Headlines

వామ్మో దయ్యం పక్షి.. గూడు కట్టదు.. కంటికి దొరకదు.. అరుపులు వింటే వెన్నులో వణుకే..

వామ్మో దయ్యం పక్షి.. గూడు కట్టదు.. కంటికి దొరకదు.. అరుపులు వింటే వెన్నులో వణుకే..


వామ్మో దయ్యం పక్షి.. గూడు కట్టదు.. కంటికి దొరకదు.. అరుపులు వింటే వెన్నులో వణుకే..

ప్రపంచంలో అత్యంత విచిత్రమైన, కాస్త భయంకరంగా అనిపించే పక్షులలో పొటూ ఒకటి. దీన్ని సాధారణంగా ఘోస్ట్ బర్డ్ లేదా దయ్యం పక్షి అని పిలుస్తారు. దీని రూపురేఖలు మాత్రమే కాదు, ఇది చేసే వింత ప్రవర్తన కూడా ఎవరినైనా ఆశ్చర్యానికి గురిచేస్తుంది. గుడ్లగూబ, నైట్‌జార్ పక్షుల కలయికలా కనిపించే ఈ పొటూ పక్షి గురించి చాలా మందికి తెలియదు. పొటూ పక్షులు నిక్టిబియస్ ప్రజాతికి చెందినవి. వీటిలో మొత్తం 7 జాతులు ఉన్నాయి. వీటికి పెద్ద తల, దానికి తగినట్లుగానే ప్రకాశవంతమైన పెద్ద పసుపు రంగు కళ్ళు ఉంటాయి. వీటి కంటి రెప్పలకు చిన్న చిన్న చారలు ఉంటాయి. దీనివల్ల కళ్లు మూసుకుని ఉన్నప్పటికీ, బయట శత్రువులు ఎవరైనా వస్తున్నారా లేదా అనేది చూసి గమనించగలవు. శరీరం అంతా బూడిద రంగు మచ్చలతో ఉండి, చూడటానికి ఒక దెయ్యం రూపంలా అనిపిస్తుంది.

అరుపులు వింటే వణుకే

ఈ పక్షులు ఎక్కువగా సెంట్రల్, సౌత్ అమెరికా అడవుల్లో, నదుల ఒడ్డున, రోడ్ల పక్కన ఉన్న చెట్లపై కనిపిస్తాయి. అయితే దాదాపు 5.6 కోట్ల సంవత్సరాల క్రితమే పశ్చిమ ఐరోపాలో ఇవి జీవించినట్లు శిలాజ ఆధారాలు ఉన్నాయి. ఈ ఘోస్ట్ బర్డ్ చేసే శబ్దం చాలా విచిత్రంగా, విషాదంగా ఉంటుంది. జానపద కథల ప్రకారం.. ఈ పక్షి అరుపులు కోల్పోయిన ప్రియమైన వారి ఏడుపులా, తల్లి కోసం అలమటించే చిన్న పిల్లవాడి కేకలా, భర్తను కోల్పోయి విలపించే భార్య ఆక్రందనలా వినిపిస్తుంది. రాత్రి వేళల్లో ఈ అరుపులు వింటే ఎవరికైనా వెన్నులో వణుకు పుట్టాల్సిందే.

కొమ్మలా మారిపోయే దెయ్యం పక్షి

దీనికి ఘోస్ట్ బర్డ్ అని పేరు రావడానికి మరో ముఖ్యమైన కారణం ఉనికి కనిపెట్టలేనంత నిశ్చలంగా ఉండటం. చెట్టు కొమ్మపై వాలినప్పుడు తన తలను పైకి ఎత్తి, కళ్లు మూసుకుని ఒక ఎండిపోయిన కర్ర ముక్కలా మారిపోతుంది. కేవలం చెట్ల కొమ్మలపైనే కాకుండా పొలాల కంచెలపై, కరెంట్ తీగలపై, ప్లాస్టిక్ సీసాలపై కూడా వాలి ఇలాంటి వింత భంగిమ పెడుతుంది. ఇవి కనీసం గూడు కూడా కట్టుకోవు. శత్రువుల నుంచి తప్పించుకోవడానికి ఈ మాఫియా కలరింగే వీటికి రక్షణ.

కాగా పిల్ల పొటూ పక్షులు కూడా చిన్న వయసులోనే ఈ వింత భంగిమను నేర్చుకుంటాయి. చిన్నప్పుడు ఇవి తెల్లటి మెత్తని ఈకలతో ఉండి, చెట్టు కొమ్మకు పట్టిన బూజు లేదా లేత పుట్టగొడుగులా కనిపిస్తాయి. ప్రకృతి సృష్టించిన ఈ వింత పక్షి, ప్రకృతిలో తనను తాను ఎలా కాపాడుకోవాలో చెప్పడానికి ఒక నిదర్శనం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *