Headlines

Vaibhav Sooryavanshi : పాంటింగ్ కూడా ఆ బాల్స్‌కి అవుట్ కాలేదా ? వైభవ్‎ని విమర్శించే వాళ్లకు అశ్విన్ స్ట్రాంగ్ కౌంటర్ | Ashwin Backs Vaibhav Sooryavanshi Stop Judging 15 Year Old Wonderkid Too Soon

Vaibhav Sooryavanshi : పాంటింగ్ కూడా ఆ బాల్స్‌కి అవుట్ కాలేదా ? వైభవ్‎ని విమర్శించే వాళ్లకు అశ్విన్ స్ట్రాంగ్ కౌంటర్ | Ashwin Backs Vaibhav Sooryavanshi Stop Judging 15 Year Old Wonderkid Too Soon


Vaibhav Sooryavanshi : భారత యువ క్రికెట్ సంచలనం 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ ఇంగ్లాండ్ టూర్‌లో టి20 అరంగేట్రం చేసినప్పుడు ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. ప్రారంభంలో ఆడిన మూడు మ్యాచుల్లోనూ తక్కువ పరుగులకే అవుటయ్యాడు. ముఖ్యంగా ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ తన షార్ట్ బాల్స్‌తో వైభవ్‌ను రెండుసార్లు పెవిలియన్‌కు పంపడంతో, అతను షార్ట్ బాల్స్‌ ఆడటంలో తీవ్రంగా ఇబ్బందిపడుతున్నాడని పలువురు విమర్శలు గుప్పించారు. అయితే ఈ విమర్శలపై భారత మాజీ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ స్పందించాడు. అంత తక్కువ మ్యాచ్‌ల అనుభవాన్ని బట్టి ఒక ఆటగాడి సామర్థ్యాన్ని అంచనా వేయడం, జడ్జ్ చేయడం చాలా తొందరపాటు చర్య అవుతుందని విమర్శకులకు గట్టి కౌంటర్ ఇచ్చాడు.

రికీ పాంటింగ్ ఉదాహరణతో క్లాస్ పీకిన అశ్విన్

తన యూట్యూబ్ ఛానెల్‌లోని యాష్ కీ బాత్ ప్రోగ్రామ్‌లో అశ్విన్ మాట్లాడుతూ వైభవ్‌పై అనవసరంగా ఒత్తిడి పెంచుతున్నారని అభిప్రాయపడ్డాడు. “ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం రికీ పాంటింగ్ తన అద్భుతమైన కెరీర్‌లో షార్ట్ బాల్స్‌కు అవుట్ అవ్వలేదా? ప్రతి బ్యాటర్‌కు బలాలతో పాటు బలహీనతలు ఉంటాయి. ప్రపంచ స్థాయి ఫాస్ట్ బౌలర్ల బౌలింగ్‌ను ఎలా ఎదుర్కొవాలో వైభవ్ ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాడు. జోఫ్రా ఆర్చర్‌లాంటి క్వాలిటీ బౌలర్‌ను ఇంగ్లాండ్ పరిస్థితుల్లో ఎప్పుడైనా ఎదుర్కొన్నాడా? అవన్నీ అతనికి అనుభవాలు మాత్రమే. 15 ఏళ్ల కుర్రాడి నుంచి ప్రతి మ్యాచ్‌లోనూ భారీ ఇన్నింగ్స్‌లు ఆశించడం, మ్యాచ్ మ్యాచ్‌కూ అతన్ని జడ్జ్ చేయడం సరైన పద్ధతి కాదు. విమర్శలకు బెదిరి అతని స్టైల్ మార్చుకోవాల్సిన అవసరం లేదు” అని అశ్విన్ వివరించాడు.

జింబాబ్వే టూర్‌లో సూర్యవంశీ రీ-ఎంట్రీ

ఇంగ్లాండ్‌లో నిరాశపరిచినప్పటికీ, ఆ తర్వాత జరిగిన జింబాబ్వే సిరీస్‌లో వైభవ్ అద్భుతంగా రీ-ఎంట్రీ ఇచ్చాడు. స్పిన్ బౌలింగ్‌కు అనుకూలిస్తున్న నెమ్మదైన పిచ్‌లపై కూడా ఎంతో పరిణతితో బ్యాటింగ్ చేశాడు. 3 మ్యాచ్‌లలో 151 పరుగులు సాధించి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డును దక్కించుకున్నాడు. ఈ ప్రదర్శనపై అశ్విన్ స్పందిస్తూ.. “వికెట్ స్లోగా ఉన్నప్పుడు, బంతి స్పిన్ అవుతున్నప్పుడు వైభవ్ క్రీజులో ముందుకు వచ్చి స్పిన్నర్లను ఎదుర్కొన్న తీరు ప్రశంసనీయం. అంత చిన్న వయసులో క్రీజును వాడుకుంటూ క్రమశిక్షణతో ఆడటం గొప్ప విషయం. అతనిలో నేర్చుకునే తత్వం చాలా ఎక్కువ” అని కొనియాడాడు.

మున్ముందు అద్భుతాలు సృష్టిస్తాడు

వైభవ్ సూర్యవంశీ భవిష్యత్తులో అసాధారణమైన క్రికెటర్‌గా ఎదుగుతాడని అశ్విన్ ధీమా వ్యక్తం చేశాడు. “క్రికెట్ కెరీర్‌లో అలాగే జీవితంలోనూ హెచ్చుతగ్గులు సహజం. ఐపీఎల్‌లో కూడా నేను తన ఆటను సమీక్షించినప్పుడు చెప్పాను.. 15-16 ఏళ్ల వయసులో ఒక ఆటగాడి ఇంప్రూవ్‌మెంట్ గ్రాఫ్ ఈ స్థాయిలో పెరగడం నేను ఇంతవరకు చూడలేదు. పరిస్థితులకు తగ్గట్లు తన ఆటను మార్చుకునే గొప్ప టాలెంట్ అతనిలో ఉంది. అతనికి కాస్త సమయం ఇస్తే క్రికెట్‌లో అద్భుతాలు సృష్టిస్తాడు” అని అశ్విన్ పేర్కొన్నాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *