Headlines

4 రోజుల పసికందును రూ.5 లక్షలకు అమ్మే యత్నం.. హైదరాబాద్‌ పాతబస్తీలో కలకలం | 4 Day Old Baby Rescued From Illegal Sale in Hyderabad: Woman Arrested in Shocking Child Trafficking Case

4 రోజుల పసికందును రూ.5 లక్షలకు అమ్మే యత్నం.. హైదరాబాద్‌ పాతబస్తీలో కలకలం | 4 Day Old Baby Rescued From Illegal Sale in Hyderabad: Woman Arrested in Shocking Child Trafficking Case


హైదరాబాద్ పాతబస్తీలో హృదయ విదారక ఘటన వెలుగులోకి వచ్చింది. తల్లి ఒడిలో హాయిగా ఉండాల్సిన కేవలం నాలుగు రోజుల ఆడ శిశువును రూ.5 లక్షలకు విక్రయించేందుకు ప్రయత్నించిన ఘటన నగరంలో సంచలనం రేపింది. బాలాపూర్ పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి చిన్నారిని సురక్షితంగా రక్షించడంతో పాటు ప్రధాన నిందితురాలిని అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చాంద్రాయణగుట్టకు చెందిన వహీదా ఖాతూన్ అనే మహిళ బర్కాస్‌లోని పీలీ దర్గా ప్రాంతానికి చెందిన మెహరున్నిసాకు నాలుగు రోజుల ఆడ శిశువును విక్రయించేందుకు ప్రయత్నించింది. తొలుత రూ.6 లక్షలు డిమాండ్ చేసిన నిందితురాలు, చివరకు రూ.5 లక్షలకు ఒప్పుకున్నట్లు విచారణలో వెల్లడైంది.

ఈ లావాదేవీని మొదట షాహీన్‌నగర్‌లో నిర్వహించాలని భావించిన నిందితులు, అనంతరం పహాడీషరీఫ్‌లోని జీజీఆర్ ఫంక్షన్ హాల్ సమీపంలో డబ్బు ఇచ్చిపుచ్చుకోవాలని నిర్ణయించారు. ఈ సమాచారం అందుకున్న ఓ సామాజిక కార్యకర్త వెంటనే బాలాపూర్ పోలీసులను అప్రమత్తం చేశారు. ఆమె సహకారంతో పోలీసులు ఉచ్చు పన్ని, లావాదేవీ జరగబోతున్న సమయంలో దాడి చేసి పసికందును సురక్షితంగా రక్షించారు. ఘటన స్థలంలోనే వహీదా ఖాతూన్‌ను అదుపులోకి తీసుకున్నారు. దర్యాప్తులో గోల్కొండకు చెందిన ఓ మహిళ మంగళవారం మలక్‌పేట్‌లోని ఆసుపత్రిలో ఆడ శిశువుకు జన్మనిచ్చి, అదే రోజు డిశ్చార్జ్ అయినట్లు పోలీసులు గుర్తించారు. అయితే ఆ నవజాత శిశువు నిందితురాలి వద్దకు ఎలా చేరింది? శిశువు తల్లి పాత్ర ఏమిటి? ఈ వ్యవహారంలో మరెవరైనా ఉన్నారా? అనే అంశాలపై అధికారులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.

అంతేకాకుండా, ఈ ఘటన వెనుక శిశువుల అక్రమ రవాణా ముఠా ఉందా అనే కోణంలో కూడా పోలీసులు విచారణ చేపట్టారు. చిన్నారి ప్రస్తుతం సురక్షితంగా ఉండేలా సంరక్షణ చర్యలు తీసుకుంటున్నారు. నాలుగు రోజుల పసికందును డబ్బు కోసం విక్రయించేందుకు ప్రయత్నించడం నగర ప్రజలను తీవ్రంగా కలిచివేసింది. చిన్నారిని కాపాడిన బాలాపూర్ పోలీసులను, కీలక సమాచారం అందించిన సామాజిక కార్యకర్తను స్థానికులు అభినందిస్తున్నారు. కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు వెలుగులోకి రావాల్సి ఉంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *