సచిన్ టెండూల్కర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఆయన క్రీజులోకి అడుగుపెడితే ప్రత్యర్థి బౌలర్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తాల్సిందే. క్రికెట్ దేవుడిగా ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది అభిమానుల గుండెల్లో కొలువైన సచిన్ మైదానంలో ఎంత అగ్రెసివ్‌గా ఉంటారో, మైదానం బయట అంత కూల్‌గా ఉంటారు. అయితే కొన్ని దశాబ్దాల పాటు ప్రపంచ క్రికెట్‌ను శాసించిన ఈ మాస్టర్ బ్లాస్టర్.. మ్యాచ్ ఆడే ప్రతి రోజూ ఉదయాన్నే ఒక చిన్న రహస్య నియమాన్ని పాటించేవారట. ఆ సీక్రెట్ మరేంటో కాదు.. ఆయన తాగే టీ. మాస్టర్ బ్లాస్టర్ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఒక రీల్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అందులో తన ఆట రోజుల నాటి మార్నింగ్ రూటీన్‌ను అభిమానులతో పంచుకున్నారు.
నా టీ నేనే పెట్టుకోవాలి.. ఎవరూ రాకూడదు
సచిన్ పోస్ట్ చేసిన వీడియోలో.. ఆయన ఎంతో ప్రశాంతంగా కెటిల్లో నీళ్లు మరిగించి, కప్పులో గ్రీన్ టీ బ్యాగ్ వేస్తూ కనిపించారు. టీ తయారు చేసుకుంటూనే, తన కెరీర్ మొదట్లో ఉన్న పాత జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. ‘‘నేను క్రికెట్ ఆడుతున్న రోజుల్లో కూడా ప్రతి ఉదయం నా రూమ్‌లో నా టీ నేనే తయారు చేసుకునేవాడిని. బయటి నుంచి ఎవరైనా వచ్చి సార్.. మీ టీ సిద్ధంగా ఉంది అని ఇవ్వడం నాకు అస్సలు నచ్చదు. నా పనులు నేనే చేసుకోవడం నాకు అలవాటు. అంతెందుకు.. మ్యాచ్ ఉన్న రోజు ఉదయాన్నే నా రూమ్‌లోకి ఎవరూ రావడానికి వీల్లేదు. ఇప్పుడు ఇంట్లో ఉన్నా సరే, నా వస్తువులను నేనే సర్దుకుంటాను. అది నాకు ఎంతో మానసిక ప్రశాంతతను ఇస్తుంది’’ అని సచిన్ తెలిపారు. మైదానంలోకి వెళ్లేముందు ఒత్తిడిని జయించడానికి, మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవడానికి సచిన్‌కు ఈ టైమ్ ఎంతగానో తోడ్పడేదట.
ఫ్యాన్స్ మురిపెంతో కామెంట్లు.. ఇర్ఫాన్ పఠాన్ ముచ్చట
సచిన్ ఎంత సింపుల్‌గా ఉంటారో తెలిపే ఈ వీడియో చూసి అభిమానులు మురిసిపోతున్నారు. సచిన్ సర్ తన టీని తానే తయారు చేసుకుంటారా.. వావ్, ఉదయాన్నే వేడి వేడి టీ తాగడంలో ఉన్న మజానే వేరు అంటూ నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. టీ పట్ల సచిన్ ఉన్న ప్రేమను చూసి మాజీ భారత క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ స్పందిస్తూ.. చాయ్ అంటే ప్రేమ అని సరదాగా వ్యాఖ్యానించారు.
సచిన్ లోని మరో కోణం.. పక్కా ఫుడీ
సచిన్‌కు కేవలం టీ తయారు చేయడమే కాదు.. రకరకాల వంటకాలను ఆస్వాదించడం కూడా చాలా ఇష్టం. ఆయన ఎంత పెద్ద క్రికెటరో అంతకంటే పెద్ద ఫుడీ. దేశవిదేశాలు తిరిగినప్పుడు అక్కడ లభించే వైవిధ్యభరితమైన స్థానిక వంటకాలను రుచి చూస్తూ.. ఆ విశేషాలను ట్రావెల్ రీల్స్ రూపంలో పంచుకుంటూ ఉంటారు. అంతేకాదు ఇటీవల 53వ పడిలోకి అడుగుపెట్టిన ఈ దిగ్గజ క్రికెటర్ వంటగదిలో గరిటె తిప్పి అందరినీ ఆశ్చర్యపరిచారు. మహారాష్ట్ర ప్రత్యేక వంటకమైన ఉకడిచే మోదక్‌ను ఇంట్లోనే సొంతంగా తయారుచేసి ఓ వీడియో షేర్ చేశారు. పిండి పిసకడం నుంచి కూర నింపి, పర్ఫెక్ట్ ఆకారాన్ని తీసుకురావడం వరకు సచిన్ వంట చేసిన తీరు చూసి నెటిజన్లు ఫిదా అయ్యారు. అంతేకాదు తను ఎంతో ప్రేమగా తయారు చేసిన ఆ మోదకాలను తన తల్లికి రుచి చూపించి ఆశీర్వాదం తీసుకున్నారు.