Headlines

Andhra: చెవిటి, మూగ తండ్రి కలను నిజం చేసిన కొడుకు.. ఏఐ ఇంజినీర్‌గా రూ.1.06 కోట్ల ప్యాకేజీ! | Andhra tailor son gets Rs 1.06 Crore Package AI Engineer Job

Andhra: చెవిటి, మూగ తండ్రి కలను నిజం చేసిన కొడుకు.. ఏఐ ఇంజినీర్‌గా రూ.1.06 కోట్ల ప్యాకేజీ! | Andhra tailor son gets Rs 1.06 Crore Package AI Engineer Job


కష్టపడే తల్లిదండ్రుల చెమట చుక్కలు.. కొడుకు విజయంలో కోట్ల విలువైన ఫలితంగా మారాయి. చెవిటి, మూగ అయిన తండ్రి టైలరింగ్ చేస్తూ కుటుంబాన్ని నెట్టుకొచ్చాడు. తల్లి కూడా అదే వృత్తిలో భర్తకు తోడుగా నిలిచింది. ఆ దంపతుల త్యాగాలకు ప్రతిఫలంగా కుమారుడు ఇప్పుడు ఏకంగా ఏడాదికి రూ.1.06 కోట్ల వేతనంతో ఏఐ ఇంజినీర్‌గా ఉద్యోగం సాధించి అందరికీ స్ఫూర్తిగా నిలిచాడు.

కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలోని కొత్తపల్లి మండలం కుతుకుడుమిల్లి గ్రామానికి చెందిన మాల్తి గంగాధరరావు – మాల్తి దంపతుల కుమారుడు అఖిలేశ్ ఈ అరుదైన ఘనత సాధించాడు. చెవిటి, మూగ అయిన గంగాధరరావు టైలరింగ్ వృత్తినే జీవనాధారంగా చేసుకుని ఇద్దరు పిల్లలను చదివించగా, తల్లి కూడా వస్త్రాలకు చేతిపనులు చేస్తూ కుటుంబానికి అండగా నిలిచింది.

అఖిలేశ్ కొత్తపల్లిలో పదో తరగతి వరకు చదివి, అనంతరం ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ పూర్తి చేశాడు. తర్వాత సూరంపాలెంలోని ఆదిత్య యూనివర్సిటీలో డేటా సైన్స్‌లో ఇంజినీరింగ్ పూర్తి చేశాడు. విద్యార్థి దశ నుంచే సాంకేతిక నైపుణ్యాలను మెరుగుపరుచుకున్న అఖిలేశ్, ఇటీవల నిర్వహించిన క్యాంపస్ ప్లేస్‌మెంట్‌లో ప్రతిభ చాటుకుని కెనడాకు చెందిన క్వాంట్రైస్ టెక్ ఏఐ సంస్థ నుంచి ఏడాదికి రూ.1.06 కోట్ల (CTC) వేతనంతో ఆఫర్ లెటర్ అందుకున్నాడు.

విశేషం ఏమిటంటే, అఖిలేశ్ ఇప్పటికే సంస్థలో విధుల్లో చేరాడు. ఈ ఉద్యోగం పూర్తిగా వర్క్ ఫ్రం హోమ్ విధానంలో కొనసాగుతోంది. సాధారణ కుటుంబం నుంచి ప్రపంచ స్థాయి సంస్థలో ఏఐ ఇంజినీర్‌గా అడుగుపెట్టడం ఇప్పుడు పలువురికి స్ఫూర్తిదాయకంగా మారింది.

అఖిలేశ్ ఒక్కరే కాదు.. అదే యూనివర్సిటీకి చెందిన రాజేష్ అనే మరో విద్యార్థి కూడా ఏడాదికి రూ.1.06 కోట్ల వేతనంతో ఉద్యోగం సాధించాడు. విద్యార్థులను అంతర్జాతీయ స్థాయి అవకాశాలకు సిద్ధం చేయడంలో భాగంగా మొదటి సంవత్సరం నుంచే ప్రత్యేక ప్లేస్‌మెంట్ శిక్షణ, కమ్యూనికేషన్ స్కిల్స్, టెక్నికల్ ట్రైనింగ్ నిర్వహిస్తున్నామని ఆదిత్య యూనివర్సిటీ వెల్లడించింది.

సాధారణ కుటుంబ నేపథ్యం విజయానికి అడ్డంకి కాదని, పట్టుదల, తల్లిదండ్రుల త్యాగం, సరైన మార్గదర్శకత్వం ఉంటే ప్రపంచ స్థాయి అవకాశాలను అందుకోవచ్చని అఖిలేశ్ విజయం మరోసారి నిరూపించింది. ప్రస్తుతం ఆయన సాధించిన ఈ ఘనతపై కుటుంబ సభ్యులు, గ్రామస్తులు, అధ్యాపకులు, విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలియజేస్తున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *