Headlines

CWG 2026 : ల్యాండ్ మైన్ పేలి కాలు పోయినా కాన్ఫిడెన్స్ పోలేదు.. కామన్వెల్త్‌లో భారత్‌కు బంగారు పతకం అందించిన సైనికుడు | CWG 2026 Ex Army Soldier Soman Rana Wins Gold in Men’s Shot Put F57 Event

CWG 2026 : ల్యాండ్ మైన్ పేలి కాలు పోయినా కాన్ఫిడెన్స్ పోలేదు.. కామన్వెల్త్‌లో భారత్‌కు బంగారు పతకం అందించిన సైనికుడు | CWG 2026 Ex Army Soldier Soman Rana Wins Gold in Men’s Shot Put F57 Event


CWG 2026 : గ్లాస్గో వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్ 2026లో శనివారం భారత అథ్లెట్లు సంచలన ప్రదర్శన చేశారు. పురుషుల షాట్‌పుట్ F57 ఫైనల్ పోరులో భారత పారా అథ్లెట్ సోమన్ రాణా అత్యుత్తమ ప్రదర్శనతో స్వర్ణ పతకాన్ని సాధించాడు. ఇదే విభాగంలో భారత్‌కే చెందిన మరొక అథ్లెట్ శుభమ్ జుయాల్ వెండి పతకాన్ని సాధించగా, కామెరూన్‌కు చెందిన సెడ్రిక్ ఇడ్రిస్ కాంస్య పతకంతో సరిపెట్టుకున్నాడు. పురుషుల షాట్‌పుట్ F57 విభాగంలో భారత్‌కు పసిడి పతకం రావడం కామన్వెల్త్ చరిత్రలోనే ఇది తొలిసారి కావడం విశేషం.

హోరాహోరీగా సాగిన షాట్‌పుట్ ఫైనల్ సమరం

మొత్తం 10 మంది అథ్లెట్లు పాల్గొన్న ఈ ఫైనల్ పోరులో ప్రతీ ఒక్కరికి ఆరేసి అవకాశాలు లభించాయి. భారత అథ్లెట్లు అందరికంటే చివర్లో తమ అవకాశాలను ఉపయోగించుకున్నారు. మొదట బరిలోకి దిగిన శుభమ్ జుయాల్ తన అత్యుత్తమ ప్రదర్శనగా 13.28 మీటర్ల దూరం విసిరి మొదటి స్థానంలో నిలిచాడు. కానీ ఆ తర్వాత వచ్చిన సోమన్ రాణా తన రెండవ ప్రయత్నంలోనే ఏకంగా 13.40 మీటర్ల దూరం షాట్‌పుట్‌ను విసిరి శుభమ్‌ను అధిగమించాడు. ఈ అద్భుతమైన త్రోతో సోమన్ రాణా భారత్‌కు మూడవ గోల్డ్ మెడల్‌ను అందించగా, శుభమ్ జుయాల్ సిల్వర్ సాధించాడు.

ల్యాండ్‌మైన్ పేలుడులో కాలు కోల్పోయి..

దేశం గర్వించే విజయాన్ని అందించిన సోమన్ రాణా జీవితం వెనుక ఒక సుదీర్ఘమైన పోరాటం ఉంది. 1983 జనవరి 16న బీహార్‌లోని గయా జిల్లాకు చెందిన ఒక సాధారణ రైతు కుటుంబంలో సోమన్ జన్మించాడు. ఆ తర్వాత భారత సైన్యంలోని 2/8 గోర్ఖా రైఫిల్స్‌లో సిపాహిగా చేరాడు. క్రీడల పట్ల ఉన్న ఆసక్తితో ఆర్మీ యూనిట్ బాక్సింగ్ టీమ్‌లో భాగమయ్యాడు. అయితే 2006లో పూంచ్ సరిహద్దు ప్రాంతంలో విధి నిర్వహణలో ఉన్నప్పుడు అనుకోకుండా జరిగిన ల్యాండ్‌మైన్ బాంబు పేలుడులో తన కుడి కాలును కోల్పోయాడు.

ప్రపంచ వేదికపై సోమన్ విశ్వరూపం

అంతటి ఘోర ప్రమాదం జరిగినా సోమన్ గుండె ధైర్యాన్ని కోల్పోలేదు. ఆర్మీ పునరావాస కేంద్రంలో చికిత్స పొందుతున్న సమయంలో పారా స్పోర్ట్స్ వైపు ఆకర్షితుడయ్యాడు. 2017లో పారా అథ్లెటిక్స్‌లోకి అడుగుపెట్టి కఠిన శిక్షణ తీసుకున్నాడు. తన పట్టుదలతో 2020 టోక్యో పారాలింపిక్స్, 2024 పారాలింపిక్స్‌లలో భారత్‌ తరఫున ప్రాతినిధ్యం వహించాడు. ఇప్పుడు 2026 కామన్వెల్త్ గేమ్స్‌లో దేశానికి గోల్డ్ మెడల్ అందించి తన కలను నెరవేర్చుకున్నాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *