Headlines

మీ రక్తాన్ని పీల్చే దోమ ఏదో మీకు తెలుసా..? 99శాతం మందికి తెలియని నిజాలు | Do All Mosquitoes Bite, Why Only Female Mosquitoes Drink Human Blood


రాత్రివేళ నిశబ్దంగా నిద్రపోతున్నప్పుడు చెవి దగ్గర గుయ్ మనే శబ్దం వినబడినా.. ఒంటిపై చిన్నపాటి దురద మొదలైనా చాలు.. అందరిలోనూ ఒకటే ఆందోళన మొదలవుతుంది. దోమ కుడితే డెంగ్యూ, మలేరియా వంటి ప్రాణాంతక వ్యాధులు ఎక్కడ వస్తాయోనని భయపడటం సహజం. అయితే మన ఇంట్లోనో, పెరట్లోనే తిరిగే దోమలన్నీ మనుషులను కుట్టవని, వాటిలో రక్తం తాగేవి ఒక ప్రత్యేక వర్గం మాత్రమేనని శాస్త్ర పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి. జీవశాస్త్ర పరిశోధనల ప్రకారం.. మగ దోమలు మనుషులను ఎప్పుడూ కుట్టవు. వాటికి చర్మాన్ని గుచ్చి రక్తం పీల్చే శారీరక నిర్మాణమే ఉండదు. అవి పూర్తిగా శాకాహారులుగా జీవిస్తూ చెట్ల రసాలు, పూలలోని మకరందాన్ని మాత్రమే తాగుతాయి. పర్యావరణంలో మొక్కల పరాగసంపర్కానికి తోడ్పడుతూ ఎవరికీ ఎలాంటి హానీ తలపెట్టకుండా తమ రోజులను గడిపేస్తాయి.

రక్తాన్ని పీల్చే దోమలు ఇవే..

మరి రక్తాన్ని పీల్చే పని ఎందుకు జరుగుతుందంటే.. అది పూర్తిగా ఆడ దోమలు చేసే పని. అయితే ఆడ దోమలు కూడా తమ ఆకలి తీర్చుకోవడానికి లేదా కడుపు నింపుకోవడానికి రక్తం తాగవు. అవి గుడ్లు పెట్టే క్రమంలో వాటి పిండం సరిగ్గా ఎదగడానికి అధిక మొత్తంలో ప్రొటీన్లు, ఐరన్ అవసరమవుతాయి. పూల మకరందంలో దొరకని ఈ పోషకాలు మనుషులు, జంతువుల రక్తంలో సమృద్ధిగా ఉంటాయి. అంటే తమ సంతానోత్పత్తి కోసమే అవి రక్తాన్ని తాగుతాయి.

ఆడ దోమల్లో కూడా వేర్వేరు జాతులు వేర్వేరు సమయాల్లో వేటాడుతాయి. ఉదాహరణకు డెంగ్యూ, చికెన్‌గున్యా వ్యాప్తికి కారణమయ్యే ఈడిస్ దోమలు ప్రధానంగా పగటిపూట చురుగ్గా ఉండి మనుషుల రక్తాన్ని తాగుతాయి. మలేరియాను వ్యాప్తి చేసే అనోఫిలస్ దోమలు రాత్రివేళల్లో విజృంభిస్తాయి. ఇక క్యూలెక్స్ దోమలు రాత్రిపూట తిరుగుతూ మనుషులతో పాటు పక్షులు, ఇతర జంతువుల రక్తాన్ని కూడా పీలుస్తాయి.

మనుషులను గుర్తించడానికి దోమలు ప్రధానంగా శ్వాస ద్వారా వెలువడే కార్బన్ డయాక్సైడ్, శరీర ఉష్ణోగ్రత, చర్మం నుంచి వచ్చే చెమట వాసనలను పసిగడతాయి. ఈ సంకేతాల ఆధారంగానే లక్ష్యాన్ని ఎంచుకుని దాడి చేస్తాయి. కాబట్టి వచ్చేసారి ఏదైనా దోమ కుట్టినప్పుడు, అది తన సంతానాన్ని పెంచే తాపత్రయంలో ఉన్న ఆడ దోమ మాత్రమేనని, పూలల్లో తేనె తాగుతూ గడిపే మగ దోమ కాదని గుర్తించండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *