Headlines

Telangana: తెలంగాణలో కొత్త పింఛన్లపై ప్రభుత్వం కీలక అప్డేట్.. ఆ రోజు నుంచే పంపిణీ.. గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది.. | Telangana CM Revanth Reddy Announces New Pension Rollout from August 15

Telangana: తెలంగాణలో కొత్త పింఛన్లపై ప్రభుత్వం కీలక అప్డేట్.. ఆ రోజు నుంచే పంపిణీ.. గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది.. | Telangana CM Revanth Reddy Announces New Pension Rollout from August 15


తెలంగాణలో కొత్త పింఛన్ల కోసం ఎదురుచూస్తున్నవారికి గుడ్ న్యూస్. సీఎం రేవంత్ రెడ్డి భారీ శుభవార్త అందించారు. కొత్త పింఛన్ల పంపిణీపై కీలక ప్రకటన జారీ చేశారు. ఆగస్ట్ 15వ తేదీ నుంచి కొత్త పింఛన్లను మంజూరు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అలాగే తలసేమియా, సికిల్ సెల్ ఎనిమియా బాధితులకు కూడా పింఛన్లను అందించాలని సూచించారు. ఈ మేరకు వెంటనే అర్హులను గుర్తించి లబ్దిదారుల జాబితాలో చేర్చాలని ఆదేశించారు. ఆగస్ట్ 15 నుంచి వీరికి పింఛన్లను అందించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇప్పటివరకు కొత్త పింఛన్లను మంజూరు చేయలేదు. దీంతో కొత్త పించన్లు ఎప్పుడెప్పుడు వస్తాయా అని అర్హులైనవారు ఎదురుచూస్తున్నారు. త్వరలోనే కొత్త పింఛన్లను పంపిణీ చేస్తామని గత కొద్ది నెలలుగా ప్రభుత్వం నుంచి ప్రకటనలు వస్తుండగా.. ఇప్పుడు ఎట్టకేలకు రేవంత్ రెడ్డి ఆదేశాలతో లైన్ క్లియర్ అయింది. వితంతువులు, ఒంటరి మహిళలు, నేత, గీత కార్మికుల్లో అర్హులైన వారందరికీ పింఛన్లను పంపిణీ చేయాలని రేవంత్ ఆదేశించారు. అర్హులైన ప్రతీఒక్కరికీ తప్పనిసరిగా ఇవి అందాలన్నారు. దివ్యాంగులు మరణిస్తే వారి జీవిత భాగస్వామికి పించన్ అందించాలని, పించన్ల మంజూరులో ఎలాంటి జాప్యం జరగకూడదని అధికారులకు సూచించారు. ఇక ప్రతీ గ్రామానికి పంచాయతీ భవనం, తారు రోడ్డు ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఇక జనాభా పరంగా ఏ,బీ,సీ వర్గాలుగా విభజించి పంచాయతీ భవనాలు నిర్మించాలన్నారు.

ప్రతీ 45 రోజులకు ఒకసారి మండల ప్రజా పరిషత్ సమావేశాలు నిర్వహించాలని సీఎం రేవంత్ ఆదేశించారు. ఈ సమావేశాలకు ఎంపీలు, ఎమ్మెల్యేలను కూడా ఆహ్వానించాలని సూచించారు. ఈ సమావేశాల్లో సర్పంచులు తమ గ్రామ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. రాష్ట్రంలో ఎల్‌నివో ప్రభావం ఉన్న గ్రామాల్లో తాగునీటి సరఫరాకు తొలి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ప్రతీ నెలలో ఐదో తేదీలోపు గ్రామీణ నీటి పథకాల పరిధిలో పనిచేసే ఉద్యోగులకు వేతనాలు చెల్లించాలని ఆదేశించారు. ఎంపీడీవోలు మండల స్థాయిలో జరుగుతున్న అభివృద్ది పనులను పర్యవేక్షించాలని సూచించారు. రాష్ట్రంలో కూరగాయలు, ఆరుతడి పంటల సాగును ప్రోత్సహించాలన్నారు. సబ్సిడీపై రైతులకు ఇప్పటికే విత్తనాలు అందిస్తున్నామని, అలాగే రైతుల పంటను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని రేవంత్ తెలిపారు. కాగా పింఛన్లను నేరుగా లబ్దిదారుల బ్యాంక్ అకౌంట్లలో జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. గతంలో పోస్టాఫీసుల ద్వారా అందించేవారు. కానీ ఇప్పుడు నేరుగా లబ్దిదారుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేయాలని ఇటీవల ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *