Headlines

ఇక సర్కార్‌ బడి పిల్లలకు పండగే.. మధ్యాహ్న భోజనంలో ‘చికెన్‌ బిర్యానీ’..? | Tamil Nadu Mulls Adding Chicken Biryani to Government School Mid Day Meals

ఇక సర్కార్‌ బడి పిల్లలకు పండగే.. మధ్యాహ్న భోజనంలో ‘చికెన్‌ బిర్యానీ’..? | Tamil Nadu Mulls Adding Chicken Biryani to Government School Mid Day Meals


చెన్నై, జులై 29: ప్రభుత్వ స్కూళ్లలో చదువుతున్న విద్యార్థుల సంక్షేమానికి సంబంధించిన పలు డిమాండ్లతో పాటు, పోషకాహార భోజనంలో వారానికి ఒక్కసారైనా చికెన్ బిర్యానీని అందించాలని ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు తమిళనాడు రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ మంత్రి రాజ్‌మోహన్ కి విజ్ఞప్తి చేశారు. ఈ ప్రతిపాదనపై స్పందించిన మంత్రి రాజ్‌మోహన్, ముఖ్యమంత్రితో చర్చించి సాధ్యాసాధ్యాలను అన్ని కోణాల్లో పరిశీలించిన అనంతరం తగిన నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.  చికెన్ బిర్యానీ ప్రతిపాదనపై సామాజిక సంక్షేమ, మహిళా సాధికారత శాఖతో చర్చించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. విద్యార్థులకు ప్రోటీన్‌ సమృద్ధిగా లభించే ఆహారం అందించడం, ప్రభుత్వ పాఠశాలల్లో హాజరు శాతాన్ని పెంచడం, డ్రాపవుట్లను తగ్గించడం ఈ ప్రతిపాదన ప్రధాన లక్ష్యంగా పేర్కొంది. ప్రస్తుతం తమిళనాడులో 1 నుంచి 10వ తరగతి వరకు సుమారు 40 లక్షల మంది విద్యార్థులు మధ్యాహ్న భోజన పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారు. అలాగే ముఖ్యమంత్రి అల్పాహార పథకం ద్వారా 1 నుంచి 8వ తరగతి వరకు 32 లక్షల మంది విద్యార్థులకు ఉదయం అల్పాహారం అందుతోంది.

ఈ రెండు పథకాలను 11, 12 తరగతుల విద్యార్థులకు కూడా విస్తరించే ప్రతిపాదన ప్రభుత్వ పరిశీలనలో ఉంది. ఇది అమల్లోకి వస్తే మరో 8 లక్షల మంది విద్యార్థులు లబ్ధి పొందే అవకాశం ఉంది. హయ్యర్ సెకండరీ విద్యార్థులకు కూడా పౌష్టికాహారం అందించడం ద్వారా వారి ఆరోగ్యం మెరుగుపడటంతో పాటు, హాజరు శాతం పెరిగి డ్రాప్‌ఔట్ల సంఖ్య తగ్గే అవకాశముందని విద్యారంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ ప్రతిపాదన అమలైతే, దేశంలో పోషకాహార పథకాల అమలులో ఇప్పటికే ఆదర్శంగా నిలిచిన తమిళనాడు మరో వినూత్న నిర్ణయంతో ముందంజలో నిలిచే అవకాశముందని విద్యా వర్గాలు భావిస్తున్నాయి.

పార్ట్‌టైం టీచర్లకు శాశ్వత ఉద్యోగాలు..

అలాగే పార్ట్‌టైమ్ ఉపాధ్యాయులను శాశ్వత ఉద్యోగులుగా నియమించడం, ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TET)లో అర్హత మార్కులను తగ్గించడం, సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయుల వేతనాలను సవరించడం, పాత వేతన విధానాన్ని పునరుద్ధరించడం వంటి డిమాండ్లను కూడా సంఘాల ప్రతినిధులు మంత్రికి సమర్పించారు. సంఘాల నుంచి అందిన వినతిపత్రాలన్నింటినీ ప్రత్యేక సాఫ్ట్‌వేర్ ద్వారా డిజిటలైజ్ చేసి, వాటిని వర్గీకరించి, తీసుకున్న చర్యలపై సంబంధిత సంఘాలకు సమాచారం అందిస్తామని మంత్రి తెలిపారు. ప్రస్తుతం తమిళనాడులో శారీరక విద్య, పెయింటింగ్, కంప్యూటర్ సైన్స్, టైలరింగ్ వంటి విభాగాల్లో 11,773 మంది పార్ట్‌టైమ్ ఉపాధ్యాయులు విధులు నిర్వహిస్తున్నారు. వీరిని శాశ్వతం చేయాలని అసోసియేషన్ అధ్యక్షుడు సెంథిల్ కుమార్ ప్రభుత్వాన్ని కోరారు. ఈ ప్రతిపాదన కూడా ప్రభుత్వ పరిశీలనలో ఉందని అధికారులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *