Headlines

ప్రజావాణితో వెలిగిన రైతు జీవితం..25 ఏళ్ల కల నెరవేరి.. బీడు భూమిలో వరినాట్లు! | After 25 Years, Farmer Cultivates Barren Land as Collector Resolves Long Standing Access Road Issue


ప్రజావాణిలో ఇచ్చిన ఫిర్యాదుతో దశాబ్దాలుగా పరిష్కారం కాని సమస్యకు పరిష్కారం లభించింది. జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశాలతో రైతు పొలానికి దారి ఏర్పడటంతో.. దాదాపు 25 ఏళ్లుగా బీడుగా ఉన్న భూమిలో ఇప్పుడు వరినాట్లు పడ్డాయి. దీంతో రైతు కుటుంబంలో ఆనందం వెల్లివిరిసింది.

25 ఏళ్లుగా దారి కోసం ఇబ్బందులు…

తంగళ్లపల్లి మండలం జిల్లెల్ల గ్రామానికి చెందిన సందిరి రాజుకు సర్వే నంబర్ 173లో 2 ఎకరాల 20 గుంటల వ్యవసాయ భూమి ఉంది. అయితే ఆ భూమికి వెళ్లేందుకు సరైన దారి లేకపోవడంతో సుమారు 25 ఏళ్లుగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వ్యవసాయ పనులు చేపట్టేందుకు అవకాశం లేక భూమిని బీడుగానే ఉంచాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ప్రజావాణిలో ఫిర్యాదు.. వెంటనే స్పందించిన కలెక్టర్…

తన సమస్యకు పరిష్కారం చూపాలంటూ ఈ నెల 3న సోమవారం జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో నిర్వహించిన ప్రజావాణిలో సందిరి రాజు కుటుంబ సభ్యులు జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. సమస్యను పరిశీలించిన కలెక్టర్ వెంటనే స్పందించి, తంగళ్లపల్లి రెవెన్యూ అధికారులను సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు.

ఇవి కూడా చదవండి



అధికారుల చర్యలతో దారి సమస్యకు పరిష్కారం…

కలెక్టర్ ఆదేశాల మేరకు తంగళ్లపల్లి మండల రెవెన్యూ అధికారులు జిల్లెల్ల గ్రామానికి చేరుకుని రైతు తన పొలానికి వెళ్లేందుకు అవసరమైన దారి సమస్యను పరిష్కరించారు. దీంతో ఏళ్ల తరబడి పొలానికి వెళ్లేందుకు ఇబ్బంది పడుతున్న రైతుకు మార్గం సుగమమైంది.

బీడుభూమిలో పచ్చదనం.. రైతు కుటుంబంలో సంతోషం…

దారి సమస్య పరిష్కారం కావడంతో సందిరి రాజు తన పొలాన్ని దున్ని వరి నాట్లు వేశారు. దాదాపు పాతికేళ్ల తర్వాత తన భూమిలో వ్యవసాయం చేసుకునే అవకాశం రావడంతో రైతు ఆనందం వ్యక్తం చేశారు. ప్రజావాణిలో తన సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లిన వెంటనే స్పందించి పరిష్కారం చూపినందుకు జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్‌కు రైతు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజావాణి ద్వారా తమలాంటి సామాన్యుల సమస్యలకు పరిష్కారం లభిస్తుండటంపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు.

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *