Headlines

PM Modi: 43 ఏళ్ల తర్వాత విజయనగరంలో ప్రధాని పర్యటన.. భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభించనున్న మోదీ.. షెడ్యూల్ ఇదే.. | PM Modi to Inaugrate Bhogapuram International Airport Today, Check Full Schedule

PM Modi: 43 ఏళ్ల తర్వాత విజయనగరంలో ప్రధాని పర్యటన.. భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభించనున్న మోదీ.. షెడ్యూల్ ఇదే.. | PM Modi to Inaugrate Bhogapuram International Airport Today, Check Full Schedule


ఉత్తరాంధ్ర ప్రగతి పథంలో సరికొత్త శకం ప్రారంభం కాబోతుంది. విజయనగరం జిల్లా భోగాపురంలో రూ.4,500 కోట్లకు పైగా వ్యయంతో నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేడు జాతికి అంకితం చేయనున్నారు. దాదాపు 43 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ప్రధానమంత్రి విజయనగరం జిల్లాలో పర్యటిస్తుండటంతో ఈ ప్రాంతంలో పండుగ వాతావరణం నెలకొంది. ఉదయం 10:45 గంటలకు ప్రధాని మోదీ ప్రత్యేక విమానంలో భోగాపురం విమానాశ్రయానికి చేరుకుంటారు. విమానాశ్రయంలో ప్రధానికి గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఘనంగా స్వాగతం పలకనున్నారు. ఉదయం 10:50 గంటలకు ప్రధాని టెర్మినల్ భవనానికి చేరుకుంటారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ సంస్కృతి, సాంప్రదాయాలను ప్రతిబింబించేలా కూచిపూడి, ఉత్తరాంధ్ర గిరిజన సాంప్రదాయం అయిన థింసా నృత్య కళాకారులు తమ ప్రదర్శనలతో ప్రధానికి స్వాగతం పలకనున్నారు. నూతనంగా నిర్మించిన విమానాశ్రయం టెర్మినల్, రన్‌వే, ప్రయాణికుల కోసం ఏర్పాటు చేసిన అత్యాధునిక మౌలిక సదుపాయాలను ప్రధాని స్వయంగా పరిశీలిస్తారు.

బహిరంగ సభ, ప్రారంభోత్సవాలు..

టెర్మినల్ పరిశీలన అనంతరం ప్రధాని ఓపెన్ టాప్ వాహనంలో సభా వేదిక వద్దకు చేరుకుంటారు. శిలాఫలకాన్ని ఆవిష్కరించి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధాని మోడీ అధికారికంగా జాతికి అంకితం చేస్తారు. విమానాశ్రయంతో పాటు ప్రాంతీయ అభివృద్ధికి తోడ్పడే పలు కీలక ప్రాజెక్టులను ప్రధాని ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ప్రధాని మోడీ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. మధ్యాహ్నం 1:05 గంటలకు పర్యటన ముగించుకుని ప్రధాని ప్రత్యేక విమానంలో తిరిగి ఢిల్లీకి బయలుదేరి వెళ్తారు.

రైతులకు ప్రత్యేక గౌరవం

విమానాశ్రయం నిర్మాణానికి తమ భూములను, ఇళ్లను త్యాగం చేసిన భూసేకరణ బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక గౌరవాన్ని ఇచ్చింది. ప్రధాని మోదీ ఆశీనులయ్యే సభావేదికకు సరిగ్గా ఎదురుగా వీఐపీ గ్యాలరీలో రైతులు కూర్చునేలా ఏర్పాట్లు చేశారు. భోగాపురం మండలంలోని గూడెపువలస, రావాడ, కంచేరు, కవులువాడ, ఎ.రావివలస, సవరవిల్లి, ముంజేరు గ్రామాల నుంచి
403 మంది రైతులు భూములు ఇవ్వగా, 1,600 మంది తమ ఇళ్లు, మరో 200 మంది పొలం, ఇళ్లు రెండింటిని ఇచ్చారు. ప్రాజెక్ట్ కోసం త్యాగం చేసిన ఈ కుటుంబాలలోని ప్రతీ ఒక్కరికీ జీవితంలో ఒకసారి ఉచితంగా విమాన ప్రయాణం చేసే సౌకర్యాన్ని కల్పించాలని సీఎం చంద్రబాబు నాయుడు సంబంధిత అధికారులకు, జీఎమ్‌ఆర్ యాజమాన్యానికి ప్రత్యేకంగా సూచించారు.

ఉత్తరాంధ్ర రూపురేఖలు మార్చనున్న భోగాపురం

ఈ విమానాశ్రయం అందుబాటులోకి రావడంతో విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల ఆర్థిక పురోగతికి సరికొత్త ఊపు రానుంది. అంతర్జాతీయ స్థాయి కనెక్టివిటీ లభించడమే కాకుండా పర్యాటకం, పరిశ్రమలు, ఐటీ రంగాలు వేగంగా విస్తరించేందుకు ఇది దోహదపడుతుంది. ఉత్తరాంధ్రలో పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు పెరగడానికి భోగాపురం ఎయిర్‌పోర్ట్ ఒక గేమ్‌చేంజర్‌గా మారబోతోందని నిపుణులు భావిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *