Headlines

శివాలయంలో నంది విగ్రహం ఎందుకు ఉంటుంది? నందీశ్వరుని పుట్టుక గురించి మీకు తెలియని రహస్యాలు.. | How Nandi Became Lord Shiva Vahana: The Sacred Birth Story of Nandi and Shiva Connection

శివాలయంలో నంది విగ్రహం ఎందుకు ఉంటుంది? నందీశ్వరుని పుట్టుక గురించి మీకు తెలియని రహస్యాలు.. | How Nandi Became Lord Shiva Vahana: The Sacred Birth Story of Nandi and Shiva Connection


పరమశివుని దర్శనం కోసం శివాలయాలకు వెళ్లే భక్తులకు ముందుగా దర్శనమిచ్చేది నందీశ్వరుడే. శివుడిని పూజించిన అనంతరం భక్తులు నంది చెవిలో తమ మనసులోని కోరికలను పూస గుచ్చినట్లు చెప్పడం తరతరాలుగా వస్తున్న ఆచారం. అసలు నంది ఎలా జన్మించారు? ఆయన శివునికి వాహనంగా ఎలా మారారు? ప్రతి శివాలయంలోనూ నంది విగ్రహాన్ని ఎందుకు ప్రతిష్ఠిస్తారు? అనే ప్రశ్నలకు శివపురాణంలో ఆసక్తికరమైన సమాధానాలు ఉన్నాయని జ్యోతిష్య నిపుణులు పండిత్ కౌశల్ పాండే వివరిస్తున్నారు. పౌరాణిక కథనాల ప్రకారం.. బ్రహ్మచారి అయిన శిలాద మహర్షికి సంతానం కలగాలనే కోరిక కలిగింది. దీనికోసం ఆయన పరమశివుడిని తలచుకుని తీవ్రమైన తపస్సు చేశారు. శివుడు ప్రత్యక్షమై పుత్రసంతానం కలుగుతుందని వరమిచ్చారు. కొన్నాళ్ల తర్వాత శిలాద మహర్షి పొలాన్ని దున్నుతుండగా ఆయనకు ఒక దివ్యమైన బాలుడు లభించాడు. ఆ బాలుడికి ఆయన నంది అని నామకరణం చేసి ఎంతో ప్రేమతో పెంచుకోసాగారు.

అల్పాయుష్షును జయించిన శివభక్తి

నంది పెరుగుతున్న కొద్దీ ఆయన ఆయుష్షు చాలా తక్కువని మునులు శిలాద మహర్షితో చెప్పారు. ఈ విషయం తెలిసిన నంది భయపడకుండా, తన మరణ భయాన్ని పోగొట్టుకోవడానికి సాంబశివుడిని ప్రసన్నం చేసుకునేందుకు కఠోర తపస్సు ప్రారంభించారు. నంది నిశ్చల భక్తికి మెచ్చిన బోళాశంకరుడు ప్రత్యక్షమై.. ‘‘నంది నీవు నా అంశవే. నీకు మరణ భయం ఉండదు’’ అని అభయమిచ్చారు.

శివునికి వాహనంగా, గణనాథుడిగా నందీశ్వరుడు

పరమేశ్వరుడు నందిని వరం కోరుకోమనగా.. ఆయన ఎలాంటి సుఖాలనూ కోరుకోకుండా, జీవితాంతం మహాదేవుని సేవలోనే తరించే భాగ్యాన్ని మాత్రమే ప్రసాదించమని వేడుకున్నారు. నంది అనన్య భక్తికి పరవశించిన శివుడు.. ఆయనను తన అధికారిక వాహనంగా, శివగణాలకు అధిపతిగా నియమించారు. నాటి నుంచి ప్రతి శివాలయంలోనూ శివునికి ఎదురుగా నందీశ్వరుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించడం ఆనవాయితీగా మారింది.

నంది చెవిలో కోరికలు ఎందుకు చెబుతారు?

జ్యోతిష్య నిపుణుల ప్రకారం.. పరమశివుడు నిరంతరం గాఢ ధ్యానంలో ఉంటారు. అటువంటి సమయంలో స్వామివారి ధ్యానానికి భంగం కలిగించకుండా, భక్తులు తమ కోరికలను ఆయన నమ్మిన బంటు అయిన నంది చెవిలో విన్నవిస్తారు. భక్తుల ప్రార్థనలను నందీశ్వరుడు సరైన సమయంలో మహాదేవుని వద్దకు చేరవేస్తాడని నమ్మకం. ముఖ్యంగా శ్రావణ మాసంలో నంది చెవిలో కోరికలు చెప్పడం అత్యంత శుభప్రదమని, కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *