Headlines

CWG 2026 : ఒకనాడు షూ కొనేందుకే డబ్బుల్లేవు.. నేడు దేశం గర్వించేలా వరుసగా రెండో మెడల్ | CWG 2026 Weightlifter Bindyarani Devi Wins Bronze Medal in Womens 58kg Category

CWG 2026 : ఒకనాడు షూ కొనేందుకే డబ్బుల్లేవు.. నేడు దేశం గర్వించేలా వరుసగా రెండో మెడల్ | CWG 2026 Weightlifter Bindyarani Devi Wins Bronze Medal in Womens 58kg Category


CWG 2026 : కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత క్రీడాకారులు తమ పతకాల వేటను కొనసాగిస్తున్నారు. స్కాట్లాండ్‌లోని గ్లాస్గో వేదికగా జరుగుతున్న ఈ అంతర్జాతీయ క్రీడోత్సవాల్లో భారత స్టార్ వెయిట్‌లిఫ్టర్ బిందియారాణి దేవి సరికొత్త అధ్యాయాన్ని లిఖించింది. మహిళల 58 కేజీల విభాగంలో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన ఆమె దేశానికి కాంస్య (బ్రాంజ్) పతకాన్ని అందించింది. కామన్వెల్త్ గేమ్స్ చరిత్రలో బిందియారాణి దేవికి ఇది వరుసగా రెండో మెడల్ కావడం విశేషం. గతంలో జరిగిన గేమ్స్‌లో ఆమె రజత పతకం (సిల్వర్) సాధించగా, ఈసారి కాంస్యంతో మెరిసింది. ఈ విజయంతో కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత్ సాధించిన మొత్తం పతకాల సంఖ్య ఆరుకు చేరింది.

గ్లాస్గో వేదికగా జరిగిన ఈ పోటీల్లో మణిపూర్ రాష్ట్రానికి చెందిన 27 ఏళ్ల బిందియారాణి దేవి మొత్తం 199 కిలోల బరువును ఎత్తి మూడో స్థానంలో నిలిచింది. స్నాచ్ రౌండ్‌లో మొదటి ప్రయత్నంలో 83 కిలోలు, రెండో ప్రయత్నంలో 85 కిలోలు ఎత్తిన ఆమె, మూడో ప్రయత్నంలో ఏకంగా 87 కిలోల బరువును విజయవంతంగా ఎత్తింది. ఆ తర్వాత జరిగిన క్లీన్ అండ్ జెర్క్ రౌండ్‌లో మొదటిసారి 110 కిలోలు ఎత్తడంలో విఫలమైనప్పటికీ, ఏమాత్రం అధైర్యపడకుండా రెండో ప్రయత్నంలో 112 కిలోల బరువును ఎత్తి కాంస్య పతకాన్ని ఖాయం చేసుకుంది. ఈ కేటగిరీలో నైజీరియాకు చెందిన ఆర్‌ఎఫ్ లవాల్ 229 కిలోల కొత్త గేమ్స్ రికార్డుతో స్వర్ణ పతకం సాధించగా, కెనడాకు చెందిన తెశ్చేరో రజత పతకాన్ని దక్కించుకుంది.

1999లో జన్మించిన బిందియారాణి దేవి, ఒలింపిక్ మెడలిస్ట్ మీరాబాయి చానూ శిక్షణ పొందిన మణిపూర్ స్పోర్ట్స్ అకాడమీ నుంచే వెలుగులోకి వచ్చింది. అంతర్జాతీయ వేదికపై ఆమెకు 2021 డిసెంబర్‌లో జరిగిన వరల్డ్ ఛాంపియన్‌షిప్‌తో గుర్తింపు లభించింది. ఆ పోటీల్లో 55 కేజీల క్లీన్ అండ్ జెర్క్ విభాగంలో టోక్యో ఒలింపిక్ ఛాంపియన్‌నే ఓడించి గోల్డ్ మెడల్ సాధించి ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. తన క్రీడా ప్రయాణంలో మీరాబాయి చానూను బిందియారాణి తన రోల్ మోడల్‌గా భావిస్తుంది. జాతీయ క్యాంప్‌లో చేరిన కొత్త రోజుల్లో ట్రైనింగ్ మెళకువలు నేర్పించడం నుంచి మానసికంగా ధైర్యాన్ని ఇవ్వడం వరకు మీరాబాయి తనకు ఎంతగానో అండగా నిలిచారని బిందియారాణి అనేక సందర్భాల్లో గుర్తుచేసుకుంది.

బిందియారాణి సాధించిన ఈ విజయం వెనుక ఎన్నో కష్టాలు, ఆవేదనలు ఉన్నాయి. వెయిట్‌లిఫ్టింగ్ కెరీర్ ప్రారంభంలో ప్రొఫెషనల్ లిఫ్టింగ్ షూస్ కొనుగోలు చేయడానికి కూడా ఆమె వద్ద తగినంత డబ్బు ఉండేది కాదు. ఈ విషయాన్ని గమనించిన మీరాబాయి చానూ, బిందియారాణికి స్వయంగా కొత్త షూస్ కొని బహుమతిగా ఇచ్చారు. ఆ రోజు మీరాబాయి అందించిన ప్రోత్సాహం, మార్గదర్శకత్వమే తన కెరీర్‌ను సరైన దిశలో నిలబెట్టిందని బిందియారాణి సంతోషంగా తెలుపుతుంది. పేదరికాన్ని జయించి, కష్టాలను ఎదుర్కొని నిలబడిన ఈ మణిపూర్ కెరటం ఇవాళ దేశం గర్వపడేలా వరుసగా రెండో కామన్వెల్త్ పతకాన్ని కైవసం చేసుకుంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *