంలో కొత్త జుట్టు పెరగడం పూర్తిగా ఆగిపోయి బట్టతల వచ్చే ప్రమాదం ఉంది.

మెలనిన్  పాత్ర

కుదుళ్లలో రెండు రకాల మెలనోసైట్లు ఉంటాయి.

యూమెలనోసైట్లు: ఇవి జుట్టుకు నలుపు, గోధుమ రంగును ఇస్తాయి.

ఫెయోమెలనోసైట్లు: ఇవి ఎరుపు, పసుపు రంగులను అందిస్తాయి.

శరీరంలో ఈ వర్ణద్రవ్యాల ఉత్పత్తి తగ్గడమే జుట్టు రంగు మారడానికి ప్రధాన కారణం.

చిన్న వయసులోనే నెరిసే జుట్టుకు పరిష్కారాలు

వృద్ధాప్యం లేదా జన్యుపరమైన కారణాల వల్ల వచ్చే తెల్ల జుట్టును ఆపడం కష్టమైనా, పోషకాహార లోపాల వల్ల వచ్చే సమస్యను ఆహారపు అలవాట్లతో నియంత్రించవచ్చు.

యాంటీఆక్సిడెంట్లు: పండ్లు, తాజా కూరగాయలు, గ్రీన్ టీ, ఆలివ్ ఆయిల్, సముద్రపు ఆహారాల ద్వారా శరీరంలో ఆక్సిడేటివ్ ఒత్తిడిని తగ్గించవచ్చు.

విటమిన్ డి: పాలు, సాల్మన్ చేపలు, జున్ను తీసుకోవడం ద్వారా విటమిన్ డి లోపాన్ని భర్తీ చేయవచ్చు.

విటమిన్ బి-12: గుడ్లు, మాంసం, షెల్ఫిష్‌లలో విటమిన్ బి-12 పుష్కలంగా లభిస్తుంది.

తెల్ల జుట్టును పీకడం మానేసి, సమతుల్య ఆహారం తీసుకోవడం, అవసరమైతే వైద్యుల సలహాతో విటమిన్ సప్లిమెంట్లను వాడటం వల్ల జుట్టు ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *