Headlines

PM Modi: పశ్చిమాసియాలో భీకర యుద్ధం.. CCSతో ప్రధాని మోదీ అత్యవసర భేటీ.. కీలక సూచనలు.. | PM Modi Chairs Emergency CCS Meeting on West Asia Conflict, Reviews Fuel, Fertiliser and Security Preparedness

PM Modi: పశ్చిమాసియాలో భీకర యుద్ధం.. CCSతో ప్రధాని మోదీ అత్యవసర భేటీ.. కీలక సూచనలు.. | PM Modi Chairs Emergency CCS Meeting on West Asia Conflict, Reviews Fuel, Fertiliser and Security Preparedness


మిడిలీస్ట్‌లో అమెరికా-ఇరాన్‌ మధ్య ఉద్రిక్తతలు మరింత ముదురుతున్నాయి. ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు చేస్తోంది.. దీంతో పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.. మధ్యప్రాచ్యం ప్రాంతంలో క్రమంగా పెరుగుతున్న యుద్ద ఉద్రిక్తతలు, రాబోయే సవాళ్లపై భారత ప్రభుత్వం అత్యున్నత స్థాయిలో స్పందించింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన గురువారం న్యూఢిల్లీలో కేబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ (CCS) ప్రత్యేక సమావేశం జరిగింది. పశ్చిమాసియా పరిణామాలపై ప్రధాని నిర్వహించిన నాల్గో సమీక్షా సమావేశం ఇది. ఈ భేటీలో పశ్చిమాసియా సంక్షోభం వల్ల భారత్‌పై పడే ఆర్థిక, భద్రతా ప్రభావాలను అంచనా వేయడంతో పాటు, దేశీయంగా నిత్యావసరాల కొరత రాకుండా ప్రభుత్వం తీసుకుంటున్న ముందస్తు చర్యలను సమగ్రంగా సమీక్షించారు.

సమావేశం ప్రారంభంలో ప్రస్తుత భౌగోళిక-రాజకీయ పరిస్థితులను కేబినెట్ కార్యదర్శి ప్రధానికి నివేదించారు. దేశంలో ఇంధన భద్రతకు సంబంధించి ఎలాంటి లోటు లేదని, పెట్రోల్, డీజిల్‌తో పాటు ఎల్పీజీ, ఎల్‌ఎన్‌జీ నిల్వలు సమృద్ధిగా అందుబాటులో ఉన్నాయని ఆయన వివరించారు. దేశీయ రిఫైనరీలు 100 శాతానికి పైగా సామర్థ్యంతో పనిచేస్తున్నాయని, ఎల్పీజీ దిగుమతి మూలాలను ఇప్పటికే వైవిధ్యభరితం చేయడం వల్ల గ్యాస్ కొరత వచ్చే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. పైప్‌లైన్ గ్యాస్ నెట్‌వర్క్, నేషనల్ గ్యాస్ గ్రిడ్ విస్తరణ వేగవంతం కావడం వల్ల పారిశ్రామిక, గృహ అవసరాలకు ఇంధన సరఫరా నిరంతరాయంగా సాగుతోందని వెల్లడించారు.

ఇదే సమయంలో రాబోయే రబీ వ్యవసాయ సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని ఎరువుల లభ్యతపై ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేక శ్రద్ధ వహించారు. పశ్చిమాసియాలోని ఉద్రిక్తతల వల్ల ఎరువుల దిగుమతికి ఆటంకం కలగకుండా ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలని, రైతాంగానికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఎరువుల కొరత రాకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. విదేశీ ఇంధనాలపై ఆధారపడటాన్ని తగ్గించుకునేందుకు సౌరశక్తి సహా ఇతర పునరుత్పాదక ఇంధన వనరుల వినియోగాన్ని మరింత విస్తృతం చేయాలని ఈ సందర్భంగా ప్రధాని పునరుద్ఘాటించారు.

మరోవైపు యుద్ధ ప్రభావిత ప్రాంతాల్లోని నౌకల్లో విధులు నిర్వర్తిస్తున్న భారతీయ నావికులు, విదేశీ నౌకలపై పనిచేస్తున్న భారతీయుల రక్షణపై ప్రధాని తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. నావికులకు మరియు వారి కుటుంబ సభ్యులకు తక్షణ సమాచారం, అత్యవసర సాయం, కౌన్సెలింగ్ అందించేందుకు ఒక ప్రత్యేక సహాయక వ్యవస్థను ఏర్పాటు చేయాలని సూచించారు. పశ్చిమాసియాలో నివసిస్తున్న భారతీయ పౌరులు, ఎన్‌ఆర్‌ఐల భద్రతే తమ మొదటి ప్రాధాన్యమని పేర్కొన్న ప్రధాని, ఈ సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు ప్రభుత్వ శాఖలన్నీ సమన్వయంతో, ఏకీకృత పర్యవేక్షణ వ్యవస్థ ద్వారా పనిచేయాలని దిశానిర్దేశం చేశారు.

పశ్చిమాసియా యుద్ధంలో.. అకారణంగా భారతీయులు ప్రాణాలు కోల్పోతున్నారు. దాడుల్లో ఇప్పటి వరకు 16 మంది మృతిచెందగా, 75 మంది గాయపడినట్టు రాజ్యసభలో కేంద్ర ప్రభుత్వం అధికారికంగా వెల్లడించింది. చనిపోయిన వారిలో నావికులతో పాటు పౌరులు ఉన్నట్టు తెలిపింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *