Headlines

అరెరె ఇంత ఈజీనా.. కల్తీ పాలని ఇంట్లోనే చిటికెలో గుర్తించండి.. | Real vs Fake Milk: How to Check Milk Adulteration at Home, You Need To Know

అరెరె ఇంత ఈజీనా.. కల్తీ పాలని ఇంట్లోనే చిటికెలో గుర్తించండి.. | Real vs Fake Milk: How to Check Milk Adulteration at Home, You Need To Know


మన ఆహారంలో పాలు ప్రధాన భాగం. పిల్లల శారీరక ఎదుగుదల నుంచి పెద్దల ఆరోగ్యం వరకు ప్రతి ఒక్కరూ రోజూ పాలను ఉపయోగిస్తుంటారు. అయితే మార్కెట్లో లభించే పాలు నిజంగా స్వచ్ఛమైనవేనా? పాల వ్యాపారంలో పెరుగుతున్న డిమాండ్‌ను ఆసరాగా చేసుకుని కొందరు అక్రమార్కులు రసాయనాలు కలిపి కల్తీ పాలను మార్కెట్లోకి వదులుతున్నారు. కల్తీ పాలను తాగడం వల్ల స్వల్పకాలికంగా కడుపునొప్పి, జీర్ణ సమస్యలు రావడమే కాకుండా.. సుదీర్ఘకాలంలో కిడ్నీలు, పేగులపై తీవ్ర ప్రభావం పడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. భారత ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ మార్గదర్శకాల ప్రకారం.. ఇంట్లోనే కల్తీ పాలను ఈజీగా గుర్తుపట్టొచ్చు.

ఇంట్లోనే కల్తీని గుర్తించే 4 సులభమైన పరీక్షలు:

నీళ్ల కల్తీని పట్టించే వాటర్ టెస్ట్

ఒక చుక్క పాలను నేలపై లేదా ప్లేట్ మీద వేయండి. పాలు నెమ్మదిగా ప్రవహిస్తూ తెల్లటి గుర్తును వదిలితే అవి స్వచ్ఛమైన పాలు. ఎలాంటి గుర్తు లేకుండా వేగంగా జారిపోతే అందులో నీళ్లు కలిపినట్లు అర్థం.

కెమికల్స్ గుర్తించే డిటర్జెంట్ టెస్ట్

కొద్దిగా పాలు, అంతే పరిమాణంలో నీటిని ఒక సీసాలో పోసి బాగా ఊపండి. పైన దట్టమైన, సబ్బు నురుగులాగా వస్తే అందులో డిటర్జెంట్ లేదా రసాయనాలు కలిపారని తెలుసుకోవచ్చు. నిజమైన పాలల్లో సన్నటి తేలికపాటి పొర మాత్రమే ఏర్పడుతుంది.

చిక్కదనం వెనుక స్టార్చ్ టెస్ట్

పాలల్లో చిక్కదనం పెంచడానికి కొందరు పిండి పదార్థాలు కలుపుతారు. పాల నమూనాకు కొన్ని చుక్కల ఐయోడిన్ ద్రావణాన్ని కలిపినప్పుడు పాలు నీలం రంగులోకి మారితే, అది కల్తీ పాలని గ్రహించాలి.

వండేటప్పుడు జాగ్రత్త

పాలను వేళ్ల మధ్య వేసి రుద్దినప్పుడు సబ్బులాగా జిడ్డుగా అనిపిస్తే అవి నకిలీ పాలు. అలాగే పాలను కాచేటప్పుడు పసుపు రంగులోకి మారినా, వింత వాసన లేదా చేదు రుచి వచ్చినా అవి సింథటిక్ పాలని గుర్తించాలి.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు

గుర్తింపు పొందిన బ్రాండ్లు: FSSAI సర్టిఫికేషన్ ఉన్న ఉత్పత్తులు లేదా నమ్మకమైన డెయిరీల నుంచే పాలను కొనుగోలు చేయడం సురక్షితం.

ప్యాకేజింగ్ వివరాలు: ఎక్కడపడితే అక్కడ లూజ్ పాల కంటే ప్యాకెట్ పాలపై ఉన్న ఎక్స్‌పైరీ డేట్, బ్యాచ్ కోడ్ పరిశీలించి తీసుకోవడం మంచిది.

బాగా కాచడం: పాలను ఉపయోగించే ముందు తగినంత ఉష్ణోగ్రత వద్ద బాగా మరగబెట్టడం వల్ల హానికర బ్యాక్టీరియా నశిస్తుంది.

పాల రూపంలో ఆరోగ్యానికి బదులు అనారోగ్యాన్ని కొనితెచ్చుకోకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరూ ఈ చిన్న చిన్న జాగ్రత్తలు పాటించడం అవసరం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *