చదువుకున్న యువకుడు.. ఇంజినీరింగ్ విద్య అభ్యసించాడు. జీవితంలో మంచి ఉద్యోగం సంపాదించి స్థిరపడాల్సిన వయసు. కానీ ప్రస్తుతం ఖాళీగా ఉండటం, చేతిలో డబ్బులు లేకపోవడం అతడిని ఊహించని దారిలోకి నెట్టింది. ఈఎంఐ పద్ధతిలో కొనుగోలు చేసిన స్కూటీకి రెండు నెలలుగా వాయిదాలు చెల్లించలేకపోయాడు. ఫైనాన్స్ సంస్థ నుంచి ఒత్తిడి పెరగడంతో చివరకు చోరీ చేయాలని నిర్ణయించుకున్నాడు. అర్ధరాత్రి స్కూటీ నంబర్ ప్లేట్ తొలగించి బయలుదేరాడు. ముందుగానే రెక్కీ చేసిన ప్రాంతంలో ఓ ఇంటిని టార్గెట్ చేశాడు. తాళం పగలగొట్టి లోపలికి ప్రవేశించి ఏకంగా రూ.30 లక్షల విలువైన బంగారు ఆభరణాలతో పాటు రూ.20 వేల నగదు దోచుకెళ్లాడు. చోరీ చేసిన బంగారాన్ని ఇంట్లోనే దాచుకున్నాడు. ఆ తర్వాత ఏం చేశాడో తెలుసా? తన స్కూటీకి బకాయి ఉన్న రెండు ఈఎంఐలను చెల్లించాడు. అయితే.. పోలీసుల దర్యాప్తులో సీసీ కెమెరాలు కీలక ఆధారంగా మారడంతో ఈ ఇంజినీరింగ్ యువకుడి చోరీ బాగోతం బయటపడింది.
పోలీసుల వివరాల ప్రకారం.. పెనమలూరుకు చెందిన వినోద్ విజయవాడలోని ఓ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ చదివాడు. కొన్ని సబ్జెక్టులు మిగిలిపోవడంతో ప్రస్తుతం ఉద్యోగం లేకుండా ఖాళీగా ఉంటున్నాడు. నాలుగు నెలల క్రితం వినోద్ రూ.10 వేలు ముందుగా చెల్లించి ఈఎంఐ పద్ధతిలో స్కూటీ కొనుగోలు చేశాడు. అయితే ఆ తర్వాత ఆర్థిక ఇబ్బందులు ఎదురవడంతో రెండు నెలలుగా ఈఎంఐలు చెల్లించలేకపోయాడు. ఈఎంఐలు పెండింగ్‌లో ఉండటంతో సుమారు పది రోజుల క్రితం ఫైనాన్స్ కంపెనీకి చెందిన కొందరు వినోద్ ఇంటికి వెళ్లారు. బకాయిలను వెంటనే చెల్లించాలని ఒత్తిడి చేసినట్లు పోలీసులు తెలిపారు. డబ్బుల కోసం తెలిసినవారిని కూడా సంప్రదించినప్పటికీ ఎవరూ సహాయం చేయలేదని విచారణలో వినోద్ చెప్పినట్లు పోలీసులు వెల్లడించారు. మరోవైపు ఫైనాన్స్ సంస్థ నుంచి ఒత్తిడి పెరగడంతో ఏం చేయాలో తెలియని పరిస్థితిలో చోరీకి పాల్పడాలని నిర్ణయించుకున్నాడు.
