మాస్కోలో ఉత్తరప్రదేశ్‌కు చెందిన భారతీయ ఇంజినీర్ చందన్ గుప్తాను రష్యా పోలీసులు అరెస్ట్ చేశారు. కాన్పూర్‌కు చెందిన చందన్.. నోయిడా సంస్థ తరఫున మాస్కోలో ఉద్యోగం చేస్తూ భార్యాపిల్లలతో ఉంటున్నారు. రష్యా పోలీసులు తన భర్తను అన్యాయంగా అదుపులోకి తీసుకున్నారని, అతన్ని యుద్ధంలోకి పంపేందుకు ప్రయత్నిస్తున్నారని భార్య స్నేహ గుప్తా వీడియో లో కన్నీరుమున్నీరుగా విలపించారు. సోషల్ మీడియాలో ఓ వీడియోను విడుదల చేసి, తన భర్తను కాపాడాలని ప్రధాని మోదీని కోరారు.
రష్యా సైన్యంలో చేరేలా ఒత్తిడి తెస్తున్నారు
మాస్కోలో తన భర్త చందన్ గుప్తాను ఆదివారం మధ్యాహ్నం 12:30 గంటల ప్రాంతంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు స్నేహా చందన్ గుప్తా సోషల్ మీడియాలో తెలిపారు. తాను 10 ఏళ్ల కుమారుడితో కలిసి మాస్కోలో చిక్కుకుపోయానని, ఏం చేయాలో తోచని పరిస్థితుల్లో ఉన్నానని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
తన భర్తను రక్షించాలని కోరుతూ ఆమె ప్రధాని నరేంద్ర మోదీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు సోషల్ మీడియా ద్వారా విజ్ఞప్తి చేశారు. ఈ ఘటనపై స్పందించిన మాస్కోలోని భారత రాయబార కార్యాలయం.. బాధితురాలి కుటుంబంతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిపింది.
మాస్కో డే ముందు రోజు వేధింపులు
తన భర్త ఎలాంటి తప్పు చేయకపోయినా పోలీసులు అన్యాయంగా అరెస్ట్ చేసి జైలుకు తరలించారని స్నేహా గుప్తా ఆరోపించారు. అంతేకాకుండా, అదుపులోకి తీసుకున్న తర్వాత ఆయనపై రష్యన్ సైన్యంలో చేరేలా ఒత్తిడి తెస్తున్నారని ఆమె వాపోయారు.
రష్యన్ సైన్యంలో సిబ్బంది కొరత తీవ్రంగా ఉందని, అందుకే భారతీయులతో పాటు ఇతర విదేశీయులను సైన్యంలోకి బలవంతంగా రిక్రూట్ చేసుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆమె అన్నారు. మాస్కో డే వేడుకలకు ముందు రోజు నుంచే తన భర్తను వివిధ రకాలుగా వేధించారని, ఆ తర్వాతే పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారని స్నేహ తెలిపారు.
స్పందించిన భారత దౌత్య కార్యాలయం
మాస్కోలో మద్యం సేవించి, ఓ అంబులెన్స్ అద్దాలు పగలగొట్టారనే ఆరోపణలతో చందన్ గుప్తాతో పాటు ఆయన స్నేహితుడు ఆశిష్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారనీ ప్రస్తుతం వీరు మాస్కోలోని పోలీస్ స్టేషన్లో ఉన్నట్లు తెలిసింది. మరోవైపు, ఈ పరిణామంపై రష్యాలోని భారత రాయబార కార్యాలయం స్పందించింది. తాము ఈ విషయంపై దృష్టి పెట్టామని, స్నేహా చందన్ గుప్తాతో పాటు అక్కడి స్థానిక అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిపింది. లా ఎన్ఫోర్స్మెంట్ అధికారుల ప్రకారం ఇదొక లీగల్ మేటర్ అని, వారు దీనిని పరిశీలిస్తున్నారని ఎంబసీ వెల్లడించింది. అదుపులో ఉన్న భారతీయ ఇంజినీర్‌ను కలిసేందుకు వీలుగా రాయబార కార్యాలయం ‘కాన్సులర్ యాక్సెస్’ కోరినట్లు అధికారులు తెలిపారు.
రష్యా సైన్యంలో 51 మంది భారతీయులు మృతి
రష్యా సైన్యంలో 227 మంది భారతీయులు చేరినట్లు కేంద్ర ప్రభుత్వం తాజాగా అధికారికంగా వెల్లడించింది. వీరిలో ఇప్పటివరకు 51 మంది ప్రాణాలు కోల్పోగా, 139 మందిని విధుల నుంచి తొలగించినట్లు విదేశాంగ శాఖ తెలిపింది. మిగిలిన వారిని కూడా రష్యా సైన్యం నుంచి పూర్తిగా బయటకు రప్పించి, సురక్షితంగా స్వదేశానికి తీసుకువచ్చేందుకు భారత్, రష్యా ప్రభుత్వాల మధ్య నిరంతరం చర్చలు జరుగుతున్నట్లు విదేశాంగ శాఖ వర్గాలు తెలిపాయి.
అధిక వేతనాల ఆశ చూపి ఏజెంట్లు యువతను టూరిస్ట్ వీసాలపై రష్యాకు పంపిస్తున్నారు. అక్కడకు వెళ్లాక చట్టవిరుద్ధంగా సైన్యంలో సహాయక సిబ్బందిగా పని చేయిస్తూ ఇబ్బంది పెడుతున్నారనీ కావున ఏజెంట్లకు భారీగా డబ్బులు చెల్లించి మోసపోవద్దని విదేశాంగ శాఖ హెచ్చరించింది.