చోరీకి ముందే వినోద్ పక్కా ప్లాన్ వేసుకున్నాడు. ఈ నెల 5న అర్ధరాత్రి స్కూటీ నంబర్ ప్లేట్ తొలగించాడు. ఆ తర్వాత విజయవాడలోని పలు ప్రాంతాల్లో తిరుగుతూ చోరీకి అనువైన ఇంటి కోసం రెక్కీ చేశాడు. చివరకు మాచవరం పోలీస్ స్టేషన్ పరిధిలోని వెటర్నరీ కాలనీలో ఓ ఇంటిని టార్గెట్ చేశాడు. ఇంటికి తాళం వేసి ఉండటాన్ని గమనించిన వినోద్.. తన వెంట తెచ్చుకున్న ఇనుప రాడ్‌తో తాళాన్ని పగలగొట్టాడు. ఇంట్లోకి ప్రవేశించిన వినోద్ కప్బోర్డును తెరిచి అందులో ఉన్న బంగారు ఆభరణాలను దోచుకున్నాడు. మొత్తం సుమారు రూ.30 లక్షల విలువైన బంగారు ఆభరణాలు, రూ.20 వేల నగదును తీసుకుని అక్కడి నుంచి పరారయ్యాడు. చోరీ అనంతరం నేరుగా పెనమలూరులోని తన ఇంటికి చేరుకున్నాడు. పోలీసులు తనను గుర్తించకుండా ఉండేందుకు దొంగిలించిన బంగారాన్ని ఇంట్లోని మంచం పరుపు కింద దాచాడు. అంతేకాదు.. చోరీ చేసిన డబ్బుతో తన స్కూటీకి పెండింగ్‌లో ఉన్న రెండు ఈఎంఐలను చెల్లించాడు.
మరోవైపు ఇంట్లో చోరీ జరిగిన విషయాన్ని గుర్తించిన బాధితులు మాచవరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. చోరీ జరిగిన ప్రాంతంలోని సీసీ కెమెరాల ఫుటేజ్‌ను పరిశీలించగా.. అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఓ స్కూటీ పోలీసుల దృష్టికి వచ్చింది. స్కూటీ నంబర్ ప్లేట్ లేకపోవడంతో దర్యాప్తు మరింత కీలకంగా మారింది. పోలీసులు లయోలా కాలేజీ, మహానాడు, సర్వీస్ రోడ్డు, ఆటోనగర్ తదితర ప్రాంతాల్లోని సీసీ కెమెరాల ఫుటేజ్‌ను వరుసగా పరిశీలించారు. చివరకు స్కూటీ కదలికలను ట్రాక్ చేస్తూ వినోద్ వరకు చేరుకున్నారు.
సీసీ కెమెరాల ఆధారంగా నిందితుడిని గుర్తించిన పోలీసులు శుక్రవారం సాయంత్రం పెనమలూరులోని అతడి నివాసానికి వెళ్లి అదుపులోకి తీసుకున్నారు. వినోద్‌ను విచారించగా చోరీ చేసిన విషయాన్ని అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. అతడి ఇంట్లో మంచం పరుపు కింద దాచిన బంగారు ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వినోద్‌కు గతంలో ఎలాంటి నేర చరిత్ర లేదని పోలీసులు తెలిపారు. కేవలం స్కూటీ ఈఎంఐలు చెల్లించలేక ఆర్థిక ఒత్తిడికి లోనై ఈ చోరీకి పాల్పడినట్లు దర్యాప్తులో తేలిందని వెల్లడించారు. ఫైనాన్స్ కంపెనీ నుంచి వచ్చిన ఒత్తిడి, డబ్బు కోసం చేసిన ప్రయత్నాలు విఫలం కావడం వంటి కారణాలతో చోరీకి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.
చోరీ చేసిన తర్వాత పోలీసులకు చిక్కకుండా తప్పించుకున్నానని వినోద్ భావించాడు. స్కూటీ నంబర్ ప్లేట్ కూడా తొలగించడంతో తనను ఎవరూ గుర్తించలేరని అనుకున్నాడు. కానీ అతడి లెక్క తప్పింది. నంబర్ ప్లేట్ లేకపోయినా.. రోడ్లపై స్కూటీ కదలికలను సీసీ కెమెరాలు రికార్డు చేశాయి. ఒక ప్రాంతంలోని కెమెరా నుంచి మరో ప్రాంతంలోని కెమెరా ఫుటేజ్‌ను అనుసంధానిస్తూ పోలీసులు నిందితుడి ఆచూకీ కనిపెట్టారు. ఈఎంఐ చెల్లించేందుకు దొంగతనానికి దిగిన ఇంజినీరింగ్ యువకుడు.. చివరకు సీసీ కెమెరాల నిఘాకు చిక్కి కటకటాల పాలయ్యాడు.